Tata Projects
-
పార్లమెంట్ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు? ఆసక్తికర విషయాలు..
భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేశ పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తాజాగా ప్రారంభించారు. రూ.20,000 కోట్ల సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా కొత్త పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. 65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాత భవనం కంటే మూడు రెట్లు అధిక పరిమాణంలో ఆకట్టుకునే హంగులతో కొత్త పార్లమెంట్ భవనం రూపొందింది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పార్లమెంట్ భవనాన్ని ఏ నిర్మాణ సంస్థ కట్టింది. భవన నిర్మాణానికి ఎంత ఖర్చయింది.. వంటి ఆసక్తికరమైన విషయాలు మీ కోసం... నిర్మాణ సంస్థ ఇదే.. భారత పార్లమెంట్ నూతన భవనాన్ని టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ నిర్మించింది. 2020లో లార్సెన్ అండ్ టూబ్రో (L&T)పై రూ. 3.1 కోట్ల స్వల్ప మార్జిన్‌తో రూ. 861.9 కోట్లకు ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. మొదట్లో షాపూర్జీ పల్లోంజీ సంస్థ పోటీలో నిలిచినా తరువాత బిడ్డింగ్ ప్రక్రియ నుంచి వైదొలింది. రూ.940 కోట్లు.. 21 నెలల్లోనే పూర్తి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ప్రకారం.. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.940 కోట్లు. కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని కేవలం 21 నెలల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించింది టాటా కంపెనీ. ఇదీ చదవండి: రూ.75 నాణెం విడుదల.. కొత్త కాయిన్ ఇలా పొందండి.. -
పార్లమెంటు 2.0.. సర్వాంగ సుందరంగా కొత్త భవనం
ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు కొత్త భవనం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. త్రిభుజాకృతిలో నిర్మించిన ఈ భవనం దేశ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడుతూనే ఆధునిక హంగుల కలబోతగా కూడా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28 ఆదివారం కొత్త భవనాన్ని ప్రారంభించనున్నారు. వందేళ్ల నాటి పాత పార్లమెంటు భవనం నేటి అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో కొత్త భవన నిర్మాణం అవసరమైంది. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా కొత్త భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కేవలం రెండున్నరేళ్లలో నిర్మించింది. ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ నేతృత్వంలో నిర్మాణం సాగింది. ప్రస్తుతం పార్లమెంటు పక్కనే నిర్మించిన కొత్త భవనంలో అతి పెద్ద హాళ్లు, కమిటీ రూములు, సెంట్రల్ హాలు, అతి పెద్ద లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ వంటి సదుపాయాలన్నీ ఉన్నాయి. ► రూ.20 వేల కోట్లతో కూడిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రూ.970 కోట్లతో పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. ► లోక్‌సభ హాలును జాతీయ పక్షి నెమలి థీమ్‌తో నిర్మించారు. 888 మంది సభ్యులు కూర్చోవచ్చు. సభ్యుల సంఖ్య పెరిగినా ఇబ్బంది లేకుండా ప్రస్తుత లోక్‌సభ హాలు కంటే మూడు రెట్లు పెద్దగా రూపొందించారు. పార్లమెంటు సంయుక్త సమావేశాలకు కూడా చక్కగా సరిపోతుంది. 1,272 మంది సందర్శకులు సమావేశాలను తిలకించవచ్చు. ► రాజ్యసభ హాలును జాతీయ పుష్పం తామర థీమ్‌తో నిర్మించారు. 384 మంది సభ్యులు కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లున్నాయి. ► పార్లమెంటు భవన మూడు ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మ ద్వారాలని పేర్లు పెట్టారు. వీఐపీలు, ఎంపీలు, సందర్శకులకు మరో మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. ► అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో 150 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా భవన డిజైన్‌ను అహ్మదాబాద్‌కు చెందిన హెచ్సీపీ డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ రూపొందించింది. ఇది భూకంపాల్ని కూడా తట్టుకుంటుంది. ► రాజస్తాన్‌కు చెందిన ధోల్పూర్ రాళ్లతో భవనానికి అద్భుతమైన లుక్ వచ్చింది. ► పార్లమెంటు భవనంలోని ఇంటీరియర్స్ భారత సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా, భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తుకు తెచ్చేలా పలు ప్రాంతీయ కళారూపాలతో రూపొందాయి. ► భవన నిర్మాణంలో అడుగడుగునా పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేశారు. గ్రీన్ ఎనర్జీతో 30% దాకా విద్యుత్ ఆదా అవుతుంది. అత్యాధునిక టెక్నాలజీ వాడటంతో భవన నిర్వహణ ఖర్చులో ఏడాదికి రూ.1,000 కోట్లకు పైగా ఆదా అవుతుందట. ► పార్లమెంటు భవనం పైకప్పు మీద కాంస్యంతో తయారు చేసిన మన జాతీయ చిహ్నం నాలుగు సింహాలను ఏర్పాటు చేశారు. ఇది 9,500 కిలోల బరువుతో 6.5 మీటర్ల ఎత్తుంది. ► భవన నిర్మాణంలో ప్రత్యక్షంగా 2 వేల మంది కార్మికులు, పరోక్షంగా 9 వేల మంది, వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది కళాకారులు పాలుపంచుకున్నారు. ► ఆవరణలో రెండు మర్రి చెట్లు నాటారు. ► దివ్యాంగులకు అనుకూలంగా, వారు స్వేచ్ఛగా తిరిగేలా నిర్మాణం జరిగింది. ► భవనం గోడలపై పలు శ్లోకాలను రాశారు. చరిత్రలోకి తొంగి చూస్తే.. ప్రస్తుత పార్లమెంటు భవనం బ్రిటిష్ కాలం నాటిది. న్యూఢిల్లీ నగర రూపకర్తలైన ఎడ్విన్ ల్యూటెన్స్, హెర్బర్ట్ బేకర్ దీన్ని డిజైన్ చేశారు. 1921 నుంచి ఆరేళ్ల పాటు భవన నిర్మాణం సాగింది. ఈ వృత్తాకార భవనానికి 83 లక్షలు ఖర్చు అయింది. 1927 జనవరి 18న గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ దీన్ని ప్రారంభించారు. దీన్ని మ్యూజియంగా మార్చనున్నారు. ఎందుకీ నిర్మాణం? ప్రస్తుత పార్లమెంటు భవనం అవసరాలు తీర్చేలా లేదు. నియోజకవర్గాల పునర్విభజన జరిగి సభ్యుల సంఖ్య పెరిగితే సరిపోదు. మంత్రులు, మీటింగ్ హాల్స్ కొరత ఉంది. భవనంలో మార్పులు చేర్పులు చేస్తే నిర్మాణం దెబ్బ తినే ప్రమాదముంది. దానికి భూకంపాల్ని తట్టుకునే సామర్థ్యం లేదు. ఢిల్లీ ఏమో అత్యంత ప్రమాదకరమైన భూకంప జోన్–4లో ఉంది. అగ్నిప్రమాదాలను ఎదుర్కొనే ఆధునిక సౌకర్యాలూ లేవు. రాష్ట్రపతి ప్రారంభించాలి: రాహుల్ న్యూఢిల్లీ: పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ మొదలైంది. భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలే తప్ప ప్రధాని కాదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని ప్రారంభించడం రాజ్యాంగపరంగా సరైంది కాదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ కూడా ట్వీట్లు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం లోక్‌సభ, రాజ్యసభలతో కూడిన పార్లమెంటుకు రాష్ట్రపతే అధిపతి గనుక నూతన భవనాన్ని ఆయనే ప్రారంభించాలన్నారు. ఆర్జేడీ, ఎంఐఎం కూడా ప్రధాని ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక హిందూత్వవాది వి.డి. సావర్కర్ జయంతి నాడే (ఈ నెల 28న) ప్రారంభోత్సవం జరపనుండటాన్నీ విపక్షాలు తీవ్రంఆక్షేపిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నెలాఖరుకు పార్లమెంట్ నూతన భవనం సిద్ధం
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనం ఈ జనవరి చివరి నాటికి సిద్ధమవుతుందని అధికారవర్గాలు తెలిపాయి. బడ్జెట్ సమావేశాలను కొత్త భవనంలోనే జరిపేదీ లేనిదీ త్వరలోనే కేంద్రం నిర్ణయించే అవవకాశాలున్నాయని తెలిపాయి. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టాలో భాగమే పార్లమెంట్ కొత్త భవనం. రాష్ట్రపతి భవన్– ఇండియా గేట్ మధ్యలోని మూడు కిలోమీటర్ల పొడవైన రాజ్‌పథ్ నవీకరణ, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, ప్రధాని కొత్త కార్యాలయం, నివాసం, ఉపరాష్ట్రపతి ఎన్క్లేవ్ వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చేపట్టింది. -
టాటా ప్రాజెక్ట్స్ చేతికి నోయిడా ఎయిర్పోర్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విభిన్న రంగాల్లో ఉన్న టాటా గ్రూప్ కంపెనీ, మౌలిక రంగ నిర్మాణ సంస్థ టాటా ప్రాజెక్ట్స్ తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ కాంట్రాక్ట్‌ను చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా టెర్మినల్, రన్‌వే, ట్యాక్సీవే, రోడ్లు, విద్యుత్, మంచినీటి ఏర్పాట్లు, అనుబంధ భవనాలను టాటా ప్రాజెక్ట్స్ నిర్మించాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్టును 2019లో స్విస్ డెవలపర్ జ్యూరిక్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఏజీ దక్కించుకుంది. విమానాశ్రయ అభివృద్ధికై యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐఏపీఎల్) పేరుతో స్పెషల్ పర్పస్ వెహికిల్‌ను ఏర్పాటు చేసింది. 1,334 హెక్టార్ల విస్తీర్ణంలో విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. తొలి దశలో ఒకే రన్‌వేతో ఏటా 1.2 కోట్ల మందికి సేవలు అందించే సామర్థ్యంతో రూ.5,700 కోట్ల పెట్టుబడితో ఇది రానుంది. 2024లో విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. -
కొత్త పార్లమెంట్ కాంట్రాక్టు టాటాలకే
న్యూఢిల్లీ: కొత్తగా కట్టే పార్లమెంట్ భవనాల నిర్మాణ బాధ్యతలను టాటా ప్రాజెక్ట్స్ బుధవారం గెలుచుకుంది. కొత్తగా పార్లమెంట్ భవన సముదాయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకొని బిడ్లు ఆహ్వానించింది. ఇందుకోసం టాటా ప్రాజెక్ట్స్ రూ. 861.90 కోట్లతో బిడ్‌వేయగా, ఎల్అండ్టీ రూ. 865 కోట్లకు బిడ్ ధాఖలు చేసింది. దీంతో ప్రాజెక్టును టాటాలకు ఖరారు చేశారు. ప్రస్తుత పార్లమెంట్‌కు దగ్గరోనే సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద కొత్త భవనాలు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ సెక్రటేరియట్ భవనం నిర్మించడమే కాకుండా రాజ్‌పథ్ రోడ్‌ను మెరుగుపరుస్తారు. అంతేకాకుండా ప్రధాని నివాసం, కార్యాలయాలను సౌత్‌బ్లాక్ దగ్గరకు, ఉపరాష్ట్రపతి నూతన నివాసాన్ని నార్త్‌బ్లాక్ దగ్గరలోకి మారతాయి. గుజరాత్‌కు చెందిన హెచ్సీపీ సంస్థ ప్రాజెక్టు నిర్మాణాల ఆర్కిటెక్చర్‌ను సమకూరుస్తోంది. ప్రాజెక్టు కోసం ప్రస్తుత ఉపరాష్ట్రపతి నివాస బంగ్లా, ఉద్యోగ భవన్, కృషి భవన్, శాస్త్రీ భవన్ తదితరాలను కూల్చనున్నారు. 21 నెలల్లో పార్లమెంట్ నిర్మాణం పూర్తవుతుందని అంచనా. అయితే ఇంకా నిర్మాణ ఆరంభ తేదీని నిర్ణయించలేదు. పార్లమెంట్ హౌస్ ఎస్టేట్‌లోని ప్లాట్ నంబర్ 118లో ఈ భవన నిర్మాణం జరుగుతుందని సీపీడబ్లు్యడీ తెలిపింది. కొత్త భవనాలు పూర్తయ్యేవరకు పాత భవనాల్లోనే కార్యకలాపాలు కొనసాగిస్తారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల సంఖ్య పెరుగనుంది. కొత్త పార్లమెంట్ భవనంలో దాదాపు 1400 మంది ఎంపీలు కూర్చునే వీలుంటుంది. ఈ ప్రాజెక్టు చేపట్టే ప్రాంతం ల్యూటెన్ ఢిల్లీలో ఉంది. -
ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దక్కించుకున్న టాటా
సాక్షి, న్యూఢిల్లీ : నూతన పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్టును టాటా దక్కించుకుంది. ఆర్థిక బిడ్స్‌లో బుధవారం ఎల్అండ్టీతో పోటీ పడి టాటా ప్రాజెక్ట్స్ పార్లమెంట్ నూతన భవన నిర్మాణ కాంట్రాక్టును చేజిక్కించుకుంది. ఈ ప్రాజెక్టును 861.90 కోట్ల రూపాయలతో పూర్తి చేయనున్నట్టు టాటా ప్రాజెక్ట్ పేర్కొంది. నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి ఎల్అండ్టీ దాఖలు చేసిన రూ .865 కోట్ల కంటే తక్కువ మొత్తం దాఖలు చేసి టాటా గ్రూప్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మాణాన్ని దక్కించుకుంది. నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రజా పనుల శాఖ ఈ రోజు ఆర్థిక వేలం నిర్వహించింది. కాగా, పార్లమెంట్ భవన నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేయనున్నట్లు సమాచారం. త్రిభుజాకారంలో నిర్మించనున్న ఈ భవనానికి మొత్తంగా 940 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ప్రభుత్వ ప్రజా పనుల శాఖ అంచనా వేసింది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ప్రస్తుత భవనానికి మరమ్మత్తులు చేసిన అనంతరం ఇతర అవసరాల కోసం వినియోగించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, పార్లమెంట్ నూతన భవన నిర్మాణానికి సంబంధించి ఈ ఏడాది ఆరంభంలోనే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులు త్రిభుజాకార భవనంగా దీన్ని నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్టు సమాచారం. నూతన పార్లమెంట్ భవనంపై భారత జాతీయ చిహ్నం ముద్రిస్తారని తెలిసింది. పార్లమెంట్ హౌస్ ఎస్టేట్‌లోని 118వ నెంబర్ ప్లాట్‌లో 60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నూతన భవనం కొలువుతీరనుంది. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్‌లో భాగంగా తొలి ప్రాజెక్టుగా పార్లమెంట్ నూతన భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. చదవండి : ప్రశ్నోత్తరాల రద్దుపై విపక్షాల ఆందోళన -
విమానాశ్రయ ప్రాజెక్టులపై ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగ కంపెనీ టాటా ప్రాజెక్ట్స్ విమానాశ్రయ ప్రాజెక్టులపై ఫోకస్ చేసింది. ఇప్పటికే అలహాబాద్ ఎయిర్పోర్ట్ సివిల్ పనులను చేజిక్కించుకుంది. మరో రెండు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ప్రాజెక్టులకు పోటీపడుతోంది. బిడ్లను సైతం దాఖలు చేసింది. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ పనులు చేపట్టే సామర్థ్యం తమకుందని టాటా ప్రాజెక్ట్స్ ఎండీ వినాయక్ దేశ్‌పాండే మీడియాకు తెలిపారు. మంగళవారమిక్కడ ఈపీసీ ప్రాజెక్టుల విషయమై సీఐఐ–టాటా ప్రాజెక్ట్స్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌తోపాటు విదేశాల్లోనూ ఇటువంటి కాంట్రాక్టులకు పోటీపడతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 100 ప్రాంతీయ విమానాశ్రయాలకు పునరుజ్జీవం తేనున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్డర్ బుక్ రూ.30,000 కోట్లు.. టాటా ప్రాజెక్ట్స్ ఈపీసీ, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్‌పోర్టేషన్, కన్స్ట్రక్షన్, అర్బన్ ఇన్ఫ్రా వంటి విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఆర్డర్ బుక్ విలువ రూ.30,000 కోట్లుంది. మూడున్నరేళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయని వినాయక్ వెల్లడించారు. ఇన్ఫ్రా రంగం రానున్న 30 ఏళ్లలో మెరుగైన వృద్ధి నమోదు చేస్తుందని చెప్పారు. కొత్త ప్రాజెక్టుల వేటలో గాయత్రీ ప్రాజెక్ట్స్ త్వరలో రూ.30,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు బిడ్లను దాఖలు చేయనున్నట్టు గాయత్రి ప్రాజెక్ట్స్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ టి.రాజీవ్‌రెడ్డి తెలిపారు. హైస్పీడ్ రైల్, మెట్రో రైల్ ప్రాజెక్టులకు పోటీపడతామన్నారు. సాంకేతిక సహాయం కోసం ఓ విదేశీ కంపెనీతో చేతులు కలిపామని తెలియజేశారు. తమ ఆర్డరు బుక్ రూ.15,000 కోట్లుందని, మార్చికల్లా ఇది రూ.20,000 కోట్లకు చేరుతుందని వెల్లడించారు. ఈపీసీ కాంట్రాక్టులే తమ ప్రాధాన్యమని, పెట్టుబడులు ఎక్కువగా ఉండే ప్రాజెక్టుల జోలికి వెళ్లబోమని స్పష్టం చేశారు. నిర్మాణం చాలా కష్టం: తెలంగాణ అంగారకుడి మీదకు వెళ్లడం సులువేమోగానీ, భారత్‌లో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి వ్యాఖ్యానించారు. దేశంలో న్యాయ వ్యవస్థ సంక్లిష్టమైనదని చెప్పారాయన. నిర్మాణ ప్రాజెక్టులకు ఆర్థిక వనరులు పరిమితమని గుర్తుచేశారు. 48 కోర్టు కేసులను దాటుకుని, అన్ని క్లియరెన్సులతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపడుతున్నట్టు చెప్పారు. -
టాటా ప్రాజెక్ట్స్లోరూ.335 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా ప్రాజెక్ట్సెలో టాటా ఆపర్చ్యునిటీస్ ఫండ్ రూ.335 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. టాటా క్యాపిటల్‌కు చెందిన టాటా ఆపర్చునిటీస్ ఫండ్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్ఫ్రా కంపెనీ టాటా ప్రాజెక్ట్సెలో ఈ పెట్టుబడి పెట్టింది. ఇది టాటా ఆపర్చ్యునిటీస్ ఫండ్ చేసిన తొలి ఇన్ఫ్రా పెట్టుబడని కంపెనీ పేర్కొంది. -
జీఎంఆర్‌కు ఎంఎంటీఎస్ కాంట్రాక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దీర్ఘకాలంగా వేచిచూస్తున్న హైదరాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశ పనుల్లో ముందడుగు పడింది. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) ఫేజ్-2 కాంట్రాక్టును జీఎంఆర్ ఇన్ఫ్రా దక్కించుకుంది. ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి మొత్తం రూ.389 కోట్ల విలువైన కాంట్రాక్టులను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నుంచి దక్కించుకున్నట్లు జీఎంఆర్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్‌ను రెండు లైన్లుగా విస్తరించడంతో పాటు, బ్రిడ్జీల నిర్మాణం, రోడ్ బెడ్, సిగ్నల్స్‌కు సంబంధించి టెలికాం వర్కులు, విద్యుదీకరణ పనులను జీఎంఆర్ చేపట్టనుంది. టాటా ప్రాజెక్ట్స్, కాళిందీ రైల్ నిగమ్ లిమిటెడ్‌తో కలిసి చేపడుతున్న ఈ కాంట్రాక్టులో జీఎంఆర్ వాటా రూ.207కోట్లు. వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామని, 30 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుందని జీఎంఆర్ ఆ ప్రకటనలో పేర్కొంది.