న్యూయార్క్/న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్– నైమెక్స్‌లో బంగారం ధర పరుగులు పెడుతోంది. మంగళవారం ఒక దశలో ఔన్స్ (31.1గ్రా) ధర 1,442.15 డాలర్లను తాకింది. ఇది ఆరు సంవత్సరాల గరిష్టస్థాయి. ఈ వార్త రాసే సమయం– రాత్రి 10.30కి 1,428 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. వారం క్రితం పసిడి 1,350 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. అంటే గరిష్టాన్ని చూస్తే, వారం రోజుల్లో దాదాపు 92 డాలర్లు పెరిగిందన్నమాట.
కారణాలు చూస్తే...
కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ ఆందోళనలు, ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు సహా కొన్ని దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు దీనికి ప్రధాన కారణం. ప్రపంచ వృద్ధిపై ప్రత్యేకించి అమెరికా వృద్ధి స్పీడ్ తగ్గే అవకాశాలు ఉన్నాయన్న విశ్లేషణలు, దీనితో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 2.25–2.50 శ్రేణి) సమీపకాలంలోనే పావుశాతం తగ్గే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు, దీనితో డాలర్ ఇండెక్స్ బలహీనత (95.50) కూడా పసిడి ధరలను ఎగదోస్తున్నాయి.
భారత్‌లోనూ దూకుడే...
అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో భారత్‌లోనూ పసిడి పరుగులు పెడుతోంది. ఢిల్లీ స్పాట్‌మార్కెట్‌లో 10 గ్రాముల ధర(24 క్యారెట్లు) రూ.470 పెరిగి, రూ.35,330కి చేరింది. దేశ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో ధర రాత్రి 10.30 గంటల సమయంలో 10 గ్రాముల ధర రూ.134 పెరిగి రూ.34,575 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment