హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగ కంపెనీ టాటా ప్రాజెక్ట్స్ విమానాశ్రయ ప్రాజెక్టులపై ఫోకస్ చేసింది. ఇప్పటికే అలహాబాద్ ఎయిర్‌పోర్ట్ సివిల్ పనులను చేజిక్కించుకుంది. మరో రెండు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ప్రాజెక్టులకు పోటీపడుతోంది. బిడ్లను సైతం దాఖలు చేసింది.
ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ పనులు చేపట్టే సామర్థ్యం తమకుందని టాటా ప్రాజెక్ట్స్ ఎండీ వినాయక్ దేశ్‌పాండే మీడియాకు తెలిపారు. మంగళవారమిక్కడ ఈపీసీ ప్రాజెక్టుల విషయమై సీఐఐ–టాటా ప్రాజెక్ట్స్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌తోపాటు విదేశాల్లోనూ ఇటువంటి కాంట్రాక్టులకు పోటీపడతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 100 ప్రాంతీయ విమానాశ్రయాలకు పునరుజ్జీవం తేనున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఆర్డర్ బుక్ రూ.30,000 కోట్లు..
టాటా ప్రాజెక్ట్స్ ఈపీసీ, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్‌పోర్టేషన్, కన్‌స్ట్రక్షన్, అర్బన్ ఇన్‌ఫ్రా వంటి విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఆర్డర్ బుక్ విలువ రూ.30,000 కోట్లుంది. మూడున్నరేళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయని వినాయక్ వెల్లడించారు. ఇన్‌ఫ్రా రంగం రానున్న 30 ఏళ్లలో మెరుగైన వృద్ధి నమోదు చేస్తుందని చెప్పారు.
కొత్త ప్రాజెక్టుల వేటలో గాయత్రీ ప్రాజెక్ట్స్
త్వరలో రూ.30,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు బిడ్లను దాఖలు చేయనున్నట్టు గాయత్రి ప్రాజెక్ట్స్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ టి.రాజీవ్‌రెడ్డి తెలిపారు. హైస్పీడ్ రైల్, మెట్రో రైల్ ప్రాజెక్టులకు పోటీపడతామన్నారు. సాంకేతిక సహాయం కోసం ఓ విదేశీ కంపెనీతో చేతులు కలిపామని తెలియజేశారు. తమ ఆర్డరు బుక్ రూ.15,000 కోట్లుందని, మార్చికల్లా ఇది రూ.20,000 కోట్లకు చేరుతుందని వెల్లడించారు. ఈపీసీ కాంట్రాక్టులే తమ ప్రాధాన్యమని, పెట్టుబడులు ఎక్కువగా ఉండే ప్రాజెక్టుల జోలికి వెళ్లబోమని స్పష్టం చేశారు.
నిర్మాణం చాలా కష్టం: తెలంగాణ
అంగారకుడి మీదకు వెళ్లడం సులువేమోగానీ, భారత్‌లో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి వ్యాఖ్యానించారు. దేశంలో న్యాయ వ్యవస్థ సంక్లిష్టమైనదని చెప్పారాయన. నిర్మాణ ప్రాజెక్టులకు ఆర్థిక వనరులు పరిమితమని గుర్తుచేశారు. 48 కోర్టు కేసులను దాటుకుని, అన్ని క్లియరెన్సులతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపడుతున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment