బంగారం భారీ పతనం
• అంతర్జాతీయ మార్కెట్‌లో 36 డాలర్లు క్షీణత
• దేశీయంగా రూ.600కు పైగా డౌన్
న్యూయార్క్/ ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ పావుశాతం వడ్డీరేటు పెంపు (0.25–0.50 శాతం శ్రేణి) ప్రభావం పసిడిపై సుస్పష్టమవుతోంది. పసిడి నుంచి పెట్టుబడులు వేగంగా బయటకు వెళుతున్నాయి. గురువారం ఒక్కరోజు కడపటి సమాచారం అందే సరికి అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్– నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర 36 డాలర్లు (3%) పడిపోయి రూ.1,127 డాలర్లకు తగ్గింది. ఇక వెండి కూడా ఇక్కడ 1% పైగా పడిపోయి, 16 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
దేశీయంగా...
ఇదే ధోరణి దేశీయ ఫ్యూచర్స్ మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో కూడా కనిపించింది. పసిడి 10 గ్రాముల ధర కడపటి సమాచారం అందే సరికి రూ.653 పడిపోయి (2 శాతం) రూ.26,934 వద్ద ట్రేడవుతోంది. వెండి సైతం భారీగా 6 శాతం పడిపోయింది. కేజీకి రూ.2,378 నష్టంతో రూ.39,350 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే, శుక్రవారం స్పాట్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులుఅంచనా వేస్తున్నారు. గురువారం ముంబై స్పాట్ మార్కెట్‌లో పసిడి ధర రూ.550 పడిపోయింది. 99.9, 99.5 స్వచ్ఛత ధరలు వరుసగా రూ.27,500, రూ.27,350 వద్ద ముగిశాయి. ఇక వెండి కూడా కేజీకి రూ.1,410పడిపోయి రూ.40,200కు దిగింది.