GMR Infrastructure Limited
-
జీఎంఆర్ ఇన్ఫ్రా పేరు మార్పు
న్యూఢిల్లీ: జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ పేరు ఇక జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌గా మారనుంది. ఈ ప్రతిపాదనకు సంబంధించి షేర్‌హోల్డర్ల నుంచి అనుమతి తీసుకోనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలియజేసింది. ఎలక్ట్రానిక్ విధానంలో ఓటింగ్ జులై 29న ప్రారంభమై ఆగస్టు 27న ముగుస్తుందని వివరించింది. హైదరాబాద్, ఢిల్లీ ఎయిర్‌పోర్టులతో పాటు ఫిలిప్పీన్స్‌లోని మక్టాన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను కూడా జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తోంది. -
రూ.4,987 కోట్ల నష్ట పరిహారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మాలే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కాంట్రాక్టును ఏకపక్షంగా రద్దు చేసినందుకు గాను మాల్దీవుల ప్రభుత్వం నంచి రూ. 4,987 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా జీఎంఆర్ గ్రూపు కోరింది. ఎయిర్‌పోర్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ మాల్దీవుల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అర్బిట్రల్ ట్రిబ్యునల్ తప్పు పట్టిన సంగతి తెలిసిందే. ట్రిబ్యునల్ తీర్పును అనుసరించి 803 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. మాలేలో ఉన్న ఇబ్రహిం నాసిర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసి నిర్వహించే కాంట్రాక్టును 2010లో జీఎంఆర్ అనుబంధ కంపెనీ జీఎంఆర్ మాలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఎంఐఏఎల్) దక్కించుకుంది. ఆ తర్వాత మాల్దీవుల్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2012లో ఈ కాంట్రాక్టును రద్దు చేసింది. దీనిపై జీఎంఆర్ గ్రూపు సింగపూర్ కోర్టును ఆశ్రయించింది. ఈ వివాదంపై ఏర్పడిన ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఈ ఏడాది జూన్ 14న జీఎంఆర్‌కి అనుకూలంగా తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. -
జీఎంఆర్‌కు ఎంఎంటీఎస్ కాంట్రాక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దీర్ఘకాలంగా వేచిచూస్తున్న హైదరాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశ పనుల్లో ముందడుగు పడింది. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) ఫేజ్-2 కాంట్రాక్టును జీఎంఆర్ ఇన్ఫ్రా దక్కించుకుంది. ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి మొత్తం రూ.389 కోట్ల విలువైన కాంట్రాక్టులను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నుంచి దక్కించుకున్నట్లు జీఎంఆర్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్‌ను రెండు లైన్లుగా విస్తరించడంతో పాటు, బ్రిడ్జీల నిర్మాణం, రోడ్ బెడ్, సిగ్నల్స్‌కు సంబంధించి టెలికాం వర్కులు, విద్యుదీకరణ పనులను జీఎంఆర్ చేపట్టనుంది. టాటా ప్రాజెక్ట్స్, కాళిందీ రైల్ నిగమ్ లిమిటెడ్‌తో కలిసి చేపడుతున్న ఈ కాంట్రాక్టులో జీఎంఆర్ వాటా రూ.207కోట్లు. వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామని, 30 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుందని జీఎంఆర్ ఆ ప్రకటనలో పేర్కొంది.