జీఎంఆర్‌కు ఎంఎంటీఎస్ కాంట్రాక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దీర్ఘకాలంగా వేచిచూస్తున్న హైదరాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశ పనుల్లో ముందడుగు పడింది. మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) ఫేజ్-2 కాంట్రాక్టును జీఎంఆర్ ఇన్‌ఫ్రా దక్కించుకుంది. ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి మొత్తం రూ.389 కోట్ల విలువైన కాంట్రాక్టులను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నుంచి దక్కించుకున్నట్లు జీఎంఆర్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్‌ను రెండు లైన్లుగా విస్తరించడంతో పాటు, బ్రిడ్జీల నిర్మాణం, రోడ్ బెడ్, సిగ్నల్స్‌కు సంబంధించి టెలికాం వర్కులు, విద్యుదీకరణ పనులను జీఎంఆర్ చేపట్టనుంది. టాటా ప్రాజెక్ట్స్, కాళిందీ రైల్ నిగమ్ లిమిటెడ్‌తో కలిసి చేపడుతున్న ఈ కాంట్రాక్టులో జీఎంఆర్ వాటా రూ.207కోట్లు. వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామని, 30 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుందని జీఎంఆర్ ఆ ప్రకటనలో పేర్కొంది.