
10 నెలల కనిష్టానికి పుత్తడి
ముంబై: పసిడి ధర ముంబై స్పాట్ మార్కెట్‌లో శనివారం 10 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర క్రితం ధరతో పోల్చితే... రూ.70 తగ్గి, రూ.26,755కు చేరింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర కూడా అంతే మొత్తం తగ్గి రూ.26,605కు చేరింది. కాగా వెండి కేజీ ధర రూ.215 తగ్గి రూ.40,865కు దిగివచ్చింది. వరుసగా ఆరు రోజుల నుంచీ బంగారం ధరలు తగ్గుతున్నాయి. దేశీయంగా డిమాండ్ తగ్గడం, స్టాకిస్టుల అమ్మకాలు వంటి అంశాలు దీనికి కారణం.
అంతర్జాతీయ మార్కెట్‌లో సైతం బంగారం ధర బలహీనంగానే ట్రేడవుతోంది. నెమైక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర 1,250 డాలర్ల సమీపంలో కదలాడుతోంది. వెండి విషయంలో ఈ ధర 19 డాలర్లుగా ఉంది. అమెరికా ఉద్యోగ కల్పన గణాంకాలు ఊహించినదానికన్నా మెరుగ్గా ఉండడం వల్ల ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతోందన్న సంకేతాలు బలంగా ఉన్నాయి.
దీనితో పసిడిలో డబ్బు క్యాపిటల్ మార్కెట్లలోకి మళ్లుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది పసిడి, వెండి ధర మెట్టు దిగడానికి దారితీస్తోందని వారు తెలుపుతున్నారు. ఆయా అంశాలుసైతం దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని వారు భావిస్తున్నారు.