మళ్లీ పసిడి మెరుపులు...
న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు పసిడిని హఠాత్తుగా మెరిసేలా చేస్తున్నాయి. రెండురోజులుగా కొంచెం వెనక్కు తగ్గిన్నట్లు కనిపించిన పసిడి మళ్లీ బుధవారం పరుగులు పెడుతోంది. అంతర్జాతీయ నెమైక్స్ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న ఏప్రిల్ కాంట్రాక్ట్ ధర ఔన్స్ (31.1గ్రా)కు క్రితం ముగింపుతో పోల్చితే కడపటి సమాచారం అందేసరికి 27 డాలర్ల లాభంతో 1,250 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. కడపటి సమాచారం అందే సరికి 10 గ్రాముల ధర క్రితంతో పోల్చితే రూ. 500 లాభంతో రూ. 29,800 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే గురువారం స్పాట్ మార్కెట్లో ధర మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా బుధవారం ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో పసిడి 10 గ్రాములు 99.9 స్వచ్ఛత ధర క్రితం ముగింపుతో పోల్చితే... రూ.365 లాభంతో రూ.29,235కు చేరింది. 99.5 స్వచ్ఛత పసిడి ధర సైతం ఇదే స్థాయిలో ఎగసి రూ.29,085కు ఎగసింది.