ఐటీ వ్యయాలు అంతంతమాత్రమే..
గార్ట్‌నర్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) వ్యయాలు ఈ ఏడాది అంతంతమాత్రంగానే ఉండనున్నాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ గార్ట్‌నర్ తెలిపింది. అంతకు ముందటి ఏడాదితో పోల్చితే 2016లో ఐటీ వ్యయం 0.5 శాతం ప్రతికూల వృద్ధి ఉండొచ్చని ఈ సంస్థ మూడు నెలల క్రితం అంచనా వేసింది. తాజాగా ఆ అంచనాలను సవరించింది. 2016లో ఐటీ వ్యయం స్వల్ప వృద్ధితో 3.14 లక్షల కోట్ల డాలర్లకు పెరగవచ్చని పేర్కొంది. కరెన్సీ హెచ్చుతగ్గుల కారణంగా అంచనాల్లో మార్పు వచ్చిందని వివరించింది. యూరోపియన్ యూని యన్ నుంచి బ్రిటన్ వైదొలగదనే అంచనాలతో తాజా నివేదికను రూపొందించామని పేర్కొం ది. ఒకవేళ ఈయూ నుంచి ఇంగ్లండ్ వైదొలిగితే, వ్యాపార విశ్వాసం సన్నగిల్లుతుందని, ఇది యూకే, పశ్చిమ యూరప్‌లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఐటీ వ్యయాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఇంకా గార్ట్‌నర్ నివేదిక ఏమని పేర్కొన్నదంటే..,
♦ ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం జరి గితే(బ్రెగ్జిట్), తక్షణ ప్రభావం బ్రిటన్, యూరప్ ఐటీ వ్యయాలపై పడుతుంది.
♦ తక్షణ అతి పెద్ద సమస్యగా ఉద్యోగుల తొలగింపు.
♦ కొత్తగా వచ్చే విదేశీ ఉద్యోగులకు ఇంగ్లండ్ ఏమంత ఆకర్షణీయ దేశంగా ఉండదు.
♦ బ్రిటన్‌కు చెందని ఐటీ ఉద్యోగులు ఎక్కువ కాలం ఆదేశంలో పనిచేయకపోవచ్చు. ఇతర దేశాల నుంచి ఇంగ్లండ్‌కు కొత్తగా ఐటీ ఉద్యోగులు రాకపోవచ్చు. ఫలితంగా ఇంగ్లండ్ ఐటీ విభాగాలపై ప్రభావం తీవ్రంగానే ఉంటుంది.
♦ ఐటీ వ్యాపార ప్రాధాన్యత డిజిటల్ బిజినెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అల్గారిథమిక్ వ్యాపారాలకు మారుతోంది. ఈ కొత్త అంశాలకు నిధుల కోసం పలు కంపెనీలు వ్యయ నియంత్రణ పద్దతులను పాటించనున్నాయి.
♦ డేటా సెంటర్ సిస్టమ్స్ వ్యయాలు ఈ ఏడాది 17,400 కోట్ల డాలర్లకు చేరుతాయి. అంతర్జాతీయ ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ వ్యయం 6 శాతం వృద్ధితో 33,200 కోట్ల డాలర్లకు పెరుగుతుంది. డివైస్‌లపై వ్యయం 62,700 కోట్ల డాలర్లకు చేరుతుంది.