Larry Page
-
ప్రపంచ కుబేరుల్లో 6వ స్థానానికి ముకేశ్
ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ మరో ఘనత సాధించాడు. ప్రపంచ కుబేరుల జాబితాలో 6వ స్థానానికి ఎగబాకారు. సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం ఎలెన్ మస్క్‌ను, గూగుల్ సహ-వ్యవస్థాపకులు బ్రెయిన్, లారీ పేజ్‌లను అధిగమించడం ద్వారా ఈ ఘనతను సాధించినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకటించింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద 72.4బిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికా టెక్ షేర్లు సోమవారం భారీ పతనాన్ని చవిచూశాయి. షేర్ల పతనంతో లారీ పేజ్ సంపద 71.6బిలియన్ డాలర్లకు, బ్రెయిన్స్ సంపద 69.4బిలియన్ డాలర్లకు, టెస్లా అధినేత మస్క్ సంపద 68.6బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతవారంలో చివర్లో ఇదే సంపద విషయంలో స్టాక్ మార్కెట్ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ను అధిగమించిన సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి ఈమార్చి నుంచి పలు దేశాలు విధించిన లాక్‌డౌన్‌తో అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇటువంటి క్లిష్టతరుణంలో ముఖేష్ అంబానీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్బుక్, సిల్వర్‌లేక్, క్వాల్‌కాంతో సహా సుమారు 12 విదేశీ కంపెనీలకు 25.24 శాతం వాటా విక్రయం ద్వారా 13 విదేశీ సంస్థల నుంచి రూ.1.18 లక్షల కోట్ల మేర నిధులు సమీకరించింది. ఫలితంగా రిలయన్స్ షేరు మార్చి కనిష్టస్థాయి నుంచి రెట్టింపు లాభాల్ని ఆర్జించింది. భారత్‌లో శరవేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ వ్యాపారాన్ని దృష్టి పెట్టుకుని ముకేశ్ ఈ-కామర్స్ రంగంలో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభ కలిగిన మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక విదేశీ కంపెనీలు... ముఖ్యంగా అమెరికా ఆధారిత కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అందులో భాగంగా నిన్నటి రోజులన వచ్చే 5–7 సంవత్సరాల్లో సుమారు రూ. 75 వేల కోట్లు (దాదాపు 10 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు గూగుల్ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సరిలేరు ‘సుందర్’కెవ్వరు..!
హోదాల బదలాయింపుతో అల్ఫాబెట్ సంస్థాగత స్వరూపంలో గానీ రోజువారీ కార్యకలాపాల్లో గానీ పెద్ద మార్పులేమీ ఉండబోవు. ఎప్పట్లాగే ఇకపైనా గూగుల్‌ని మరింత వృద్ధిలోకి తెచ్చేందుకు కృషి చేస్తా. కంప్యూటింగ్ హద్దులు చెరిపేసేందుకు, అందరికీ మరింత ఉపయోగకరంగా ఉండేలా గూగుల్‌ను తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతాయి. పెను సవాళ్లను టెక్నాలజీతో పరిష్కరించే దిశగా అల్ఫాబెట్ దీర్ఘకాలిక వ్యూహాల అమలు కూడా కొనసాగుతుంది. – సుందర్ పిచాయ్ వాషింగ్టన్: టెక్నాలజీ ప్రపంచంలో మనోళ్ల హవా కొనసాగుతోంది. టెక్ దిగ్గజం గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (సీఈఓ)గా ఉన్న సుందర్ పిచాయ్ (47)... తాజాగా దాని మాతృసంస్థ అల్ఫాబెట్‌కూ సీఈవోగా నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఈ బాధ్యతల్లో ఉన్న గూగుల్ సహ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్ వాటి నుంచి తప్పుకున్నారు. తాజా పరిణామంతో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకరిగా సుందర్ పిచాయ్ నిలవనున్నారు. మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు తెలుగువాడైన సత్య నాదెళ్ల సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త మార్పులపై కంపెనీ ఉద్యోగులకు పేజ్, బ్రిన్ లేఖ రాశారు. అల్ఫాబెట్ ప్రస్తుతం గట్టిగా నిలదొక్కుకుందని, గూగుల్‌తో పాటు ఇతర అనుబంధ సంస్థలూ స్వతంత్రంగా రాణిస్తున్నాయని... మేనేజ్మెంట్ వ్యవస్థను సరళీకరించేందుకు ఇదే సరైన తరుణమని వారు పేర్కొన్నారు. ‘కంపెనీని మరింత మెరుగ్గా నడిపించగలిగే మార్గాలున్నప్పుడు.. మేము మేనేజ్మెంట్ హోదాలకు అతుక్కుని ఉండదల్చుకోలేదు. అల్ఫాబెట్, గూగుల్ సంస్థలకిక ఇద్దరు సీఈవోలు, ఒక ప్రెసిడెంట్ అవసరం లేదు. ఇకపై రెండింటికీ సుందరే సీఈవోగా ఉంటారు. గూగుల్‌కు సారథ్యం వహించడంతో పాటు ఇతర అనుబంధ సంస్థల్లో అల్ఫాబెట్ పెట్టుబడులన్నింటినీ ఆయనే చూస్తారు‘ అని పేజ్, బ్రిన్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ బోర్డు సభ్యులుగా, షేర్‌హోల్డర్లుగా, సహ–వ్యవస్థాపకులుగా గూగుల్, అల్ఫాబెట్ వృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ‘దాదాపు 15 సంవత్సరాలుగా.. అల్ఫాబెట్ ఏర్పాటులోనూ, గూగుల్ సీఈవోగా, అల్ఫాబెట్ డైరెక్టరుగా సుందర్ పిచాయ్ మాతో కలిసి నడిచారు. అల్ఫాబెట్ భవిష్యత్తుపైన, సవాళ్లను టెక్నాలజీ సాయంతో అధిగమించేలా చేయగలిగే సంస్థ సామర్థ్యంపైనా మాకున్నంత నమ్మకం ఆయనకూ ఉంది‘ అని పేజ్, బ్రిన్ తెలిపారు. సెర్చికి పర్యాయపదంగా గూగుల్... ఒకప్పటి దిగ్గజం యాహూను పక్కకు నెట్టేసి.. ఇంటర్నెట్లో సెర్చికి పర్యాయపదంగా మారిన గూగుల్‌ను సెర్గీ బ్రిన్, ల్యారీ పేజ్ 1998లో ఆరంభించారు. పేజ్ తొలి సీఈవో కాగా... తర్వాత 2001 నుంచి 2011 దాకా ఎరిక్ ష్మిట్ ఆ హోదాలో కొనసాగారు. తర్వాత పేజ్ మళ్లీ కొన్నాళ్ల పాటు సీఈవోగా వచ్చారు. 2015లో హోల్డింగ్ కంపెనీగా అల్ఫాబెట్‌ను ఏర్పాటు చేసినప్పట్నుంచీ బ్రిన్, పేజ్.. గూగుల్‌లో కీలక పాత్ర పోషించడాన్ని తగ్గించుకున్నారు. సింపుల్.. సుందర్ ఐఐటీలో చదివేటప్పుడు తనకు ఒక దశలో సీ గ్రేడ్ రావడం.. మళ్లీ మెరుగుపడటానికి తాను కిందా మీదా పడటం లాంటి ఆసక్తికరమైన విషయాలను కొన్నాళ్ల కిందట ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యార్థులతో సమావేశమైన సందర్భంగా పిచాయ్ చెప్పారు. చిన్నప్పటి సాదా సీదా జీవితాన్ని ఒక పత్రిక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఇప్పటితో పోలిస్తే అప్పట్లో మా జీవితం సింపుల్‌గా, హాయిగా ఉండేది. ఒక మోస్తరు అద్దింట్లో ఉంటూ లివింగ్ రూమ్‌లో హాయిగా కింద పడుకునేవాళ్లం. ఒకసారి తీవ్ర కరువొచ్చింది. అదెంత భయపెట్టిందంటే.. ఇప్పటికీ నేను పడుకునేటప్పుడు మంచం పక్కన మంచినీటి బాటిల్ పెట్టుకుంటాను. మేం ఫ్రిజ్ కొనుక్కోవడం అప్పట్లో మాకో గొప్ప విశేషం‘ అని ఆయన చెప్పుకొచ్చారు. గూగుల్‌లో టీమ్‌ను ముందుండి నడిపించగలిగే సత్తాతో టాప్ మేనేజ్మెంట్ దృష్టిలో పడ్డారు. మృదు భాషిగా, ఎవర్నీ నొప్పించకుండా సమస్యలను పరిష్కరించగలిగే వ్యక్తిగా సుందర్ గురించి ఆయన సన్ని హితులు చెబుతారు. విభిన్న ఉత్పత్తులపై, టెక్నాలజీపై పరిజ్ఞానంతో పాటు ఈ సామర్థ్యాలే ఆయన్ను గూగుల్‌లో కీలక వ్యక్తిగా నిలిపాయి. మదురై టు సిలికాన్ వ్యాలీ... సుందర్ పిచాయ్ తమిళనాడులోని మదురైలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీరు కాగా తల్లి స్టెనోగ్రాఫర్. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేస్తూ అక్కడే తన జీవిత భాగస్వామి అంజలిని కలిశారు. తరవాత అమెరికాలోని స్టాన్ఫోర్డ్ వర్సిటీలో ఎంఎస్ చేశారు. ఎంబీఏ అనంతరం 2004లో గూగుల్‌లో చేరారు. కీలకమైన క్రోమ్ బ్రౌజర్ ప్రాజెక్టును విజయవంతం చేశాక కంపెనీలో ఆయన వేగంగా ఎదిగారు. 2013లో ముఖ్యమైన ఆండ్రాయిడ్ డివిజన్ ఇన్చార్జిగా... తర్వాత రెండేళ్లకే 2015లో గూగుల్ సీఈవో అయ్యారు. దాంతోనే పలు అల్ఫాబెట్ ప్రాజెక్టులూ ఆయన పరిధిలోకి వచ్చాయి. ఇటీవల ఉద్యోగుల నిరసనల్లాంటి వాటితో పాటు పలు వివాదాలను సమర్థంగా ఎదుర్కొన్న తీరు.. అల్ఫాబెట్ సీఈవో పీఠానికి ఆయన్ను మరింత దగ్గర చేశాయి. భార్య అంజలితో సుందర్ పిచాయ్ -
ఎగిరే కార్ల రేసులోకి ఆ కంపెనీ కూడా..
డ్రైవర్ అనే వాడే లేకుండా వాటంతట అవే నడిచే వాహనాలు రోడ్ల మీదకు వస్తాయి. కేవలం రోడ్లపైనే కాక, గగనంలోనూ స్వయంప్రతిపత్త వాహనాలు ఎగరబోతున్నాయి. ఈ బిగ్ ట్రాన్స్‌పోర్టేషన్ ట్రెండ్ ఇప్పుడిప్పుడే ప్రపంచమంతటా వ్యాప్తిస్తోంది. ఉబర్ దుబాయ్‌లో ఈ ఎగిరే ట్యాక్సీ నెట్‌వర్క్‌ను క్రియేట్ చేస్తుండగా.. గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీపేజ్ కిట్టి హాక్ అనే ఎగిరే కారు స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ఇప్పటికే పలువురు కస్టమర్లకు వీటిని ఆఫర్ చేస్తుంది కూడా. తాజాగ ఈ రేసులోకి రోల్స్ రాయిస్ కూడా వచ్చి చేరింది. యూకేలో జరిగిన ఫార్న్బోరో అంతర్జాతీయ ఎయిర్ షోలో ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఈ వెహికిల్ హెలికాప్టర్ తరహాలో గగనతలంలో ఎగరడంతోపాటు రోడ్డుపైనా దూసుకెళ్తుంది. ఈ వెహికిల్ ఐదుగురు ప్రయాణికులను తీసుకెళ్లడంతో పాటు, గాల్లో 500 మైళ్ల (805 కిలోమీటర్లు) వరకు ప్రయాణించగలదని, గంటకు గరిష్ఠంగా 200 మైళ్ల వేగంతో దూసుకెళ్లగలదని సంస్థ తెలిపింది. మరో ఏడాదిన్నరలో ఈ హైబ్రిడ్ ఫ్లయింగ్ ట్యాక్సీ ప్రొటొటైప్ సిద్ధం కానుందని, 2020నాటికి వెహికిల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రోల్స్‌రాయిస్ ఎలక్ట్రిక్ టీమ్ హెడ్ రాబ్ వాట్సన్ తెలిపారు. టేకాఫ్ అవ్వడం కానీ ల్యాండ్ అవ్వడం కానీ వెర్టికల్‌గా జరుగుతుందని కంపెనీ తెలిపింది. ఈ వెహికిల్ వింగ్స్ 90 డిగ్రీల్లో తిరుగుతూ ఉంటాయని చెప్పింది. -
అల్ఫాబెట్ బోర్డులోకి సుందర్ పిచాయ్
వాషింగ్టన్: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తాజాగా కంపెనీ మాతృసంస్థ అల్ఫాబెట్ బోర్డులో డైరెక్టరుగా చోటు దక్కించుకున్నారు. గూగుల్ సీఈవోగా సుందర్ అద్భుతమైన పనితీరు కనపరుస్తున్నారని, వృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని అల్ఫాబెట్ సీఈవో ల్యారీ పేజ్ వెల్లడించారు. అల్ఫాబెట్ బోర్డులోకి ఆయన్ను స్వాగతిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నైకి చెందిన సుందర్ పిచాయ్.. 2004లో గూగుల్‌లో చేరారు. కంపెనీ సహ వ్యవస్థాపకులు పేజ్, సెర్గీ బ్రిన్‌లతో కలిసి సుదీర్ఘకాలం పనిచేసిన అనంతరం 2015 ఆగస్టులో గూగుల్ సీఈవోగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది గూగుల్‌కి పేరెంట్ హోల్డింగ్ కంపెనీగా ఆల్ఫాబెట్ ఏర్పాటైంది. సుందర్ సారథ్యంలో గూగుల్ ప్రధానమైన ప్రకటనలు, యూట్యూబ్ వ్యాపారాల విభాగాల నుంచి ఆదాయాలను గణనీయంగా మెరుగుపర్చుకుంది. క్లౌడ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్ వంటి విభాగాల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. -
మోస్ట్ పాపులర్ సీఈవో ఎవరో తెలుసా?
గూగుల్ తల్లి పుట్టుకకు కృషిచేసిన వారిలో ఒకరైన, దాని పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్స్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్న లారీ పేజ్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఫోర్బ్స్ ప్రకటించే ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన సీఈవోల జాబితా- 2016లో ఆయన మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. లారీ పేజ్ తర్వాతి స్థానంలో ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ నిలిచారు. ఫోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాలో ఆన్లైన్ షాపింగ్ రిటైలర్‌గా పేరుగాంచిన అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ మూడో స్థానాన్ని పొందారు. ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌కు నాలుగో స్థానం, ఆయన తర్వాత జేపీ మోర్గాన్ చేస్ సీఈవో, చైర్మన్ జామీ డిమోన్ ఉన్నారు. టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ ఆరో స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఇతర ఉన్నత సీఈవో స్థానంలో ఉన్న ఉబర్ సీఈవో ట్రావిస్ కలానిక్, జనరల్ మోటార్స్ చీఫ్ మేరీ బర్రాలు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. -
గూగుల్ దేవోభవ!
సెప్టెంబర్ 4 గూగుల్ వార్షికోత్సవం, సెప్టెంబర్ 5 గురుపూజోత్సవం సందర్భంగా... ఆవకాయను ఎలా తయారు చేయాలి? ‘గూగుల్’ను అడిగితే చాలు... సచిత్ర పాఠం క్షణాల్లో కళ్ల ముందు ఉంటుంది. అంతరిక్ష విజ్ఞానంలో తాజా పరిణామాలేంటి? ‘గూగుల్’ను అడిగితే చాలు... సమస్త సమాచారమూ సమగ్రంగా చిటికెలో ప్రత్యక్షమవుతుంది. కొరుకుడు పడని పాఠాలేవైనా కావచ్చు, కోరుకున్న విద్యలేవైనా కావచ్చు.. ‘గూగుల్’ను అడిగితే చాలు... యమ ఓపికగా పండు ఒలిచి చేతిలో పెట్టినంత చక్కగా వివరిస్తుంది. బెత్తం పట్టుకోదు, గుంజీలు తీయించదు, గోడ కుర్చీలు వేయించదు... ఎలాంటి పాఠాలనైనా ఏమాత్రం కసురుకోకుండా ఫ్రెండ్లీగా బోధిస్తుంది. ఎలాంటి సందేహాన్నైనా ఏమాత్రం విసుక్కోకుండా చిటికెలో తీర్చేస్తుంది. ఈ-తరానికి గురువూ, దైవం గూగుల్. ఈ-తరానికి ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ గూగుల్. గూగుల్ ఒక జ్ఞాన నిధి, ఒక విజ్ఞాన ఖని. పద్దెనిమిదేళ్ల కిందట సాదాసీదా సెర్చ్ ఇంజన్‌గా ‘గూగుల్’ మొదలైనప్పుడు అది నిరంతర సమాచార ఖనిగా పరిణమించగలదని, అంచెలంచెలుగా విస్తరించి విశ్వవ్యాప్తమై అధునాతన ప్రపంచంలో అనేకానేక ఏకలవ్య శిష్యులకు జగద్గురువుగా అవతరించగలదని ఎవరూ ఊహించలేదు. గూగుల్ ప్రస్థానం అభూత కల్పనల కంటే విడ్డూరమైనది. గూగుల్ సాధించిన విజయాలు ఇంటర్నెట్ ప్రపంచంలోని ఇతరేతర శతకోటి విజయాల కంటే ఘనమైనవి. ‘ఆచార్య దేవో భవ’ అని గురువులను గౌరవించడం మన సంస్కృతి. దాదాపు ఇంటింటికీ ఇంటర్నెట్ విస్తరించడంతో సమాచార విప్లవంలో ‘గూగుల్’ గురుతర పాత్ర పోషిస్తోంది. శాస్త్ర సాంకేతికాలకు మాత్రమే పరిమితం కాకుండా వంటా వార్పు వంటి సామాన్య విషయాలపైనా పాఠాలు బోధిస్తోంది. ఈ-తరానికి గురువుగా మారిన గూగులాచార్యుల కథా కమామిషూ... చదువులెంత సులభం! చదువుల తీరుతెన్నుల చరిత్రను ఇప్పుడు ఎవరైనా రాస్తే, ఆ చరిత్రను గూగుల్ పూర్వయుగం, గూగుల్ అనంతర యుగంగా విభజించుకోవడం అనివార్యం. ఇంటర్నెట్ అనేది ఊహకందని కాలంలో, గూగుల్ అనే సమాచార ఖని అందుబాటులోకి రాని కాలంలో చదువులు బహు కష్టంగా ఉండేవి. పాఠాలు నేర్చుకునే విద్యార్థులకే కాదు, పాఠాలు నేర్పే గురువులకు కూడా! పొల్లు పోకుండా పాఠాలను వల్లె వేయాల్సి వచ్చేది. పరీక్షలకు ముందు అవే పాఠాలను పదే పదే బట్టీ పట్టాల్సి వచ్చేది. అయినా ఒక పట్టాన గుర్తుండి చచ్చేవి కాదు. చాలా అంశాల్లో ఏమిటి? ఎందుకు? ఎలా? అనే మౌలికమైన ప్రశ్నలకు పాఠ్యపుస్తకాల్లో ఉన్న సమాధానాలు అర్థమయ్యీ కానట్లు ఉండేవి. రకరకాల సందేహాలు తలెత్తేవి. వెనువెంటనే వాటిని నివృత్తి చేసుకునే మార్గమే అందుబాటులో ఉండేది కాదు. కొత్త పదాలు వేటికైనా అర్థాలు తెలుసుకోవాలంటే దిండు సైజులో కొండలా ఉండే నిఘంటువుల్లో పేజీలకు పేజీలు ఓపికగా తిరగేస్తూ వెదుక్కోవాల్సి వచ్చేది. కొరుకుడుపడని సబ్జెక్టుల్లో ఏవైనా సందేహాలు తలెత్తినా, టీచర్లను అడగాలంటే భయ సంకోచాలు వెంటాడేవి. ఓపికగా సందేహాలను నివృత్తి చేసే టీచర్లు కొద్దిమంది మాత్రమే ఉండేవారు. చాలామంది టీచర్లు కోపతాపాలను ప్రదర్శించేవారు. ఇవన్నీ విద్యార్థుల కష్టాలు. అయితే, టీచర్ల కష్టాలు టీచర్లకూ ఉండేవి. తమకే తెలియని విషయాలపై సందేహాలతో నిత్యం విసిగించే విద్యార్థులతో వేగడం అగ్నిపరీక్షలా ఉండేది. అపర చండామార్కుల వంటి టీచర్లు అలాంటి గడ్డు పరిస్థితులను దండోపాయంతో నెట్టుకొచ్చేసేవారు. అయితే, టీచర్లందరూ దండోపాయ దురంధరులగు చండామార్కుల వారసులు కాదు కదా! వాళ్లల్లోనూ అమాయకపు పరమానందయ్యలు ఉంటారు. పాపం అలాంటి వాళ్లకే కష్టాలన్నీ... పైగా విద్యార్థులకు కూడా పరమానందయ్యల వంటి టీచర్ల దగ్గరే కాస్త చనువెక్కువ. అందుకే వాళ్లనే పదే పదే సందేహాలతో సతాయిస్తూ ఉంటారు. ‘గూగుల్’ పుట్టుకకు మునుపు గడచిన సత్తెకాలంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు చదువులు సవాలుగా ఉండేవి. ‘గూగుల్’ ఆవిర్భావం తర్వాత చాలావరకు కష్టాలు తీరిపోయాయి. చదువులు సులభమయ్యాయి. ఎలాంటి సందేహమైనా సరే, నివృత్తి చేసుకోవడం ఒక క్లిక్కుతో జరిగే పనిగా మారింది. ఇద్దరు మిత్రుల కథ పాతికేళ్ల కిందట ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. బ్రిటిష్ శాస్త్రవేత్త సర్ టిమ్ బెరర్స్ లీ తొలిసారిగా 1989 మార్చి 12న ‘వరల్డ్ వైడ్ వెబ్’ ప్రతిపాదన చేశారు. మొదటి సెర్చ్ ఇంజన్ ‘ఆర్చీ’ 1990లో ఏర్పాటైంది. ఆ తర్వాత 1991 ఆగస్టులో మొట్టమొదటి వెబ్సైట్ ‘ఇన్ఫో.సెర్న్.సీహెచ్’ ఏర్పడింది. కంప్యూటర్ల నుంచి కంప్యూటర్లకు సమాచార మార్పిడి తేలికైంది. ఈ-మెయిల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వెబ్సైట్లు ఒక్కొక్కటే ఏర్పడసాగాయి. విద్యారంగంలో నెమ్మదిగా హైటెక్కు టమారాలన్నీ మొదలవసాగాయి. అలాంటి కాలంలో... 1996లో ల్యారీ పేజ్, సెర్జీ బ్రిన్ అనే అమెరికన్ కుర్రాళ్లు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒకరినొకరు కలుసుకున్నారు. ఇద్దరూ పీహెచ్డీ స్కాలర్లే! పాపం అప్పటికి అబ్దుల్ కలాం వాళ్లకేమీ చెప్పలేదు గాని, వాళిద్దరూ ఒక పెద్ద కల కన్నారు. ఇంటర్నెట్లోని సమస్త సమాచారాన్నీ ఒకేచోట అందుబాటులోకి తేవాలన్నదే వారి కల. దానిని సాకారం చేసుకోవడానికి 1997 సెప్టెంబర్ 15న ‘గూగుల్ డాట్ కామ్’ డొమైన్ పేరును నమోదు చేసుకున్నారు. ఏడాది గడవకుండానే... 1998 సెప్టెంబర్ 4న గూగుల్ కంపెనీని ఏర్పాటు చేశారు. తమ తోటి పీహెచ్డీ సహాధ్యాయి క్రెయిగ్ సిల్వర్స్టీన్ను తొలి ఉద్యోగిగా చేర్చుకున్నారు. అప్పట్లో వాళ్లు కాలిఫోర్నియాలోని మెన్లో పార్కు ప్రాంతంలో సూసాన్ వోజ్సికి అనే స్నేహితురాలి ఇంటి గ్యారేజీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలా మొదలైన ప్రస్థానం రెండు దశాబ్దాలైనా గడవక ముందే అనేకానేక మైలురాళ్లను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కేవలం సెర్చ్ ఇంజన్‌గా మాత్రమే పరిమితమైపోకుండా, సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో ‘గూగుల్ ఎర్త్’ వంటి వినూత్నమైన సేవలను ప్రారంభించింది. అనూహ్యంగా అసంఖ్యాక ఘనవిజయాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో గూగుల్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ‘గూగుల్’ సంస్థ నికర విలువ ఇప్పుడు 49,800 కోట్ల డాలర్లకు పైమాటే. తాజా లెక్కల ప్రకారం ‘గూగుల్’లో 57,100 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఐటీ విద్యార్థులందరి కలల లక్ష్యం ‘గూగుల్’లో ఉద్యోగమేనంటే అతిశయోక్తి కాదు. ‘గూగుల్’లో ఉద్యోగమంటే రాజ వైభోగమేనని చెబుతారు. గూగుల్ నీడలో విద్యా వేదికలు ‘బ్లాగర్’, ‘యూట్యూబ్’ వంటివి ‘గూగుల్’ నీడలోనివే. ఇవి అందిస్తున్న సేవలు సమాచార విప్లవంలో కొత్త శకానికి నాంది పలికాయి. అంతేనా! చదువు సంధ్యల్లోనూ ఇవి తమదైన ముద్ర వేస్తున్నాయి. ‘గూగుల్’ దెబ్బతో ఇప్పుడు ఇంటర్నెట్ ఒక అనధికారిక ఓపెన్ యూనివర్సిటీలా మారింది. చదువుకోదలచిన వాళ్లకు చదువుకునేంత సమాచారం అందుబాటులో ఉంటోంది. ఔత్సాహిక రచయితలకు ‘బ్లాగర్’ అద్భుతమైన వేదికగా మారింది. తమకు తెలిసిన విజ్ఞానాన్ని పదిమందితో పంచుకోవడానికి, తమ సృజనాత్మకతను లోకానికి చాటుకోవడానికి ‘బ్లాగర్’ చక్కని వెసులుబాటు కల్పిస్తోంది. నిజానికి ‘బ్లాగర్’ను 1999లో పైరా ల్యాబ్స్ ప్రారంభించగా, దీనిని 2003లో ‘గూగుల్’ సొంతం చేసుకుంది. ఇక ‘యూట్యూబ్’ వినోద, విజ్ఞానాల సమ్మేళనంగా ఉపయోగపడుతోంది. వీడియో షేరింగ్ వెబ్సైట్ ‘యూట్యూబ్’ను 2005లో ‘పేపాల్’ ఉద్యోగులు కొందరు ప్రారంభించారు. ఆ మరుసటి ఏడాదిలోనే ‘గూగుల్’ దీనిని సొంతం చేసుకుంది. ‘యూట్యూబ్’లో సినిమాలు, టీవీ సీరియల్ ఎపిసోడ్లు, క్రీడలు, పాటలు వంటివే కాదు, పలు విషయాలకు సంబంధించిన పాఠాల వీడియోలూ రోజూ అసంఖ్యాకంగా చేరుతూనే ఉంటాయి. వినోదం కోసం ‘యూట్యూబ్’ను వినియోగించుకునే వారి సంగతి సరే, చాలామంది ‘యూట్యూబ్’ ద్వారా విలువైన పాఠాలను వ్యయప్రయాసలేవీ లేకుండానే నేర్చుకోగలుగుతున్నారు. గృహాలంకరణ వస్తువుల తయారీ, మొక్కల పెంపకం, వంటల తయారీ మొదలుకొని భౌతిక, రసాయనిక శాస్త్రాల ప్రయోగాలు, శస్త్రచికిత్సా ప్రక్రియల వరకు వివిధ అంశాల్లో పరిజ్ఞానాన్ని, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు లక్షలాది మంది ‘యూట్యూబ్’పై ఆధారపడుతున్నారు. ఈ-లెర్నింగ్... ‘గూగుల్’తో ఎలాంటి సంబంధాలు లేని ఈ-లెర్నింగ్ వెబ్సైట్లు అసంఖ్యాకంగా ఉన్నాయి. అవన్నీ రకరకాల విషయాలను కూలంకషంగా బోధిస్తున్నాయి. ఇంటర్నెట్ మొదలైన కొద్దికాలంలోనే ఈ-లెర్నింగ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. దాదాపు 1999 నుంచే ఈ-లెర్నింగ్‌కు జనాదరణ పుంజుకుంది. అయితే,‘గూగుల్’ లేకుంటే... ఏయే వెబ్సైట్లు ఈ-లెర్నింగ్ సేవవలను అందిస్తున్నాయో, ఏ సబ్జెక్టులను ఏయే వెబ్సైట్లు బోధిస్తున్నాయో జనాలకు తెలిసే అవకాశం ఉండేది కాదు. ‘గూగుల్’ పుణ్యాన చాలా ఈ-లెర్నింగ్ వెబ్సైట్లు జనాలకు చేరువయ్యాయి. మనకు నచ్చిన అంశాన్ని ఎన్నుకుని, ఆన్లైన్లో ఆ అంశాన్ని బోధిస్తున్న సంస్థలేవేవి ఉన్నాయో ‘గూగుల్’ను అడిగితే క్షణాల్లో చెప్పేస్తుంది. అప్పటి వరకు మనం కనీవినీ ఎరుగని వందలాది వెబ్సైట్లను చిటికెలో పరిచయం చేస్తుంది. ఈ-లెర్నింగ్ ప్రక్రియను ప్రజలకు చేరువ చేయడంలో గూగుల్ గురుతర పాత్ర పోషిస్తోంది. గూగుల్ సారథిగా భారతీయుడు ఇద్దరు అమెరికన్ కుర్రాళ్లు ప్రారంభించగా, అంచెలంచెలుగా ఎదిగి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ‘గూగుల్’ కంపెనీకి సారథిగా సుందర్ పిచయ్ గత ఏడాది బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది చేపట్టిన కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ‘అల్ఫాబెట్’కు ‘గూగుల్’ అనుబంధ సంస్థగా మారింది. ‘గూగుల్’ వ్యవస్థాపకుల్లో ఒకరైన ల్యారీ పేజ్ ‘అల్ఫాబెట్’కు సీఈవోగా బాధ్యతలు స్వీకరించగా, మరో వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ ‘అల్ఫాబెట్’ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. గూగుల్ సీఈవోగా సుందర్ పిచయ్ని నియమించారు. ఖరగ్‌పూర్ ఐఐటీ పట్టభద్రుడైన తర్వాత అమెరికాలో ఉన్నత విద్యలు పూర్తి చేసుకున్న సుందర్ పిచయ్ 2004లో ‘గూగుల్’లో చేరి, వివిధ కీలక బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. ప్రస్తుతం సీఈవోగా ఆయన ‘గూగుల్’ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గూగుల్ గురించి అవీ... ఇవీ... ♦ తొలినాళ్లలో గూగుల్ సెకనుకు 30-40 పేజీలను మాత్రమే ప్రాసెస్ చేయగలిగేది. ఇప్పుడు ఏకంగా కొన్ని మిలియన్ల పేజీలను ప్రాసెస్ చేయగలుగుతోంది. పద్దెనిమిదేళ్ల వ్యవధిలోనే ‘గూగుల్’ తన వేగాన్ని అపరిమితంగా పెంచుకుంది. ♦ ఇంటర్నెట్లో గూగుల్ కంటే ‘యాహూ’ నాలుగేళ్ల సీనియర్ సంస్థ. ‘గూగుల్’ శరవేగంగా ఎదుగుతుండటంతో, దానిని కొనుగోలు చేయాలని ‘యాహూ’ భావించింది. ‘గూగుల్’ కొనుగోలుకు 2002లో 300 కోట్ల డాలర్లు ఇవ్వజూపింది కూడా. అయితే, ‘గూగుల్’ వ్యవస్థాపకులు ఆ ఆఫర్‌ను తోసిపుచ్చారు. ♦ ‘గూగుల్’ స్పెల్లింగ్ ఒక అచ్చుతప్పు. ‘గూగుల్’ అసలు స్పెల్లింగ్ ‘జీఓఓజీఓఎల్’. అంటే, ఒకటి తర్వాత వంద సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అన్నమాట. ♦ ‘గూగుల్’ తొలిదశలో రూపొందించిన అల్గొరిథమ్ ‘పేజ్‌ర్యాంక్’ పేటెంట్ ఇప్పటికీ స్టాన్ఫోర్డ్ వర్సిటీ అధీనంలోనే ఉంది. ♦ ‘గూగుల్’ హోమ్‌పేజీలో ఇప్పుడైతే వివిధ సందర్భాల్లో డూడుల్స్ కనిపించడం మామూలైంది గాని, తొలి రోజుల్లో ‘గూగుల్’ లోగో యథాతథంగానే కనిపించేది. అయితే, గూగుల్ వ్యవస్థాపకులు ల్యారే పేజ్, సెర్జీ బ్రిన్లు నెవడాలో జరిగే ‘బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్’ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లారు. తాము కార్యాలయంలో ఉండటం లేదనే సమాచారాన్ని యూజర్లకు తెలియజేసేందుకు తొలిసారిగా అప్పుడు ‘బర్నింగ్ మ్యాన్’ డూడుల్‌ను హోమ్‌పేజీలో పెట్టారు. దానికి స్పందన బాగుండటంతో ప్రత్యేక సందర్భాల్లో డూడుల్స్ పెట్టడాన్ని అలవాటుగా చేసుకున్నారు. ♦ ‘గూగుల్’ హోమ్‌పేజీలో లోగో, సెర్చ్ బాక్స్ తప్ప మిగిలిన భాగమంతా తెల్లగా ఖాళీగానే ఉంటుంది. మిగిలిన వెబ్సైట్ల హోమ్పేజీల మాదిరిగా అందులో ఎలాంటి రంగులు, చమక్కులు, డిజైన్లు కనిపించవు. ఎందుకంటే, ‘గూగుల్’ వ్యవస్థాపకులిద్దరికీ వెబ్‌పేజీ డిజైనింగ్‌కు అత్యవసరమైన హెచ్‌టీఎంఎల్‌లో పరిజ్ఞానం అంతంత మాత్రమే. ♦ ‘గూగుల్’ భాషపై కూడా తనదైన ముద్ర వేసింది. ఆక్స్ఫర్డ్, వెబ్‌స్టర్ డిక్షనరీలో 2006లో ముద్రించిన ఎడిషన్లలో ‘గూగుల్’ పదాన్ని క్రియాపదంగా గుర్తించాయి. ఇంటర్నెట్లో సమాచారాన్ని వెదుకులాడటానికి ‘గూగులింగ్’ అనడం ఏకపద ప్రత్యామ్నాయంగా మారింది. గూగుల్ పరిమితులు... ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయష’ అనే కాలం పోయి ‘అన్నీ గూగుల్లోనే ఉన్నాయష’ అనుకునే కాలం వచ్చిపడింది. పిడికిట్లోకి ప్రపంచం ఇమిడిపోయే దశలో దూసుకొచ్చిన గూగుల్ చాలామందికి గురువుగా మారింది సరే, గురువులకు పరిమితులు ఉన్నట్లే, గూగుల్ పరిమితులు గూగుల్కూ ఉన్నాయి. వాటిని గుర్తించకుండా గూగుల్ చెప్పిందే వేదమనే భ్రమలో పడితే మాత్రం తంటాలు తప్పవు. అందువల్ల గూగుల్ పరిమితుల్లో కొన్నింటి గురించి క్లుప్తంగా... * గూగుల్ సెర్చ్‌లో ఏదైనా పదం కొడితే, ఆ పదానికి సంబంధించిన సమస్త లింకులూ క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ఒక్కో లింకు ఒక్కో వెబ్‌పేజీకి దారితీస్తుంది. కొన్ని వెబ్‌పేజీలలో ఇక్ష్వాకులం నాటి సమాచారం ఉంటుంది. పేజీని ప్రారంభించిన తర్వాత అప్డేట్ చేయకుండా ఏళ్ల తరబడి వదిలేసిన పేజీలు ఉంటాయి. అలాంటి సమాచారాన్ని నమ్ముకోలేం. * వెబ్పేజీల్లో పొందుపరచిన విషయాలలోని నాణ్యతను, కచ్చితత్వాన్ని గుర్తించడం గూగుల్‌కే కాదు, ఏ సెర్చ్ ఇంజన్‌కూ సాధ్యం కాదు. వివిధ విషయాల రచనా నాణ్యతను, కచ్చితత్వాన్ని నిర్ధారించడం మానవ మేధస్సుకు మాత్రమే సాధ్యం. * సాంకేతిక పురోగతి ఫలితంగా గూగుల్‌తో పాటు చాలా సెర్చ్ ఇంజన్లు హెచ్‌టీఎంఎల్‌లో లేని అంశాలను కూడా చాలావరకు చదవగలుగుతున్నాయి. అయినప్పటికీ తగిన వ్యాఖ్య, సమాచారం లేకుండా అప్లోడ్ చేసిన ఫొటోలు, ఆడియో, వీడియో సమాచారాన్ని విశ్లేషించడం ఇప్పటికీ వీటికి దుస్సాధ్యంగానే ఉంటోంది. * వివిధ సాంకేతిక కారణాల వల్ల సెర్చ్ ఇంజన్లకు అందని వెబ్‌పేజీలు కూడా చాలానే ఉంటాయి. అలాంటి వెబ్‌పేజీలలో ఏదైనా విలువైన సమాచారం ఉన్నా, వాటి యూఆర్ఎల్ మనకు కచ్చితంగా తెలిస్తే తప్ప వాటిని చూడటం సాధ్యం కాదు. వాటిని వెదుకులాడటానికి సెర్చ్ ఇంజన్లపై ఆధారపడటం కష్టమే. - పన్యాల జగన్నాథదాసు -
గూగుల్ ట్రెడిషన్ ను బ్రేక్ చేసిన పిచాయ్
శాన్ హోసె: ఆన్ లైన్ దిగ్గజ సంస్థ గూగుల్ లో సంప్రదాయాన్ని సీఈవో సుందర్ పిచాయ్ బ్రేక్ చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది గూగుల్ ఇన్వెస్టర్లకు ఆ సంస్థ నుంచి లేఖలు వెళ్లాయి. అయితే గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్ ఈ లేఖలు రాయలేదు. సంప్రదాయానికి భిన్నంగా సీఈవో పిచాయ్ లేఖలు రాశారు. నిజానికి పిచాయ్ గూగుల్ వ్యవస్థాపకుడు కాదు. ఆయనకు అత్యంత ప్రాధాన్యం దక్కిందని ఈ ఉదంతం రుజువు చేస్తోంది. అంతేకాదు పిచాయ్ పనితీరు పట్ల లారీ పేజ్, సెర్జీ బ్రిన్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ లేఖలో పిచాయ్ ను పరిచయం చేస్తూ లారీ పేజ్ రాసిన ఇంట్రడక్షన్ లో ఆయనపై ప్రశంసలు కురిపించారు. పిచాయ్ పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. ఆరు ప్రధాన విభాగాలపై దృష్టి సారించాల్సిన అవసరముందని పిచాయ్ తన లేఖలో పేర్కొన్నారు. గూగుల్ ప్రారంభమైన కొత్తలో సమాచారం అందించే బాధ్యతను మాత్రమే నిర్వర్తించిందని తర్వాత ప్రాధాన్యాలు మారాయన్నారు. 'టెక్నాలజీ అంటే డివైసెస్ లేదా ప్రొడక్టులను తయారు చేయడమే కాదు. లక్ష్యాలు ఉంటూనే ఉంటాయి. టెక్నాలజీ అనేది ప్రజాస్వామ్యీకరణ శక్తి. సమాచారం ద్వారా ప్రజలను సాధికారత దిశగా నడిపించాల'ని పిచాయ్ పేర్కొన్నారు. ప్రజలు విభిన్న తరహాలో సమాచారం కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఏఐ, స్మార్ట్ ఫోన్ సంబంధిత టెక్నాలజీలో గూగుల్ పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. తన లేఖను గూగుల్ ప్లస్, ట్విటర్, పేస్ బుక్ లో షేర్ చేశారు. -
గూగుల్ పుట్టినరోజు కానుక...
గూగుల్ మరో కొత్త సెర్చ్ ఇంజన్ని కొత్తగా ప్రవేశపెట్టింది. వెబ్ యూజర్స్ దీని ద్వారా మరింత త్వరగా కావలసినవాటిని వెతుక్కోవడానికి ఈ సెర్చ్ ఇంజన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇంటర్నెట్ యూసేజ్‌లో మార్పులు తీసుకురావాలని భావించిన గూగుల్, సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. కొన్నిసెర్చ్ టూల్స్ కొద్దిగా కాంప్లికేటెడ్‌గా ఉండటంతో, సంప్రదాయంగా వస్తున్న బూలియన్ లేదా కీవర్డ్ బేస్ట్ సిస్టమ్ వాడకం క్రమేపీ తగ్గుతోంది. అందుకు కారణం... ఇచ్చిన పదాలతో కావలసిన కాన్సెప్ట్ మ్యాచ్ కాకపోవడమే. హమ్మింగ్‌బర్డ్ ద్వారా గూగుల్ కంపెనీ పడిన శ్రమకు తగిన ఫలితం లభించిందని సింఘాల్ అన్నారు. గూగుల్ వ్యవస్థాపకులైన ల్యారీ పేజ్, సెర్జీ బ్రిన్... మెన్లో పార్క గ్యారేజ్ నుంచే తమ కొత్త సెర్చ్ ఇంజన్ని ప్రారంభించారు. 1998లో ఏ విధంగా సెర్చ్ చేశామో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. పెద్ద కంప్యూటర్ని ముందుగా బూట్ చేసి, మోడెమ్‌ని ఆన్ చేసి, కొన్ని కీవర్డ్సని టైప్ చేసి, వెబ్సైట్లకి సంబంధించిన పది బ్లూ లింక్‌లను ఓపెన్ చేస్తేనే కాని కనెక్ట్ కాలేకపోయేవారమని సింఘాల్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘ప్రపంచం చాలా మారింది. ఇప్పుడు బిలియన్ల కొద్దీ ప్రజలు ఆన్‌లైన్‌లోకి వస్తున్నారు. వెబ్ వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు మనకు కావలసిన ఏ అంశాన్నయినా పాకెట్లో ఉన్న డివైస్ మీద చిన్న క్లిక్ ద్వారా పొందుతున్నాం’ అని... సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సింఘాల్ అన్నారు. గూగులా? మజాకానా? హోమ్ పేజీ తయారు చేయడానికే 200 మంది పనిచేశారంటేనే అర్థం అవుతోంది... గూగుల్ అందరికీ ఎందుకు చేరువయ్యిందనేది.