Airport project
-
ఎల్అండ్టీకి భోగాపురం ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి భారీ ఆర్డరు దక్కించుకున్నట్లు లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి విమానాశ్రయ ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ (ఈపీసీ) కాంట్రాక్టు తమ అనుబంధ సంస్థ ఎల్అండ్టీ కన్స్ట్రక్షన్కి లభించినట్లు వివరించింది. అయితే, కాంట్రాక్టు విలువ మాత్రం వెల్లడించలేదు. సాధారణంగా రూ. 2,500 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల శ్రేణిలోని కాంట్రాక్టులను కంపెనీ భారీ ఆర్డర్లుగా పరిగణిస్తుంది. ప్రాథమికంగా ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల (ఎంపీఏ) హ్యాండ్లింగ్ సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని, తర్వాత ఇది 12 ఎంపీఏకి పెరుగుతుందని సంస్థ తెలిపింది. కాంట్రాక్టు ప్రకారం ఏటీసీ టవర్, ఎయిర్‌ఫీల్డ్ అభివృద్ధి (3,800 మీటర్ల దక్షిణ రన్‌వే, ట్యాక్సీవే, యాప్రాన్, ఎయిర్‌ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్) మొదలైన పనులు చేయాల్సి ఉంటుందని ఎల్అండ్టీ పేర్కొంది. కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో భారీ విమానాశ్రయాల్లో నిర్మాణ పనులను నిర్వహిస్తోంది. -
జీఎంఆర్ చేతికి ఇండోనేషియా ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ ఇన్ఫ్రాలో భాగమైన జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ (జీఏఎల్) తాజాగా ఇండోనేషియాలో ఒక విమానాశ్రయ ప్రాజెక్టును దక్కించుకుంది. మెడాన్‌లోని క్వాలానాము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి, నిర్వహణకు కోసం అత్యధికంగా బిడ్ చేసిన సంస్థగా నిల్చింది. మెడాన్ ఎయిర్పోర్ట్ బిడ్డింగ్ అథారిటీ అయిన అంకాశ పురా 2 (ఏపీ2) ఈ విషయాన్ని ప్రకటించినట్లు జీఎంఆర్ వెల్లడించింది. వ్యూహాత్మక భాగస్వామి ఎంపికకు సంబంధించి గెలుపొందిన బిడ్డర్‌గా తమ సంస్థ పేరును ఖరారు చేసినట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టులో జీఎంఆర్‌కు 49 శాతం, ఏపీ2కు 51 శాతం వాటాలు ఉంటాయి. కాంట్రాక్టు ప్రకారం 25 ఏళ్ల పాటు విమానాశ్రయ నిర్వహణ, అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. బిడ్డింగ్ లాంఛనాలు పూర్తి చేశాక, వచ్చే కొద్ది రోజుల్లో లెటర్ ఆఫ్ అవార్డ్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆఖర్లోగా ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు దక్కించుకోవడంపై జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ (ఇంధనం, అంతర్జాతీయ విమానాశ్రయాల విభాగం) శ్రీనివాస్ బొమ్మిడాల హర్షం వ్యక్తం చేశారు. మెడాన్ ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఇండొనేషియాలోని ఇన్ఫ్రా అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని ఆయన పేర్కొన్నారు. -
విమానాశ్రయ ప్రాజెక్టులపై ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగ కంపెనీ టాటా ప్రాజెక్ట్స్ విమానాశ్రయ ప్రాజెక్టులపై ఫోకస్ చేసింది. ఇప్పటికే అలహాబాద్ ఎయిర్పోర్ట్ సివిల్ పనులను చేజిక్కించుకుంది. మరో రెండు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ప్రాజెక్టులకు పోటీపడుతోంది. బిడ్లను సైతం దాఖలు చేసింది. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ పనులు చేపట్టే సామర్థ్యం తమకుందని టాటా ప్రాజెక్ట్స్ ఎండీ వినాయక్ దేశ్‌పాండే మీడియాకు తెలిపారు. మంగళవారమిక్కడ ఈపీసీ ప్రాజెక్టుల విషయమై సీఐఐ–టాటా ప్రాజెక్ట్స్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌తోపాటు విదేశాల్లోనూ ఇటువంటి కాంట్రాక్టులకు పోటీపడతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 100 ప్రాంతీయ విమానాశ్రయాలకు పునరుజ్జీవం తేనున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్డర్ బుక్ రూ.30,000 కోట్లు.. టాటా ప్రాజెక్ట్స్ ఈపీసీ, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్‌పోర్టేషన్, కన్స్ట్రక్షన్, అర్బన్ ఇన్ఫ్రా వంటి విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఆర్డర్ బుక్ విలువ రూ.30,000 కోట్లుంది. మూడున్నరేళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయని వినాయక్ వెల్లడించారు. ఇన్ఫ్రా రంగం రానున్న 30 ఏళ్లలో మెరుగైన వృద్ధి నమోదు చేస్తుందని చెప్పారు. కొత్త ప్రాజెక్టుల వేటలో గాయత్రీ ప్రాజెక్ట్స్ త్వరలో రూ.30,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు బిడ్లను దాఖలు చేయనున్నట్టు గాయత్రి ప్రాజెక్ట్స్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ టి.రాజీవ్‌రెడ్డి తెలిపారు. హైస్పీడ్ రైల్, మెట్రో రైల్ ప్రాజెక్టులకు పోటీపడతామన్నారు. సాంకేతిక సహాయం కోసం ఓ విదేశీ కంపెనీతో చేతులు కలిపామని తెలియజేశారు. తమ ఆర్డరు బుక్ రూ.15,000 కోట్లుందని, మార్చికల్లా ఇది రూ.20,000 కోట్లకు చేరుతుందని వెల్లడించారు. ఈపీసీ కాంట్రాక్టులే తమ ప్రాధాన్యమని, పెట్టుబడులు ఎక్కువగా ఉండే ప్రాజెక్టుల జోలికి వెళ్లబోమని స్పష్టం చేశారు. నిర్మాణం చాలా కష్టం: తెలంగాణ అంగారకుడి మీదకు వెళ్లడం సులువేమోగానీ, భారత్‌లో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి వ్యాఖ్యానించారు. దేశంలో న్యాయ వ్యవస్థ సంక్లిష్టమైనదని చెప్పారాయన. నిర్మాణ ప్రాజెక్టులకు ఆర్థిక వనరులు పరిమితమని గుర్తుచేశారు. 48 కోర్టు కేసులను దాటుకుని, అన్ని క్లియరెన్సులతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపడుతున్నట్టు చెప్పారు. -
సెర్బియా, జమైకా ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులపై జీఎంఆర్ ఆసక్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ గ్రూప్ విదేశీ గడ్డపై మరో రెండు విమానాశ్రయ ప్రాజెక్టులకు బిడ్లు దాఖలు చేయనుంది. వీటిలో సెర్బియా రాజధాని బెల్గ్రేడ్ సమీపంలోని నికోలా టెస్లాతోపాటు, జమైకాలోని కింగ్స్టన్ ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. వీటి విస్తరణ, ఆధునీకరణ పనులకు బిడ్లను దాఖలు చేయనున్నట్టు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ కపూర్ తెలిపారు. బిడ్ల దాఖలు చేయడానికి కావాల్సిన అర్హతలను కంపెనీ సాధించింది. గతేడాది నికోలా టెస్లా విమానాశ్రయం నుంచి 49 లక్షలకుపైచిలుకు, కింగ్స్టన్ ఎయిర్పోర్ట్ నుంచి 16 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. విశాఖపట్నంలోని కొత్త విమానాశ్రయ ప్రాజెక్టుకు సైతం బిడ్ దాఖలు చేయనున్నట్టు సిద్ధార్థ్ వెల్లడించారు. -
విమానాశ్రయ ప్రాజెక్టులకు రూ.4,650 కోట్లు: జీఎంఆర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కొత్తగా చేపడుతున్న విమానాశ్రయ ప్రాజెక్టులకు వచ్చే మూడేళ్లలో సుమారు రూ.4,650 కోట్లు ఖర్చు చేయనున్నట్టు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఫైనాన్స్, బిజినెస్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ కపూర్ వెల్లడించారు. ఫిలిప్పైన్స్‌లోని సెబూతోపాటు ఉత్తర గోవాలోని మోపా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్టులను జీఎంఆర్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. -
జీఎంఆర్ కు ఫిలిప్పీన్స్ ఎయిర్‌పోర్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్ఫ్రా దిగ్గజం జీఎంఆర్ కన్సార్షియం మరో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును దక్కించుకుంది. ఫిలిప్పీన్స్‌లోని మక్తాన్-సెబు అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి కాంట్రాక్టును చేజిక్కించుకుంది. ఈ డీల్ విలువ 320 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,920 కోట్లు) ఉంటుందని జీఎంఆర్ తెలిపింది. ఫిలిప్పీన్స్‌కి చెందిన మెగావైడ్ సంస్థతో కలసి కన్సార్షియంగా ఏర్పడి ఈ ప్రాజెక్టును దక్కించుకున్నట్లు పేర్కొంది. ఈ కాంట్రాక్టు వ్యవధి 25 సంవత్సరాలని వివరించింది. ఇప్పటికే హైదరాబాద్, న్యూఢిల్లీ, ఇస్తాంబుల్‌లో కీలకమైన ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేసిన అనుభవం తమకు ఉందని, ఫిలిప్పీన్స్ విమానాశ్రయ ప్రాజెక్టులో అది ఉపయోగపడగలదని జీఎంఆర్ ఇన్ఫ్రా సంస్థ చైర్మన్ జీఎం రావు తెలిపారు. మక్తాన్-సెబు విమానాశ్రయాన్ని ఫిలిప్పీన్స్‌లో ప్రాంతీయ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఆయన వివరించారు. ప్రయాణికులు, రవాణా సదుపాయాలు పెరిగే చర్యలు తీసుకోవడం ద్వారా స్థానికంగా ఉద్యోగాల కల్పనకు, పర్యాటక రంగానికి తోడ్పడగలమని చెప్పారు. మరోవైపు, ప్రాజెక్టు విషయంలో గత కొన్నాళ్లుగా అనేక వివాదాలు ముసిరినప్పటికీ, దేశ ప్రయోజనాలకు దోహదపడేలా నిర్ణయం తీసుకున్నామని ఫిలిప్పీన్స్ రవాణా, సమాచార శాఖ (డీవోటీసీ) ప్రతినిధి మైఖేల్ ఆర్థర్ సెగాల్ తెలిపారు. ప్రస్తుత ప్యాసింజర్ టెర్మినల్ భవంతికి కొత్త రూపునివ్వడం, అంతర్జాతీయ విమానాల కోసం కొత్త టెర్మినల్‌ను నిర్మించడం, ఎయిర్‌పోర్టు నిర్వహణ పనుల కోసం గతేడాది నవంబర్‌లో నిర్వహించిన బిడ్డింగ్‌లో జీఎంఆర్-మెగావైడ్ కన్సార్షియం అత్యధిక బిడ్‌ను దాఖలు చేయడంతో ఈ ప్రాజెక్టు దక్కింది. మిగతా ప్రక్రియను (లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడం, ప్రభుత్వానికి ప్రీమియం చెల్లింపు మొదలైనవి) జీఎంఆర్-మెగావైడ్ కన్సార్షియం 20 రోజుల్లోగా పూర్తి చేయాల్సి ఉంది. -
భారత ఇన్వెస్టర్లను ఇబ్బంది పెట్టొద్దు..
న్యూఢిల్లీ: జీఎంఆర్-మాలె అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు వ్యవహారంతో పాటు అన్ని విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని భారత్, మాల్దీవులు నిర్ణయించాయి. భారత పర్యటనకు వచ్చిన మాల్దీవుల కొత్త అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ గురువారం న్యూఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్‌తో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇరు పక్షాలు మూడు అవగాహన ఒప్పందా(ఎంఓయూ)లపై సంతకాలు చేశాయి. వీటిలో రెండు ఆరోగ్యం, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించినవి కాగా మరొకటి దౌత్య సంబంధమైనది. చర్చల అనంతరం మన్మోహన్, యమీన్‌లు మీడియాతో మాట్లాడారు. మాల్దీవుల్లో కొందరు భారతీయ ఇన్వెస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని యమీన్‌ను భారత ప్రధాని కోరారు. మాలె అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలని విజ్ఞప్తిచేశారు. జీఎంఆర్ చేపట్టిన 51 కోట్ల డాలర్ల ఈ ప్రాజెక్టును మాల్దీవుల ప్రభుత్వం ఏకపక్షంగా రద్దుచేసిన సంగతి విదితమే. విదేశీ పెట్టుబడులతో మాల్దీవుల్లో చేపట్టిన ఈ అతిపెద్ద ప్రాజెక్టును అక్కడి ప్రభుత్వం 2012లో బుట్టదాఖలు చేయడంతో ఆ దేశంలో భారతీయ పెట్టుబడుల భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. మాల్దీవుల అధ్యక్షునిగా ఎంపికైన అనంతరం తొలి విదేశీ పర్యటనగా భారత్‌కు వచ్చిన యమీన్‌తో రక్షణ, భద్రత, ఆర్థిక సహకారంతో సహా పలు కీలక అంశాలపై మన్మోహన్ చర్చించారు. అనంతరం, భారత్ నుంచి దిగుమతుల కోసం మాల్దీవులకు 2.50 కోట్ల డాలర్ల అదనపు రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణం దాదాపు రూ. 700 కోట్లనీ, ఇందులో భారత్ వాటానే అత్యధికమనీ అన్నారు. ముఖ్యంగా వైద్యం కోసం ఇండియాకు వచ్చే వారి కోసం వీసా నిబంధనలు సరళతరం చేయడానికి అంగీకరించామని వెల్లడించారు. భారత్‌తో బంధం కొనసాగిస్తాం: యమీన్ భారత్ తమకు అన్ని వేళలా సహకరిస్తోందనీ, ఈ సం బంధాన్ని కొనసాగించడమే తన లక్ష్యమనీ యమీన్ తెలిపారు. మాలె ఎయిర్పోర్ట్ వివాదాన్ని ప్రస్తావిస్తూ, తమ ప్రభుత్వం జీఎంఆర్‌తో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. ఈ వివాదానికి ఆర్బిట్రేషన్ ద్వారా కాకుండా కోర్టు వెలుపల పరిష్కారానికి యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారం మాల్దీవుల్లో బాగా రాజకీయ రంగు పులుముకుందని వ్యాఖ్యానించారు. ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో జీఎంఆర్‌కు మళ్లీ అవకాశం కల్పిస్తారా అన్న ప్రశ్నకు యమీన్ సూటిగా సమాధానమివ్వలేదు. అయితే, ఇతర రంగాల్లో జీఎంఆర్ పెట్టుబడులను ఆహ్వానిస్తామని తెలిపారు.