
ముంబై : అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడంతో బుధవారం దేశీ మార్కెట్‌లో వరుసగా మూడోరోజూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లు పలు దేశాల్లో ఎత్తివేయడంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడిని ఎంచుకునే ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లు, కరెన్సీల్లో పెట్టుబడులకు మొగ్గుచూపడం బంగారానికి డిమాండ్‌ను మసకబార్చింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం రూ 272 తగ్గి 46,050కి దిగివచ్చింది. ఇక కిలో వెండి స్వల్పంగా తగ్గి రూ 47,800 పలికింది.
అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడినపడుతుందనే సంకేతాలు గోల్డ్ ధరలపై ప్రభావం చూపాయని ఆనంద్ రాఠీ షేర్స్, స్టాక్ బ్రోకర్స్‌కు చెందిన పరిశోధనా విశ్లేషకులు జిగర్ త్రివేదీ అంచనా వేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితి, వైరస్ భయాలు వెంటాడుతున్న క్రమంలో బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని బులియన్ నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment