పుత్తడి ధరలు పెద్దగా పెరగవు | Gold price firms near $1200, poised to end 2014 largely flat | Sakshi
Sakshi News home page

పుత్తడి ధరలు పెద్దగా పెరగవు

Published Thu, Jan 1 2015 3:01 AM | Last Updated on Thu, Aug 2 2018 4:53 PM

పుత్తడి ధరలు పెద్దగా పెరగవు - Sakshi

పుత్తడి ధరలు పెద్దగా పెరగవు

ఇక్రా సర్వే అంచనా
ముంబై: దేశీయ మార్కెట్లో బంగారు ఆభరణాలకు డిమాండ్ ఈ ఏడాది 10 శాతం పెరగనున్నదని ఇక్రా తాజా సర్వే వెల్లడించింది. ఐతే బంగారం ధరలు ప్రస్తుతమున్న స్థాయిలోనే ఉంటాయని ఇక్రా నిర్వహించిన ఇండియన్ గోల్డ్ జ్యూయలరీ రిటైల్ ఇండస్ట్రీ సర్వే అంచనా వేస్తోంది.

అంతకంతకూ బలపడుతున్న డాలర్, తగ్గుతున్న ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలు.. ఈ అంశాలన్నింటి కారణంగా పుత్తడి ధరలు పెరిగే అవకాశాలు స్వల్పమేనని పేర్కొంది. అయితే భారత్, చైనాల్లో డిమాండ్ పెరిగితే ధరలు పెరగవచ్చని వివరించింది. గతేడాది మందకొడిగా ఉన్న బంగారు ఆభరణాల డిమాండ్ ఈ ఏడాది 10 శాతం వృద్ధితో 3,200 కోట్ల డాలర్లకు చేరుతుందని పేర్కొంది.

ధరలు తక్కువగా ఉండడం, నిబంధనలు సరళీకరణ, మెరుగుపడుతున్న వినియోగదారుల సెంటిమెంట్ తదితర కారణాల వల్ల డిమాండ్ పుంజుకోనున్నదని పేర్కొంది.  బంగారానికి భారతీయ సంస్కృతిలో భాగం ఉండడం, భారీ జనాభా, పెరుగుతున్న ఆదాయాలు, మదుపు చేయడానికి ఉత్తమమైన సాధనాల్లో పుత్తడి ఒకటిగా ఉండడం, వంటి కారణాల వల్ల భారత్‌లో రిటైల్ జ్యూయలరీ పరిశ్రమ జోరుగా ఉన్నదని ఈ సర్వే వివరించింది.

గతంలో 11 శాతంగా మాత్రమే ఉన్న వ్యవస్థీకృత రిటైల్ సంస్థలు 20 శాతానికి పెరగడం ఆసక్తికరమైన అంశమని పేర్కొంది. ధరలు తగ్గుతుండడం వల్ల పలువురు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారని వివరించింది.
 
బంగారం దిగుమతి టారిఫ్ విలువ తగ్గింపు
కేంద్రం బంగారం, వెండి దిగుమతి టారిఫ్ విలువను తగ్గించింది. బంగారం 10 గ్రాములకు ఈ విలువ 396 డాలర్ల నుంచి 392 డాలర్లకు తగ్గింది. వెండి కేజీకి సంబంధించిన విలువ 561 డాలర్ల నుంచి 519 డాలర్లకు తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement