ఏడాది కనిష్టానికి పుత్తడి ధరలు
ముంబై: పుత్తడి ధరల పతనం కొనసాగుతోంది. బుధవారం ముంబై బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఏడాది కనిష్టానికి చేరాయి. స్పెక్యులేటర్లు, స్టాకిస్టులు భారీగా అమ్మకాలకు పాల్పడటంతో పుత్తడి ధరలు పతనమయ్యాయి. పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్ తగ్గడం, స్పెక్యులేటర్ల నుంచి అమ్మకాలు వెల్లువెత్తడంతో వెండి ధరలు కూడా తగ్గాయి.
అమెరికా తాజా ఆర్థిక గణాంకాలకు సాంకేతిక అమ్మకాలు తోడవడం, చైనాలో డిమాండ్ మందగించడం వంటి కారణాల వల్ల హెడ్జింగ్ పెట్టుబడిగా పుత్తడి ప్రాభవం అంతర్జాతీయంగా మసకబారడంతో అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ముంబై బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.360 తగ్గి రూ.27,320కు, 99.5 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే స్థాయిలో క్షీణించి రూ.27,175కు చేరాయి. ఇక కిలో వెండి కూడా రూ.455 తగ్గి రూ.41,065కు తగ్గింది. కాగా నెమైక్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1.265.5 డాలర్లకు చేరింది. ఇది మూడున్నర నెలల కనిష్ట స్థాయి.