
పసిడి కళకు మార్కెట్ల ఊతం!
జాగ్రత్త తప్పదంటున్న నిపుణులు
న్యూయార్క్/న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పలు దేశాల ఈక్విటీ మార్కెట్ల పతనం పసిడికి కలిసి వచ్చింది. నిపుణుల అంచనాలకు భిన్నంగా ఈ ఏడాది మొదటి నుంచీ స్థిరంగా ముందుకు కదులుతోంది. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర కీలక స్థాయి 1,100 డాలర్లను దాటింది. ప్రస్తుతం 0.50 శాతంగా ఉన్న ఫెడ్ ఫండ్స్ రేటును యథాతథంగా కొనసాగిస్తామని ఇటీవలి తన ప్రకటనలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్‌ప్రకటించడం... మార్కెట్ల పతనాన్ని నివారించలేకపోవడంతో సమీప కాలానికి పసిడిని ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సురక్షితమైన మెటల్‌గా భావించడమే పసిడి ప్రస్తుత పెరుగుదలకు కారణమని ప్రస్తుతం నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇవే అంశాలు ఇకముందూ పసిడిని నడిపిస్తాయని వారి అంచనా. ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. ఫెడ్ రేటు పెంపు అనంతరం పసిడి ధర క్రమంగా వెయ్యి డాలర్లలోపునకు పడిపోతుందని గత ఏడాది అంచనాలు వినిపించిన సంగతి తెలిసిందే. గడచిన వారాంతానికి పసిడి 1,118 వద్ద ముగియగా, వెండి 14 డాలర్లపైకి చేరింది.
దేశీయంగా మూడు నెలల గరిష్టం...
అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా దేశీయంగా పసిడి బలోపేతమవుతోంది. తాజాగా ముగిసిన వారంలో మూడు నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఈ కాలంలో సహజంగానే పసిడికి డిమాండ్ కొంత ఉంటుందని, అయితే అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ధోరణి పసిడి ధరకు మరింత బలాన్ని ఇస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ క్షీణత వల్ల దిగుమతుల వ్యయాలు పెరగడం, పెళ్లిళ్లు, పండుగల సీజన్ నేపథ్యంలో ముందస్తు కొనుగోళ్లు వంటి అంశాలు దేశీయంగా పసిడి డిమాండ్‌ను పెంచుతున్నాయి. వరుసగా నాల్గవ వారమూ లాభాల బాటన మెరిసింది.
వారంలో పసిడి కదలికలను చూస్తే... పటిష్ట స్థాయిలో ప్రారంభమైన ధర... వారం మధ్యకు వచ్చే సరికి స్టాకిస్టులు, ట్రేడర్ల కొనుగోళ్ల మద్దతుతో మూడు నెలల గరిష్ట స్థాయికి చేరింది. అయితే అటు తర్వాత కొంత లాభాల స్వీకరణ జరిగింది. ఇదే సమయంలో ఈక్విటీలూ స్వల్పంగా మెరుగుపడ్డం గమనార్హం. ఢిల్లీ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర వారం వారీగా రూ.320 ఎగసి రూ.26,700 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర సైతం అంతే మొత్తం ఎగసి రూ.26,550 వద్దకు చేరింది. ఇక వెండి కేజీకి రూ.275 ఎగసి రూ.34,920కి చేరింది. కాగా అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా కేంద్రం గత వారం పసిడి దిగుమతుల టారిఫ్‌ను పెంచింది.