
న్యూఢిల్లీ: దేశంలో బంగారానికి డిమాండ్ తగ్గలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలం (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు)లో దిగుమతులు రెట్టింపయ్యాయి. 16.95 బిలియన్ డాలర్ల (రూ.1,0,500 కోట్లు) విలువైన పసిడి దేశంలోకి దిగుమతి అయింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో దిగుమతులు 6.88 బిలియన్ డాలర్లు (రూ.44,000 కోట్లు)గానే ఉన్నాయి. సెప్టెంబర్‌లో మాత్రం దిగుమతులు 5 శాతం తగ్గి 1.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
బంగారం దిగుమతులు దేశ కరెంటు ఖాతా లోటు(సీఏడీ), వాణిజ్య లోటును పెంచుతాయన్న విషయం తెలిసిందే. అయితే, సెప్టెంబర్‌లో కొంత మేర దిగుమతులు తగ్గడంతో వాణిజ్య లోటు (ఎగుమతుల కంటే దిగుమతుల విలువ ఎక్కువవడం) ఏడు నెలల కనిష్ట స్థాయి 8.98 బిలియన్ డాలర్ల (రూ.57,500 కోట్లు) దగ్గరే ఆగింది. అయితే, పండుగలు ఉండటంతో ఈ నెలలో దిగుమతులు పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచంలో చైనా తర్వాత మన దేశమే బంగారానికి అతిపెద్ద వినియోగ కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్‌ను అందుకునేందుకు వర్తకులు దిగుమతులపై ఆధారపడుతున్నారు. దక్షిణ కొరియాతో మన దేశానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉండటంతో ఆ దేశం నుంచి దిగుమతులు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది.
Comments
Please login to add a commentAdd a comment