బంగారం... లాభాల స్వీకరణ
న్యూఢిల్లీ: గడచిన 45 రోజుల్లో దాదాపు 80 డాలర్లు పెరిగిన పసిడి, 21వ తేదీతో ముగిసిన వారంలో కొంచెం లాభాల స్వీకరణ దిశగా కదులుతున్నట్లు కనిపించింది. వారం ప్రారంభంలో ఔన్స్ (31.1 గ్రా.) ధర అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో 1,294 డాలర్లకు చేరింది. అయితే వారం చివరకు 1,285 డాలర్ల వద్ద ముగిసింది. వారం వారీగా ఇది నాలుగు డాలర్లు తక్కువ.
సిరియా, ఉత్తరకొరియాలకు సంబంధించి యుద్ధ వాతావరణం కొంత శాంతించడం పసిడి నుంచి కొంత లాభాల స్వీకరణకు కారణంగా కనబడుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆర్థిక విధానాలకు సంబంధించి నెలకొన్న అస్పష్టత, డాలర్ బలహీనత వంటి అంశాలు పసిడి మున్ముందు కదలికలకు దోహదపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. వారం వారీగా డాలర్ ఇండెక్స్ 100.51 నుంచి 99.75 కు తగ్గింది. డాలర్ బలహీనపడే విధానాలకే ట్రంప్ ప్రభుత్వం మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే.
దేశీయంగా పెరుగుదల...
అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్ మార్కెట్‌పైనా పడింది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 10 గ్రాములకు 21వ తేదీతో ముగిసిన వారంలో స్వల్పంగా రూ.9 పెరిగి రూ.29,418కి చేరింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.29,495కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.29,345కి చేరింది. దేశీయంగా నెలకొన్న డిమాండ్ దీనికి కారణం. మరోవైపు నాలుగు వారాల్లో దాదాపు రూ.2,000 పెరిగిన పసిడి, గడచిన వారంలో రూ.1,070 నష్టపోయి, రూ.42,025 వద్ద ముగిసింది.