బంగారం..ఊరిస్తోంది | gold price should be decreased | Sakshi
Sakshi News home page

బంగారం..ఊరిస్తోంది

Published Wed, Oct 15 2014 8:42 AM | Last Updated on Thu, Aug 2 2018 3:54 PM

బంగారం..ఊరిస్తోంది - Sakshi

బంగారం..ఊరిస్తోంది

అమ్మకాలకు ఫుల్ జోష్ అంటున్న వర్తకులు
ధన్‌తేరాస్, దీపావళి అమ్మకాల్లో 15% వృద్ధి అంచనా


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్కెట్లో బంగారం ధర ఊరిస్తోంది. కొంతకాలంగా బంగారం ధర తగ్గుతూ రావడంతో పుత్తడి కొనేందుకు వినియోగదారులు ఉత్సాహంగా ఉన్నారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పసిడి ధర  మరికాస్త తగ్గుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీపావళి నాటికి 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.25 వేలకు చేరొచ్చని అంచనా వేస్తున్నాయి. ఈసారి దీపావళికి  బంగారు అభరణాల  అమ్మకం ఊపుమీద జరుగుతుందని  వర్తకులు ఆశపడుతున్నారు.

క్యాడ్ కట్టడిలో భాగంగా ప్రభుత్వ నిబంధనలతో కొన్ని నెలలుగా భారత్‌లో బంగారు ఆభరణాల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ ఏడాది ఆభరణాల విపణిలో ధంతేరాస్, దీపావళి పండుగలు కొత్త వెలుగులు జిమ్ముతాయని వ్యాపారులు విశ్వాసంగా ఉన్నారు. వచ్చే పెళ్లిళ్ల సీజన్ కోసం ముందస్తుగా కస్టమర్లు బంగారుకడ్డీలను కొని దాచుకుంటున్నారని వ్యాపారులు తెలిపారు.

కడ్డీలకు డిమాండ్
అంతర్జాతీయ మార్కెట్లో 2014 జూలై 10న 10 గ్రాముల బంగారం ధర రూ.25,800 నమోదైంది. అప్పటి నుంచి క్రమేపీ ధర కిందకు వస్తూనే ఉంది. దీంతో ఆభరణాలకు బదులు పుత్తడి కడ్డీలకు డిమాండ్ పెరిగిందని బులియన్ వర్తకులు అంటున్నారు. జూలై నుంచే ఈ ట్రెండ్ పెరుగుతోందని చెబుతున్నారు. గతంతో పోలిస్తే కడ్డీల అమ్మకాల్లో వృద్ధి 50 శాతం నమోదైందని రిద్ధిసిద్ధి బులియన్స్(ఆర్‌ఎస్‌బీఎల్) ప్రతినిధి జి.శేఖర్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు.

ధర తక్కువ కావడం వల్లే కడ్డీల అమ్మకాలు పెరిగాయని, ఇదంతా కస్టమర్ల ముందు జాగ్రత్త చర్యలని ఆయన చెప్పారు. పెళ్లి సమయానికి కడ్డీలను మార్చుకొని మళ్లీ ఆభరణాలను తీసుకుంటారని వివరించారు. సాధారణ కస్టమర్లు మాత్రం ఆభరణాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని, ధన్‌తేరాస్, దీపావళికల్లా ఈ మార్కెట్ పుంజుకుంటుందని ఆర్‌ఎస్ బ్రదర్స్ అమీర్‌పేట్ షోరూం జ్యువెల్లరీ విభాగం మేనేజర్ నాగ కిరణ్ అన్నారు.
 
15 శాతం దాకా వృద్ధి..
ధన్‌తేరాస్, దీపావళి కోసం ఆభరణాల వర్తకులు రెడీ అవుతున్నారు. దీంతో ముడి బంగారానికి డిమాండ్ పెరగడంతో 10 రోజుల్లో ధర కాస్త పెరిగింది. అయితే పండుగల సీజన్‌కు 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.25 వేలకు వచ్చే అవకాశముందని హైదరాబాద్ జ్యువెలరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేందర్ తయాల్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆభరణాల మార్కెట్ స్తబ్దుగా ఉందని, దీపావళికి తిరిగి పుంజుకుంటుందని ఆల్ ఇండియా జెమ్స్ జ్యువెలరీ ట్రేడ్ ఫెడరేషన్ (జీజేఎఫ్) డెరైక్టర్ మోహన్‌లాల్ జైన్ పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే పండుగలకు 15 శాతం దాకా వృద్ధి అంచనా వేస్తున్నట్టు చెప్పారు. కాగా, అంతర్జాతీయంగా అక్టోబర్ 3న 10 గ్రాముల ధర కాస్తా రూ.23,400లకు వచ్చి చేరింది. తిరిగి పుంజుకుని సోమవారం (అక్టోబర్ 13) నాడు రూ.24,130 వద్ద ట్రేడైంది. పన్నులు, ప్రీమియం కలిసి ఈ ధర ముంబై మార్కెట్లో రూ.27,115 వద్ద ఉంది.

ప్రభుత్వం దిగి వస్తే..
2012 మార్చిలో బంగారంపై దిగుమతి సుంకం 2 శాతం మాత్రమే. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) గణనీయంగా పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బంగారం దిగుమతులకు కళ్లెం వేయడానికి 2013 ఆగస్టులో సుంకాన్ని 10 శాతానికి చేర్చారు. బంగారం భారీ దిగుమతుల కారణంగా 2012-13లో క్యాడ్ చరిత్మ్రాక గరిష్టానికి(4.8 శాతం) ఎగబాకింది.  సుంకాల పెంపు ఇతరత్రా ప్రభుత్వ చర్యల కారణంగా 2013-14లో ఇది 1.7 శాతానికి దిగొచ్చింది. ప్రస్తుతం క్యాడ్ కట్టడిలోకి వచ్చింది. ముడి చమురు ధరలు పడిపోవడం, రూపాయి స్థిరంగా ఉండడంతో బంగారంపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం తగ్గిస్తుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇదే గనక జరిగితే పసిడి ధరలు మరింత పడిపోవడం ఖాయం. దానికి తగ్గట్టు అమ్మకాలు పెరుగుతాయని వర్తకులు అంటున్నారు. అయితే అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ తగ్గుతున్నా, చైనా, భారత్ నుంచి మద్దతు లభిస్తుందని చెబుతున్నారు.
 
అవసరం ఉంటే నెమ్మదిగా కొనొచ్చు...
అంతర్జాతీయంగా ఇలా..
.
గత కొంత కాలంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు కింది స్థాయిలో ఒక పరిమిత శ్రేణిలోనే కదులుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర సుమారుగా ఉత్పత్తి ధర వద్ద ట్రేడ్ అవుతుండటం, అంతర్జాతీయంగా ఇంకా ఆర్థిక వ్యవస్థలు పూర్తిస్థాయిలో కోలుకోకపోవడం వంటి విషయాలు బంగారం ధరలకు మద్దతు ఇస్తున్నాయి. దీంతో మరికొంత కాలం ఔన్స్ బంగారం ధరలు 1150-1250 డాలర్ల శ్రేణిలోనే కదలొచ్చు. కానీ దీర్ఘకాలంలో బంగారం ధరలు 1,050-1,100 శ్రేణికి వచ్చిన తర్వాతనే తదుపరి దిశను తీసుకుంటుందని అంచనా.

దేశీయంగా చూస్తే...
ఇక దేశీయంగా చూస్తే బంగారం ధరలు తగ్గే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగి వస్తుండటంతో ద్రవ్యోలోటు అదుపులోకి వస్తోంది. బ్యారెల్ క్రూడ్ ధరలు 90 డాలర్ల దిగువన మరికొంత కాలం కొనసాగితే ప్రభుత్వం బంగారం దిగుమతులపై పెంచిన పన్నులను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మోదీ ప్రభుత్వ చర్యల వల్ల దీర్ఘకాలంలో డాలరుతో రూపాయి మారకం విలువ బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుంటే దేశీయంగా బంగారం ధరలు తగ్గుదలనే సూచిస్తున్నాయి. పది గ్రాముల బంగారం ధరలు స్వల్పకాలానికి రూ. 26,500 - 27,500 శ్రేణిలో కదులుతాయని అంచనా వేస్తున్నాం.

ఇప్పుడేం చేద్దాం?
రెండు మూడు నెలల్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకోసం బంగారం కొనాలి అనుకునే వాళ్లు ప్రస్తుత ధరలో నెమ్మదిగా కొనచ్చు. అదే దీర్ఘకాలిక అవసరాల కోసమయితే ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున కొనొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ పరంగా చూస్తే బంగారం ఇప్పటికీ ఆకర్షణీయంగా కనిపించడం లేదు. దీర్ఘకాలంలో బ్యాంకు ఎఫ్‌డీని మించి రాబడిని ఇచ్చే అవకాశాలు ప్రస్తుతానికి కనిపించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement