గోవా ఎయిర్పోర్టు నిర్మాణానికి జీఎంఆర్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఉత్తర గోవాలోని మోపాలో కొత్త విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి గోవా ప్రభుత్వంతో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దశ పనులు 2019-20 నాటికి పూర్తి కాగలవని అంచనా. నిర్దేశిత కాల వ్యవధిలోనే ప్రాజెక్టులను పూర్తి చేయగలమని జీఎంఆర్ గ్రూప్ ఎరుుర్‌పోర్ట్స్ విభాగం చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల తెలిపారు. గోవాలో కీలకమైన దబోలిమ్ తర్వాత రెండో విమానాశ్రయమైనప్పటికీ.. ఈ ప్రాజెక్టు లాభదాయకతపై సందేహాలు అక్కర్లేదని, మోపా విమానాశ్రయంలోనూ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగగలదని ఆయన వివరించారు.
దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ట్రాఫిక్ 16-18 శాతం వృద్ధి చెందుతోందని శ్రీనివాస్ చెప్పారు. మోపా విమానాశ్రయంతో స్థానికులకు కూడా ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నందున, దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయ రూపకల్పన, నిర్మాణం, 40 ఏళ్ల పాటు నిర్వహణ కార్యకలాపాలకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టులో జీఎంఆర్ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకునేందుకు 60 ఏళ్ల వ్యవధికి కంపెనీకి 232 ఎకరాల స్థలం లభిస్తుంది. జీఎంఆర్ గ్రూప్ ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్వహిస్తోండగా, ఫిలిప్పీన్‌సలో మక్టాన్ సెబు ఇంటర్నేషనల్ ఎరుుర్‌పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్ట్ చేపట్టింది. ఇటీవలే గ్రీస్‌లోని హెరాక్లియోన్ విమానాశ్రయ ప్రాజెక్టును దక్కించుకుంది.