పసిడి ధర మళ్లీ వెనక్కి!
న్యూయార్క్/ముంబై: పసిడి ధర తాజాగా వెలవెలబోతోంది. అంతర్జాతీయంగా మార్కెట్లో లాభాల స్వీకరణ దీనికి ప్రధాన కారణం. ఈ ప్రభావం దేశీయ మార్కెట్‌లోనూ కనబడుతోంది. స్టాకిస్టులు, ఇన్వెస్టర్లు తమ నిల్వలను తగ్గించుకోవడం, కొనుగోళ్ల మద్దతు కొరవడ్డం వంటి అంశాలూ దేశీయంగా ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ నెమైక్స్ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఏప్రిల్ కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రాములు) ధర బుధవారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి మంగళవారం ముగింపుతో పోల్చితే 29 డాలర్లు తక్కువగా 1,220 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఇదే ధోరణి దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో సైతం కొనసాగుతోంది. రాత్రి కడపటి సమాచారం అందే సరికి 10 గ్రాముల కాంట్రాక్ట్ రూ.500కు పైగా నష్టంతో రూ.28,542 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీ ధర సైతం రూ.1,000కిపైగా నష్టంతో రూ.36,772 వద్ద ట్రేడవుతోంది. కాగా ఇక్కడి స్పాట్ మార్కెట్‌లో 10 గ్రాముల ధర భారీగా రూ.350 తగ్గింది. 99.9 స్వచ్ఛత ధర రూ.28,510, 99,5 స్వచ్ఛత ధర రూ.28,360కు దిగివచ్చింది. వెండి కేజీ ధర సైతం రూ.535 తగ్గి రూ.37,900కు చేరింది.