భారత ఇన్వెస్టర్లను ఇబ్బంది పెట్టొద్దు.. | Airport project: Maldives hopes for out-of-court settlement with GMR | Sakshi
Sakshi News home page

భారత ఇన్వెస్టర్లను ఇబ్బంది పెట్టొద్దు..

Published Fri, Jan 3 2014 1:58 AM | Last Updated on Tue, Oct 9 2018 4:27 PM

భారత ఇన్వెస్టర్లను ఇబ్బంది పెట్టొద్దు.. - Sakshi

భారత ఇన్వెస్టర్లను ఇబ్బంది పెట్టొద్దు..

న్యూఢిల్లీ: జీఎంఆర్-మాలె అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు వ్యవహారంతో పాటు అన్ని విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని భారత్, మాల్దీవులు నిర్ణయించాయి. భారత పర్యటనకు వచ్చిన మాల్దీవుల కొత్త అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ గురువారం న్యూఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్‌తో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇరు పక్షాలు మూడు అవగాహన ఒప్పందా(ఎంఓయూ)లపై సంతకాలు చేశాయి. వీటిలో రెండు ఆరోగ్యం, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించినవి కాగా మరొకటి దౌత్య సంబంధమైనది. చర్చల అనంతరం మన్మోహన్, యమీన్‌లు మీడియాతో మాట్లాడారు.
 
 మాల్దీవుల్లో కొందరు భారతీయ ఇన్వెస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని యమీన్‌ను భారత ప్రధాని కోరారు. మాలె అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలని విజ్ఞప్తిచేశారు. జీఎంఆర్ చేపట్టిన 51 కోట్ల డాలర్ల ఈ ప్రాజెక్టును మాల్దీవుల ప్రభుత్వం ఏకపక్షంగా రద్దుచేసిన సంగతి విదితమే. విదేశీ పెట్టుబడులతో మాల్దీవుల్లో చేపట్టిన ఈ అతిపెద్ద ప్రాజెక్టును అక్కడి ప్రభుత్వం 2012లో బుట్టదాఖలు చేయడంతో ఆ దేశంలో భారతీయ పెట్టుబడుల భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. మాల్దీవుల అధ్యక్షునిగా ఎంపికైన అనంతరం తొలి విదేశీ పర్యటనగా భారత్‌కు వచ్చిన యమీన్‌తో రక్షణ, భద్రత, ఆర్థిక సహకారంతో సహా పలు కీలక అంశాలపై మన్మోహన్ చర్చించారు. అనంతరం, భారత్ నుంచి దిగుమతుల కోసం మాల్దీవులకు 2.50 కోట్ల డాలర్ల అదనపు రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణం దాదాపు రూ. 700 కోట్లనీ, ఇందులో భారత్ వాటానే అత్యధికమనీ అన్నారు. ముఖ్యంగా వైద్యం కోసం ఇండియాకు వచ్చే వారి కోసం వీసా నిబంధనలు సరళతరం చేయడానికి అంగీకరించామని వెల్లడించారు.
 
 భారత్‌తో బంధం కొనసాగిస్తాం: యమీన్
 భారత్ తమకు అన్ని వేళలా సహకరిస్తోందనీ, ఈ సం బంధాన్ని కొనసాగించడమే తన లక్ష్యమనీ యమీన్ తెలిపారు. మాలె ఎయిర్‌పోర్ట్ వివాదాన్ని ప్రస్తావిస్తూ, తమ ప్రభుత్వం జీఎంఆర్‌తో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. ఈ వివాదానికి ఆర్బిట్రేషన్ ద్వారా కాకుండా కోర్టు వెలుపల పరిష్కారానికి యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారం మాల్దీవుల్లో బాగా రాజకీయ రంగు పులుముకుందని వ్యాఖ్యానించారు. ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులో జీఎంఆర్‌కు మళ్లీ అవకాశం కల్పిస్తారా అన్న ప్రశ్నకు యమీన్ సూటిగా సమాధానమివ్వలేదు. అయితే, ఇతర రంగాల్లో జీఎంఆర్ పెట్టుబడులను ఆహ్వానిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement