రూ.4,987 కోట్ల నష్ట పరిహారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మాలే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కాంట్రాక్టును ఏకపక్షంగా రద్దు చేసినందుకు గాను మాల్దీవుల ప్రభుత్వం నంచి రూ. 4,987 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా జీఎంఆర్ గ్రూపు కోరింది. ఎయిర్‌పోర్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ మాల్దీవుల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అర్బిట్రల్ ట్రిబ్యునల్ తప్పు పట్టిన సంగతి తెలిసిందే.
ట్రిబ్యునల్ తీర్పును అనుసరించి 803 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినట్లు జీఎంఆర్ ఇన్‌ఫ్రా స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. మాలేలో ఉన్న ఇబ్రహిం నాసిర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసి నిర్వహించే కాంట్రాక్టును 2010లో జీఎంఆర్ అనుబంధ కంపెనీ జీఎంఆర్ మాలే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఎంఐఏఎల్) దక్కించుకుంది. ఆ తర్వాత మాల్దీవుల్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2012లో ఈ కాంట్రాక్టును రద్దు చేసింది. దీనిపై జీఎంఆర్ గ్రూపు సింగపూర్ కోర్టును ఆశ్రయించింది. ఈ వివాదంపై ఏర్పడిన ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఈ ఏడాది జూన్ 14న జీఎంఆర్‌కి అనుకూలంగా తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.