
పుత్తడిలో కొనసాగుతున్న లాభాల స్వీకరణ
► మూడు వారాల్లో 60 డాలర్లు డౌన్
► 3 నెలల కనిష్ట స్థాయి...
ముంబై/న్యూయార్క్: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్చేంజ్ లోభారీగా పెరిగిన పసిడి నుంచి ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కొనసాగుతోంది. 5వ తేదీ శక్రవారంతో ముగిసిన వారాంతంలో పసిడి భారీగా 41 డాలర్లు తగ్గి, 1,229 డాలర్ల వద్ద ముగిసింది. ఒక్క వారంలో ఇన్ని డాలర్ల మేర ధర పడిపోవడం ఆరు నెలల్లో ఇదే తొలిసారి.
అమెరికా ఆర్థిక వ్యవస్థపై భరోసాలు, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు సడలడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. జూన్‌లో ఫండ్ రేటు మరోమారు పెంచుతుందన్న అంచనాలు బలపడ్డం, ఏప్రిల్‌లో అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఊహించినదానికన్నా ఎక్కువ ఉపాధి అవకాశాల సృష్టి, 2007 మే తరువాత ఎన్నడూ లేనంతగా ఈ గణాంకాల సానుకూలత వంటి అంశాలు శుక్రవారం ఒక్కసారిగా పసిడి 6 డాలర్లకు పైగా పడిపోవడానికి కారణమైంది.
డాలర్... దిక్సూచి...
అయితే అమెరికా అధ్యక్షుని డాలర్ ‘బలహీన’ లక్ష్యం విధానాలు పసిడిపై భవిష్యత్తులో తప్పనిసరిగా ప్రభావితం చూపుతాయన్న అంచనాలూ ఉన్నాయి. దీనితో పసిడి వెనుకడుగు కొనుగోళ్లకు ఒక అవకాశమన్న విశ్లేషణలూ ఉన్నాయి. 100.51, 99.75, 99.04, 98.42 ఇలా... డాలర్ ఇండెక్స్ నాలుగు వారాల నుంచీ తగ్గుతూ వస్తున్న సంగతిని వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
డాలర్ బలహీనపడే విధానాలకే ట్రంప్ ప్రభుత్వం మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే. ఆయా అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లకు రాబోయే కొద్ది వారాల్లో పసిడి ‘ఆర్థిక రక్షణ’గానే కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిస్తే ఆయన అనుసరించే ‘డాలర్ బలహీన’ విధానాల వల్ల పసిడి 1,800 డాలర్లకు క్రమంగా చేరుతుందని అధ్యక్ష ఎన్నికలకు ముందు పలు విశ్లేషణలు వెలువడ్డాయి.
దేశీయంగానూ కిందకే..!
అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్ మార్కెట్‌పైనా పడింది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 10 గ్రాములకు 5వ తేదీతో ముగిసిన వారంలో భారీగా రూ.801 తగ్గి రూ.28,072కి చేరింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.690 తగ్గి రూ.28,385కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పడి రూ.28,235కి చేరింది. రెండు వారాల్లో ఇక్కడ పసిడి రూ.1,000కి పైగా నష్టపోయింది. మరోవైపు వెండి కేజీ ధర భారీగా రూ.1,985 తగ్గి రూ.38,625కు దిగింది. మూడు వారాల్లో ధర దాదాపు రూ.5,000 తగ్గడం గమనార్హం.