అల్ఫాబెట్ బోర్డులోకి సుందర్ పిచాయ్
వాషింగ్టన్: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తాజాగా కంపెనీ మాతృసంస్థ అల్ఫాబెట్ బోర్డులో డైరెక్టరుగా చోటు దక్కించుకున్నారు. గూగుల్ సీఈవోగా సుందర్ అద్భుతమైన పనితీరు కనపరుస్తున్నారని, వృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని అల్ఫాబెట్ సీఈవో ల్యారీ పేజ్ వెల్లడించారు. అల్ఫాబెట్ బోర్డులోకి ఆయన్ను స్వాగతిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నైకి చెందిన సుందర్ పిచాయ్.. 2004లో గూగుల్‌లో చేరారు.
కంపెనీ సహ వ్యవస్థాపకులు పేజ్, సెర్గీ బ్రిన్‌లతో కలిసి సుదీర్ఘకాలం పనిచేసిన అనంతరం 2015 ఆగస్టులో గూగుల్ సీఈవోగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది గూగుల్‌కి పేరెంట్ హోల్డింగ్ కంపెనీగా ఆల్ఫాబెట్ ఏర్పాటైంది. సుందర్ సారథ్యంలో గూగుల్ ప్రధానమైన ప్రకటనలు, యూట్యూబ్ వ్యాపారాల విభాగాల నుంచి ఆదాయాలను గణనీయంగా మెరుగుపర్చుకుంది. క్లౌడ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్ వంటి విభాగాల్లో ఇన్వెస్ట్ చేస్తోంది.