మోదీ ఎఫెక్ట్.. మాల్దీవుల మయిజ్జూకు కొత్త టెన్షన్!
మాలే: మాల్దీవుల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాల్దీవుల్లోని మహ్మద్ మయిజ్జూ ప్రభుత్వానికి తాజాగా మరో షాక్ తగిలింది. భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్న మాల్దీవుల ప్రభుత్వంపై స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మాల్దీవుల్లో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై విరుచుకుపడుతున్నాయి.
వివరాల ప్రకారం.. భారత వ్యతిరేక వైఖరి దేశ అభివృద్ధికి హానికరంగా పరిణమించవచ్చునని రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ (ఎండీపీ), డెమోక్రాట్స్ పార్టీల నేతలు మయిజ్జూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి భాగస్వామిని దూరం చేసుకోవడటం ఏమాత్రం సబబుకాదని, మరీ ముఖ్యంగా సుదీర్ఘకాలంగా మైత్రిని కొనసాగిస్తున్న దేశాన్ని దూరం చేసుకుంటే దీర్ఘకాలిక అభివృద్ధికి హానికరమని ఎండీపీ, డెమోక్రాట్ పార్టీల నేతలు విమర్శించారు.
అయితే, రెండు రోజుల క్రితం చైనాకు చెందిన గూఢాచార నౌక మాల్దీవుల నౌకాశ్రయంలో తిష్ట వేయడం ఆసక్తికరంగా మారింది. భారత్‌తో దౌత్య బంధాలు దెబ్బతినడంతో మాల్దీవుల ప్రభుత్వం చైనా సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. దీంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో రాజకీయ, సైనిక మార్పులు వచ్చాయని అక్కడి ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇదే సమయంలో భారత్‌ను దీర్ఘకాల మిత్రదేశంగా ప్రతిపక్షాలు అభివర్ణించాయి. విదేశాంగ విధానంలో భాగంగా ప్రభుత్వం అన్ని అభివృద్ధి భాగస్వాములతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని విపక్ష నేతలు పేర్కొన్నారు.
Two major opposition parties in the Maldives, the Maldivian Democratic Party (MDP) and The Democrats, have voiced concerns over President Mohammad Muizzu's perceived 'anti-India' stance. pic.twitter.com/Y7OlSJMets
— Mohit Vijh (@vijh_mohit) January 25, 2024
మాల్దీవుల స్థిరత్వం, భద్రతకు హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్థిరత్వం, శాంతి, భద్రత చాలా ముఖ్యమైనదని ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు సూచించాయి. ఈ మేరకు ఎండీపీ చైర్మన్ ఫయాజ్ ఇస్మాయిల్, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ అహ్మద్ సలీమ్, డెమొక్రాట్స్ పార్టీ చీఫ్ హసన్ లతీఫ్, పార్లమెంటరీ గ్రూప్ లీడర్ అలీ అజీమ్‌లు ఉమ్మడి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఇదిలా ఉండగా.. భారత ప్రధాని మోదీ లక్షదీప్ పర్యటన అనంతరం.. జనవరి 8న చైనాలో నాలుగు రోజుల అధికారిక పర్యటనకు ముయిజ్జూ వెళ్లారు. అదే సందర్భంలో ఆయన ప్రభుత్వంలోని ముగ్గురు ఉప మంత్రులు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించీ, మొత్తంగా భారతీయుల గురించీ అవమానకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేయడంతో వివాదం చెలరేగింది. చైనాలో మయిజ్జూ కూడా భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. అయితే, కొన్ని సంవత్సరాలుగా, మాల్దీవులను సందర్శించేవారిలో భారతీయుల వాటా అత్యధికం. తాజా పరిణామంతో మాల్దీవులను సందర్శించాలనుకున్న భారతీయులు తమ హోటల్, విమాన బుకింగ్‌లను రద్దు చేసుకున్నారు. మరోవైపు.. దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో భారత్ తన దళాలను ఉపసంహరించుకోవాలని మాల్దీవులు ప్రభుత్వం చెప్పింది. ఇందుకు మార్చి 5 గడువు తేదీగా విధించింది.