నష్టాల నుంచి.. లాభాల్లోకి
ముంబై: ఆరంభ నష్టాలను భర్తీ చేసుకున్న స్టాక్ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. అధిక వెయిటేజీ రిలయన్స్, టీసీఎస్ షేర్లు రెండు శాతం రాణించాయి. ఉదయం సెన్సెక్స్ నాలుగు పాయింట్ల స్వల్ప నష్టంతో 66,156 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 19,666 వద్ద మిశ్రమంగా మెదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో స్వల్ప అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 65,999 వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు పతనమై 19,598 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి.
తదుపరి ఆసియా, యూరప్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో దేశీయ మార్కెట్లో తిరిగి కొనుగోళ్లు పుంజుకున్నాయి. దీంతో సూచీలు నష్టాలను భర్తీ చేసుకొని లాభాలను ఆర్జించగలిగాయి. చివరికి సెన్సెక్స్ 367 పాయింట్లు పెరిగి 66,528 వద్ద ముగిసింది. నిఫ్టీ 108 పాయింట్లు బలపడి 19,754 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ, మెటల్, ఆయిల్, విద్యుత్ షేర్లకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు భారీ డిమాండ్ లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.31%, ఒకశాతం ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.701 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,488 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు క్షీణించి 82.29 స్థాయి వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► సోమవారం బీఎస్ఈలో రూ.2.50 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.306.66 లక్షల కోట్లకు చేరింది.
► దేశీయ అత్యంత విలువైన రెండో సంస్థగా టీసీఎస్ తిరిగి తన స్థానాన్ని దక్కించుకుంది. ఐటీ షేర్ల ర్యాలీలో భాగంగా టీసీఎస్ షేరు 2% లాభపడి రూ.3,421 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ రూ.12.51 లక్షల కోట్లకు చేరింది. దీంతో ఈ జూలై 20న రెండో స్థానానికి చేరుకున్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు(0.38%) రూ.12.45 లక్షల కోట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. కాగా ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ రూ.17.23 లక్షల కోట్లతో తొలి స్థానంలో కొనసాగుతుంది.
► జెట్ ఎయిర్వేస్ షేరు బీఎస్ఈలో 5% పెరిగి రూ.50.80 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఎయిర్ ఆపరేటర్ సరి్టఫికెట్ పునరుద్ధరించినట్లు జలాన్ – కల్రాక్ కన్సార్షియం తెలపడంతో ఈ షేరుకు డిమాండ్ పెరిగింది.
ఎల్అండ్టీ రూ. 6 ప్రత్యేక డివిడెండ్
ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్అండ్టీ తమ షేర్హోల్డర్లకు రూ. 6 ప్రత్యేక డివిడెండ్ ప్రకటించింది. చైర్మన్ ఏఎం నాయక్.. ఆరు దశాబ్దాలుగా గ్రూప్‌నకు నిరంతరాయంగా సేవలు అందిస్తుండటాన్ని పురస్కరించుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనికి ఆగస్టు 2 రికార్డు తేదీ కాగా ఆగస్టు 14లోగా డివిడెండ్ చెల్లిస్తారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తిగా భారత కార్పొరేట్ చరిత్రలో నాయక్ పేరు చిరస్థాయిగా నిలి్చపోతుందని ఉద్యోగులకు రాసిన లేఖలో ఎల్అండ్టీ సీఈవో, ఎండీ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ తెలిపారు. దశాబ్దాలుగా ఆయన అందించిన సేవలకు గాను గౌరవ సూచకంగా షేర్హోల్డర్లకు ప్రత్యేక డివిడెండ్ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆగస్టు 9న జరిగే సిల్వర్ జూబ్లీ ఏజీఎంలో నాయక్ పాల్గోనున్నట్లు పేర్కొన్నారు.