
ప్రస్తుతానికి పసిడి అక్కడక్కడే
ఈ జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు భారీగా తగ్గినా, పలు ఇతర కారణాల వల్ల బంగారం ధర కేవలం 3 శాతమే పెరిగిందని, సమీప భవిష్యత్తులో కూడా దాదాపు ఇదే స్థాయి వద్ద స్వల్ప హెచ్చుతగ్గులుండవచ్చని విశ్లేషకులు చెపుతున్నారు. స్టాక్ మార్కెట్లు పడుతున్నా, బంగారానికి పెట్టుబడుల డిమాండ్ పెరగడం లేదని, చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం కనిష్టస్థాయిలో వుండటం కూడా పసిడి తగినంతగా పెరగకపోవడానికి కారణమని వారంటున్నారు.
భవిష్యత్తులో ఈక్విటీ షేర్లు మరింతగా పతనమై, చైనా మాంద్యంలోకి జారుకుంటే వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కరెన్సీ ముద్రణను మొదలుపెడతాయని వారు అంచనావేశారు. దాంతో బంగారం ఔన్సు ధర 1,100 డాలర్లస్థాయి ఇన్వెస్టర్లకు చౌకగా కన్పిస్తుందని, ఆ సందర్భంలో మాత్రం పసిడి భారీ పెరిగే అవకాశాలుంటాయని వారు విశ్లేషించారు.
గత వారం ముందడుగే: కాగా శుక్రవారంతో ముగిసిన వారంలో అంతర్జాతీయంగా పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర స్వల్పంగా ఐదు డాలర్లు ఎగసి 1,096 డాలర్ల వద్ద ముగిసింది. ఇక దేశీయంగా ముంబై స్పాట్ మార్కెట్‌లో 99.5 స్వచ్ఛత ధర శుక్రవారంతో ముగిసిన వారంలో రూ.370 ఎగసి (1.42 శాతం) రూ.26,230 వద్దకు చేరింది. 99.9 స్వచ్ఛత ధర సైతం అంతే ఎగసి 26,380 వద్ద ముగిసింది. వెండి కేజీ ధర రూ.720 ఎగసి (2.12 శాతం) పెరిగి రూ. 34,645కు చేరింది.