హెచ్చుతగ్గుల బాటలో పసిడి
నిపుణుల అంచనా...
ముంబై: అనిశ్చితి ఆర్థిక పరిస్థితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెంచ్‌మార్క్ వడ్డీరేట్లలో మార్పులు, డాలర్ మారకంతో రూపాయి కదలికలు వంటి అంశాలు సమీప భవిష్యత్తులో పసిడి ధరను ప్రభావితం చేస్తాయని ఈ రంగంలోని నిపుణులు పేర్కొంటున్నారు. ఆయా అంశాల నేపథ్యంలో పసిడి ధర సమీప భవిష్యత్తులో కొంత హెచ్చుతగ్గులకు గురయ్యే అవకాశం ఉందని వారు అంచనావేస్తున్నారు. ఇప్పటివరకూ పెరుగుతూ వచ్చిన పసిడి నుంచి లాభాల స్వీకరణ సైతం పసిడి కదలికలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే కారణంగా గత వారంలో అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఏప్రిల్ కాంట్రాక్ట్ పసిడి ధర వారం వారీగా ఔన్స్ (31.1గ్రా)కు దాదాపు 6 డాలర్లు తగ్గి, 1,254 డాలర్ల వద్ద ముగిసింది. వెండి సైతం స్వల్ప నష్టంతో ముగిసింది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచీ పసిడి ధర పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
దేశీయంగా పటిష్ట అంచనాలు...
కాగా దేశీయంగా పసిడి సమీపకాలంలో పటిష్టంగా కొనసాగే అవకాశాలే ఉన్నాయని నిపుణులు అంచనావేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్‌సహా 18 రోజులుగా జరుగుతున్న ఆభరణాల వర్తకుల సమ్మె ముగియడంతో పసిడి డిమాండ్‌కు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే గడచిన వారం మాత్రం పసిడి కొంత నష్టాలతో ముగిసింది. భారీగా పెరిగిన పసిడి ధర నుంచి ట్రేడర్లు, స్టాకిస్టులు లాభాల స్వీకరణ దీనికి ప్రధాన కారణం. దీనితోపాటు డాలర్‌పై రూపాయి విలువ రెండున్నర నెలల గరిష్ట స్థాయికి చేరడం కూడా పసిడి ధర తగ్గడానికి కారణం. వారం వారీగా చూస్తే... 99.5 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.485 తగ్గి రూ. 28,760 వద్ద ముగిసింది. 99.9 స్వచ్ఛత ధర సైతం ఇదే స్థాయిలో తగ్గి రూ. 28,910 వద్ద ముగిసింది. ఇక వెండి కేజీ ధర రూ.485 లాభపడి రూ.38,335 వద్ద ముగిసింది.