ముంబై : బంగారం ధరలు మళ్లీ కొండెక్కాయి. పదిగ్రాముల బంగారం (24 క్యారెట్) రూ 50,000కు చేరువవడంతో పసిడి సామాన్యుడికి దూరమైంది. పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఆటంకం కలిగిస్తాయనే ఆందోళనతో మదుపరులు బంగారం వైపు మళ్లారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు సరికొత్త శిఖరాలను తాకాయి. ఎంసీఎక్స్‌లో సోమవారం పది గ్రాముల బంగారం 183 రూపాయలు భారమై ఏకంగా 48,120 రూపాయలకు ఎగబాకింది. ఇక కిలో వెండి 334 రూపాయలు పెరిగి 48,970 రూపాయలు పలికింది.
బంగారం ధరలు ఇదే తరహాలో ముందుకు కదిలితే త్వరలోనే పదిగ్రాముల బంగారం (22 క్యారెట్) 50,000 రూపాయల మార్క్‌ను చేరవచ్చని బులియన్ ట్రేడర్లు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి అదుపులోకి రాకుంటే నిరుద్యోగ రేటు భారీగా ఎగబాకుతుందని అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అధికారులు హెచ్చరించడం కూడా పసిడికి డిమాండ్ పెంచిందని చెబుతున్నారు. కోవిడ్-19 మహమ్మారితో ఈ ఏడాది బంగారం ధరలు భగ్గుమంటున్నాయని, అమెరికా ఆర్థిక వ్యవస్థ కుంటుపడటం పసిడికి ఊతమిస్తోందని ఏంజెల్ బ్రోకింగ్ విశ్లేషకులు అనుజ్ గుప్తా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment