భారత మార్కెట్లు మెరుగ్గా రాణిస్తాయ్
♦ కార్పొరేట్ ఆదాయాల్లో రికవరీ...
♦ గోల్డ్‌మాన్ శాక్స్ నివేదిక
న్యూఢిల్లీ: భారత కార్పొరేట్ సంస్థల ఆదాయాల వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడుతుందని, ఇతర దేశాలతో పోచ్చితే రికవరీ వేగంగా ఉటుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మాన్ శాక్స్ ఓ నివేదికలో తెలిపింది. సమీప కాలంలోనే వాస్తవిక అభివృద్ధికి అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేసింది. బీఎస్‌ఈ 200 కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ దాన్ని వ్యతిరేక అంశంగా పరిగణించలేదని ఈ సంస్థ స్పష్టం చేసింది. సూక్ష్మ ఆర్థిక రంగంలో రికవరీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని, ఆదాయాల్లో వృద్ధి వేగంగా ఉంటుందని స్పష్టంచేసింది.
భారత ఈక్విటీ మార్కెట్లు ఈ ప్రాంతంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే మెరుగ్గా రాణిస్తాయని తన పరిశోధన నివేదికలో గోల్డ్‌మాన్ శాక్స్ తెలిపింది. అయితే, వ్యవసాయ రంగ ప్రాతినిథ్యం తగినంత లేకపోవడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాల వ్యయాలు పెరిగిపోవడం సమీప కాలంలో వృద్ధికి సవాళ్లుగా పేర్కొంది. ‘ఐదు వరుస త్రైమాసికాల క్షీణత తర్వాత గత రెండు త్రైమాసికాల్లో ఎంఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్ కంపెనీల లాభాలు 9, 7 శాతం చొప్పున ఉన్నాయి.
పూర్తి ఏడాదికి 10 శాతం ఉంటుందన్న అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. దీంతో భారత ఈక్విటీలపై మేము ఇప్పటికీ అధిక వెయిటేజీనే కలిగి ఉన్నాం. వృద్ధి, రికవరీ సరైన మార్గంలోనే ఉన్నాయి. వార్షిక చక్రగతిన 2016-17 సంవత్సరంలో ఎంఎస్‌సీఐ ఇండియా సూచీలో భాగమైన కంపెనీల ఈపీఎస్ వార్షిక వృద్ధి 12 శాతం వుంటుందని అంచనా వేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఇదే గరిష్టం’ అని నివేదిక పేర్కొంది.