జీఎంఆర్ కు ఫిలిప్పీన్స్ ఎయిర్‌పోర్టు
Published Sun, Apr 6 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్‌ఫ్రా దిగ్గజం జీఎంఆర్ కన్సార్షియం మరో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును దక్కించుకుంది. ఫిలిప్పీన్స్‌లోని మక్తాన్-సెబు అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి కాంట్రాక్టును చేజిక్కించుకుంది. ఈ డీల్ విలువ 320 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,920 కోట్లు) ఉంటుందని జీఎంఆర్ తెలిపింది. ఫిలిప్పీన్స్‌కి చెందిన మెగావైడ్ సంస్థతో కలసి కన్సార్షియంగా ఏర్పడి ఈ ప్రాజెక్టును దక్కించుకున్నట్లు పేర్కొంది. ఈ కాంట్రాక్టు వ్యవధి 25 సంవత్సరాలని వివరించింది. ఇప్పటికే హైదరాబాద్, న్యూఢిల్లీ, ఇస్తాంబుల్‌లో కీలకమైన ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేసిన అనుభవం తమకు ఉందని, ఫిలిప్పీన్స్ విమానాశ్రయ ప్రాజెక్టులో అది ఉపయోగపడగలదని జీఎంఆర్ ఇన్‌ఫ్రా సంస్థ చైర్మన్ జీఎం రావు తెలిపారు. మక్తాన్-సెబు విమానాశ్రయాన్ని ఫిలిప్పీన్స్‌లో ప్రాంతీయ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఆయన వివరించారు.
ప్రయాణికులు, రవాణా సదుపాయాలు పెరిగే చర్యలు తీసుకోవడం ద్వారా స్థానికంగా ఉద్యోగాల కల్పనకు, పర్యాటక రంగానికి తోడ్పడగలమని చెప్పారు. మరోవైపు, ప్రాజెక్టు విషయంలో గత కొన్నాళ్లుగా అనేక వివాదాలు ముసిరినప్పటికీ, దేశ ప్రయోజనాలకు దోహదపడేలా నిర్ణయం తీసుకున్నామని ఫిలిప్పీన్స్ రవాణా, సమాచార శాఖ (డీవోటీసీ) ప్రతినిధి మైఖేల్ ఆర్థర్ సెగాల్ తెలిపారు.
ప్రస్తుత ప్యాసింజర్ టెర్మినల్ భవంతికి కొత్త రూపునివ్వడం, అంతర్జాతీయ విమానాల కోసం కొత్త టెర్మినల్‌ను నిర్మించడం, ఎయిర్‌పోర్టు నిర్వహణ పనుల కోసం గతేడాది నవంబర్‌లో నిర్వహించిన బిడ్డింగ్‌లో జీఎంఆర్-మెగావైడ్ కన్సార్షియం అత్యధిక బిడ్‌ను దాఖలు చేయడంతో ఈ ప్రాజెక్టు దక్కింది. మిగతా ప్రక్రియను (లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడం, ప్రభుత్వానికి ప్రీమియం చెల్లింపు మొదలైనవి) జీఎంఆర్-మెగావైడ్ కన్సార్షియం 20 రోజుల్లోగా పూర్తి చేయాల్సి ఉంది.
Advertisement
Advertisement