
సాక్షి, న్యూఢిల్లీ : విమానయాన రంగంలో నెలకొన్న పోటీ నేపథ్యంలో ఎయిర్‌లైన్ సంస్థలు ఆఫర్లతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా బడ్జెట్ ఎయిర్‌లైన్ గో ఎయిర్ అంతర్జాతీయ విమాన టికెట్లపై రాయితీ ధరలను ప్రకటించింది. ముఖ్యంగా కేరళలోని కన్నూరు -మస్కట్- కన్నూరు మధ్య నడిచే విమానాలకు ఈ ధరలు వర్తించనున్నాయి.
ఫిబ్రవరి 28 నుంచి వారానికి మూడు (మంగళ, గురు, శని వారాల్లో) డైరెక్ట్ విమాన సర్వీసులను నడుపుతుంది. అన్ని చార్జీలు కలుపుకుని ఇంటర్నేషనల్ ఎయిర్ టికెట్ ధరలు (ఒకవైపు) రూ.4999 నుంచి ప్రారంభం అవుతాయని గో ఎయిర్ వెల్లడించింది. తక్షణమే అంటే ఈ రోజు (జనవరి 19) నుంచి ఈ డిస్కౌంట్ ధరల్లో టికెట్లు లభ్యమవుతాయని తెలిపింది. మరిన్ని వివరాలు గోఎయిర్ అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యం.