ఈ ఏడూ.. పసిడి వెలవెల!
♦ 2017లో పెరిగే అవకాశం
♦ రాయిటర్స్ సర్వే వెల్లడి
♦ ఫెడ్ ఎఫెక్ట్ ప్రధానమని విశ్లేషణ
లండన్: బంగారం ధర ఈ ఏడాదీ దిగువ స్థాయిలోనే ఉంటుందని రాయిటర్స్ నిర్వహించిన ఒక సర్వే తెలిపింది. ఇదే జరిగితే ఇలాంటి పరిమాణం ఇది వరుసగా నాలుగో ఏడాది సంభవించినట్లు అవుతుంది. పసిడి ధర 2015 ఏడాదిలో వార్షికంగా 10% మేర దిగజారింది. గడచిన రెండు వారాల్లో 41 మంది విశ్లేషకులు, ట్రేడర్ల అభిప్రాయాలను సర్వేలో తీసుకున్నారు. ముఖ్యాంశాలను చూస్తే...
వార్షికంగా 2016లో పసిడి సగటు ధర ఔన్స్ (31.1 గ్రా) 1,118 డాలర్లుగా ఉంటుంది. 2009 తరువాత ఇంత తక్కువ స్థాయి సగటు ఇదే తొలిసారి. ప్రస్తుతం అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఫిబ్రవరి కాంట్రాక్ట్ పసిడి ధర ఔన్స్‌కు 1,095 స్థాయిలో కదలాడుతోంది.
గత ఏడాది పసిడి ధర తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. ఈ అంచనాలకు అనుగుణంగానే డిసెంబర్‌లో ఫెడ్ ఫండ్ రేటు అరశాతం పెరిగింది. ఈ ఏడాది మరో నాలుగుసార్లు ఫెడ్ రేటు పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ పరిణామం పసిడికి పెద్ద ప్రతికూలతే.
చైనా మందగమనం, స్టాక్ మార్కెట్ల నష్టాలు, ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండే అవకాశాల వంటివి పసిడికి వన్నె తెస్తాయన్న ఆశవున్నా... ఆయా అంచనాలను ఫెడ్ రేటు పెంపు అంచనాలు దెబ్బతీసే అవకాశం ఉంది.
2017పై ఆశ...
అయితే వచ్చే ఏడాది తిరిగి పసిడి కళకళలాడే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. 2011 రికార్డు స్థాయిల నుంచి పూర్తిగా కనిష్ట స్థాయిలకు పడిపోయి... తిరిగి వార్షికంగా సగటున 1,209 డాలర్లకు ఎగిసే వీలుందని అభిప్రాయపడింది. గ్లోబల్ వృద్ధి మందగమనం భయాలు, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకుల వంటి అంశాలు పసిడి పెరుగుదలకు దోహదపడే వీలుంది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆర్థిక అస్థిరత్వ పరిస్థితులు... పసిడికి తిరిగి భద్రతాపరమైన మెటల్ హోదా కట్టబెడతాయని ఫస్ట్‌మార్కెట్ అనలిస్ట్ జేమ్స్ మోర్ పేర్కొన్నారు.
వెండి విషయానికి వస్తే...
ప్రస్తుతం నెమైక్స్‌లో 14 డాలర్ల వద్ద కదలాడుతున్న వెండి, వార్షికంగా సగటున 14.80గా ఉంటుందని సర్వే పేర్కొంది. గత ఏడాది ఈ ఇండస్ట్రియల్ మెటల్ ధర 11 శాతం పడింది.