
మాల్దీవులుపై 3–0 గోల్స్ తేడాతో భారత్ ఘనవిజయం
షిల్లాంగ్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ పునరాగమనంలో భారత జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి గోల్‌తో మెరిశాడు. ఫలితంగా 12 మ్యాచ్‌ల నుంచి విజయం లేకుండా సాగుతున్న భారత ఫుట్‌బాల్ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. బుధవారం జరిగిన అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌లో భారత్ 3–0 గోల్స్ తేడాతో మాల్దీవులుపై నెగ్గింది. భారత్ తరఫున రాహుల్ (35వ నిమిషంలో), లిస్టన్ కొలాకో (66వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.
గత ఏడాది జూన్‌లో అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన 40 ఏళ్ల ఛెత్రి 77వ నిమిషంలో గోల్ చేసి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచాడు. ఛెత్రి కెరీర్‌లో ఇది 95వ అంతర్జాతీయ గోల్. తన రిటైర్మెంట్ తర్వాత జాతీయ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా ఛెత్రి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. 286 రోజుల అనంతరం ‘బ్లూ జెర్సీ’లో మైదానంలో అడుగు పెట్టాడు.
సునీల్‌కు ఇది 152వ మ్యాచ్ కాగా... 16 నెలల తర్వాత భారత జట్టు తొలి విజయం నమోదు చేసుకుంది. మొనొలో భారత ఫుట్‌బాల్ జట్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం జట్టుకు ఇదే మొదటి గెలుపు. భారత జట్టు చివరిసారిగా ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో భాగంగా 2023 నవంబర్ 16న కువైట్‌పై విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment