వన్నె తగ్గుతున్న గోల్డ్‌ ఈటీఎఫ్‌లు | Gold ETFs See Rs 290 cr Outflow in Apr to Oct | Sakshi
Sakshi News home page

వన్నె తగ్గుతున్న గోల్డ్‌ ఈటీఎఫ్‌లు

Published Wed, Nov 28 2018 8:16 AM | Last Updated on Wed, Nov 28 2018 8:16 AM

Gold ETFs See Rs 290 cr Outflow in Apr to Oct - Sakshi

న్యూఢిల్లీ: గోల్డ్‌ ఈటీఎఫ్‌ (ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌) ప్రభ మసకబారుతోంది. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం కొనసాగుతూనే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌– అక్టోబర్‌ కాలానికి ఇన్వెస్టర్లు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి రూ.290 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్న పెట్టుబడులు రూ.422 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద గోల్డ్‌ ఈటీఎఫ్‌లు వన్నె తగ్గుతున్నాయని అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌  ఫండ్స్‌ ఇన్‌ ఇండియా(ఆంఫీ) తాజా నివేదిక పేర్కొంది. మరోవైపు ఈక్విటీ, ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)లో పెట్టుబడులు రూ.75,000 కోట్లకు పెరిగాయని ఈ నివేదిక తెలిపింది. ఒక్క అక్టోబర్‌లోనే ఈ ఫండ్స్‌లో రూ.14,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించింది. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–అక్టోబర్‌ కాలానికి మ్యూచువల్‌ ఫండ్స్‌లో నికరంగా రూ.81,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంకా ఈ నివేదిక ఏం చెప్పిందంటే.,  
ఈ  ఏడాది అక్టోబర్‌ నాటికి గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నిర్వహణ ఆస్తులు 8 శాతం తగ్గి రూ.4,621 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలానికి ఈ ఆస్తులు రూ.5,017 కోట్లుగా ఉన్నాయి.  
గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల ట్రేడింగ్‌ అంతకంతకూ దిగజారుతూ వస్తోంది.  
2013–14లో రూ.2,293 కోట్లుగా ఉన్న గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ 2014–15లో రూ.1,475 కోట్లకు తగ్గింది. పెట్టుబడుల ఉపసంహరణ 2015–16లో రూ.903 కోట్లు, 2016–17లో రూ.775 కోట్లు, 2017–18లో రూ.835 కోట్లుగా ఉన్నాయి.  
2012–13లో మాత్రం గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో నికరంగా రూ.1,414 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.  
గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఈక్విటీ మార్కెట్లో మంచి లాభాలు రావడంతో ఇన్వెస్టర్లు గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు దూరంగా ఉంటున్నారు.  
మరోవైపు పుత్తడిని భౌతికంగా ఉంచుకోవడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతారని, డీమ్యాట్‌ రూపంలో అంటే పెద్దగా ఆసక్తి ఉండదని నిపుణులంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement