మళ్లీ జియో ఫైనాన్స్ డీలా
ముంబై: వరుసగా రెండో రోజు జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో మరోసారి 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. బీఎస్ఈలో రూ. 12.5 కోల్పోయి రూ. 239 వద్ద నిలవగా.. ఎన్ఎస్ఈలోనూ ఇదే స్థాయి నష్టంతో రూ. 237 దిగువన స్థిరపడింది. సోమవారం సైతం ఈ షేరు 5 శాతం డౌన్ సర్క్యూట్‌ను తాకిన సంగతి తెలిసిందే. మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడిన జియో ఫైనాన్షియల్ గత నెలలో జరిగిన ధర నిర్ధారణ ట్రేడింగ్‌లో రూ. 262 ధర వద్ద స్థిరపడింది. తదుపరి ఈ కౌంటర్లో స్టాక్ ఎక్సే్ఛంజీలు సోమవారం(21) నుంచి 10 రోజులపాటు ట్రేడ్ ఫర్ ట్రేడ్ విభాగంలో సాధారణ ట్రేడింగ్‌కు తెరతీశాయి. ఫలితంగా రోజుకి 5 శాతం సర్క్యూట్ బ్రేకర్ అమలుకానుంది. తొలి రోజు 5 శాతం పతనమై రూ. 250 సమీపంలో నిలిచింది.
ఇండెక్సులలో..
ధరలో నిలకడను తీసుకురావడం, హెచ్చుతగ్గులను పరిమితం చేయడం వంటి లక్ష్యాలతో స్టాక్ ఎక్సే్ఛంజీలు జియో ఫైనాన్షియల్‌ను ప్రధాన ఇండెక్సులలో తాత్కాలికంగా భాగం చేశాయి. విలీనాలపై సవరించిన తాజా నిబంధనల అమలులో భాగంగా సెన్సెక్స్‌లో 31వ, నిఫ్టీలో 51వ షేరుగా ప్రస్తుతం కొనసాగుతోంది. నిజానికి ఈ షేరుని లిస్టింగ్ తదుపరి మూడు రోజులకు సెన్సెక్స్, నిఫ్టీల నుంచి తొలగించవలసి ఉంది. అయితే వరుసగా సర్క్యూట్ బ్రేకర్లను తాకడంతో ఈ షేరుని ఆగస్ట్ 29వరకూ సెన్సెక్స్, నిఫ్టీలలో కొనసాగించనున్నట్లు ఇండెక్సుల కమిటీ పేర్కొంది. అప్పటికి కూడా సర్క్యూట్ బ్రేకర్లను తాకడం కొనసాగితే.. మరోమారు ఇండెక్సుల నుంచి తొలగింపు వాయి దా పడవచ్చని సంబంధిత వర్గాలు తెలియజేశాయి.
ఎల్ఐసీకి షేర్లు
ఫైనాన్షియల్ సరీ్వసుల బిజినెస్‌లను జియో ఫైనాన్షియల్ పేరుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ గత నెలలో ప్రత్యేక కంపెనీగా విడదీసింది. దీనిలో భాగంగా వాటాదారులకు ప్రతీ 1 ఆర్ఐఎల్ షేరుకిగాను 1 జియో ఫైనాన్షియల్‌ను కేటాయించింది. ఫలితంగా ఆర్ఐఎల్లోగల వాటాలకుగాను ఎన్బీఎఫ్సీ జియో ఫైనాన్షియల్‌లో 6.66 శాతం వాటాను పొందినట్లు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ తాజాగా వెల్లడించింది.
ఆటుపోట్ల మధ్య మార్కెట్ అక్కడక్కడే
ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 4 పాయింట్లు బలపడి 65,220 వద్ద నిలిచింది. 3 పాయింట్ల స్వల్ప లాభంతో నిఫ్టీ 19,346 వద్ద స్థిరపడింది. అంతకుముందు ఇంట్రాడేలో సెన్సెక్స్ 147 పాయింట్ల వరకూ పుంజుకుని 65,396కు చేరింది. నిఫ్టీ సైతం 19,443–19,381 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. యూఎస్‌లో వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,165 లాభపడితే 1503 డీలాపడ్డాయి.
పిరమిడ్ టెక్నో ఐపీవో సక్సెస్
ఇండ్రస్టియల్ ప్యాకేజింగ్ కంపెనీ పిరమిడ్ టెక్నోప్లాస్ట్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. చివరి రోజు మంగళవారాని(22)కల్లా 18 రెట్లుపైగా సబ్‌్రస్కిప్షన్ లభించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం 75.6 లక్షల షేర్లను ఆఫర్ చేయగా.. దాదాపు 13.83 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఈ ఆఫర్‌తో కంపెనీ రూ. 153 కోట్లు సమకూర్చుకుంది.
రూపాయి రికవరీ
14 పైసలు అప్; 82.99 వద్ద ముగింపు
న్యూఢిల్లీ: డాలరు మారకం విలువ తగ్గిన నేపథ్యంలో దేశీ కరెన్సీ రూపాయి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి నుంచి కోలుకుంది. డాలర్‌తో పోలిస్తే 14 పైసలు బలపడి, 82.99 వద్ద ముగిసింది. అమెరికా డాలరు బలహీనత దీనికి కారణం.