గరిష్ట స్థాయిలో లాభాల స్వీకరణ
చమురు ధరల గమనంతో లాభాల్లో ఒడిదుడుకులు
♦ చివర్లో లాభాల స్వీకరణతో తగ్గిన లాభాలు
♦ ప్లస్ 215 పాయింట్ల నుంచి ప్లస్
♦ 50 పాయింట్లకు పరిమితమైన లాభాలు
యూరప్ ప్యాకేజీకి తోడు జపాన్ కేంద్ర బ్యాంక్ కూడా ప్యాకేజీ ఇస్తుందన్న ఆశలతో భారత స్టాక్ మార్కెట్ సోమవారం లాభాల్లో ముగిసింది. స్టాక్ మార్కెట్ వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్‌లోనూ లాభాల్లోనే ముగిసింది. అయితే రోజులో గరిష్టస్థాయి వద్ద లాభాల స్వీకరణ జరగడంతో ట్రేడింగ్ ముగింపులో స్వల్పలాభాలతోనే సూచీలు సరిపెట్టుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 50 పాయింట్లు లాభపడి 24,486 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 7,436 పాయింట్ల వద్ద ముగిసింది. లోహ, కన్సూమర్ గూడ్స్, ఫార్మా, బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి.
తగ్గిన లాభాలు...
యూరప్, జపాన్‌ల ప్యాకేజీ ఆశలతో ఆసియా మార్కెట్లు ఎగిశాయి. అమెరికాలో తీవ్రమైన మంచు తుఫాన్ నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడంతో ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ మంచి లాభాలనే కళ్లజూసింది. సోమవారం వెలువడిన కొన్ని కంపెనీల క్యూ3 ఫలితాలు ఒకింత బావుండడం, షార్ట్ పొజిషన్ల కవరింగ్ కూడా సానుకూల ప్రభావం చూపించాయి. అమెరికా తూర్పు తీరంలో మంచు తుఫాన్ చెలరేగడంతో ఆయిల్ ఫ్యూచర్స్ పెరిగాయని, దీంతో మన మార్కెట్ లాభపడిందని బీఎన్‌పీ పారిబా మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్(ఈక్విటీ) శ్రేయాష్ దేవాల్‌కర్ చెప్పారు.
అయితే యూరోప్ మార్కెట్లు ఒడిదుడుకులమయంగా సాగడం, సోమవారం యూరప్ ట్రేడింగ్‌లో చమురు ధరల్లో కరెక్షన్ కారణంగా ఇక్కడి స్టాక్ మార్కెట్లో అమ్మకాలు పెరిగాయి. జనవరి సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు మరో మూడు రోజుల్లో ఉండటంతో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించడం, కొన్ని క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్, వాహన, విద్యుత్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడం.. ఈ అంశాలన్నీ లాభాలను హరించివేశాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 15 షేర్లు లాభాల్లో ముగిశాయి.
నేడు మార్కెట్లకు సెలవు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు నేడు(మంగళవారం) సెలవు. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు పనిచేయవు. వీటితో పాటు ఫారెక్స్, మనీ మార్కెట్, బులియన్, మెటల్స్, ఇతర టోకు ధరల కమోడిటీ
మార్కెట్లన్నింటికి కూడా సెలవు.