ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ మరో ఘనత సాధించాడు. ప్రపంచ కుబేరుల జాబితాలో 6వ స్థానానికి ఎగబాకారు. సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం ఎలెన్ మస్క్‌ను, గూగుల్ సహ-వ్యవస్థాపకులు బ్రెయిన్, లారీ పేజ్‌లను అధిగమించడం ద్వారా ఈ ఘనతను సాధించినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకటించింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద 72.4బిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికా టెక్ షేర్లు సోమవారం భారీ పతనాన్ని చవిచూశాయి. షేర్ల పతనంతో లారీ పేజ్ సంపద 71.6బిలియన్ డాలర్లకు, బ్రెయిన్స్ సంపద 69.4బిలియన్ డాలర్లకు, టెస్లా అధినేత మస్క్ సంపద 68.6బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతవారంలో చివర్లో ఇదే సంపద విషయంలో స్టాక్ మార్కెట్ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ను అధిగమించిన సంగతి తెలిసిందే.
కరోనా కట్టడికి ఈమార్చి నుంచి పలు దేశాలు విధించిన లాక్‌డౌన్‌తో అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇటువంటి క్లిష్టతరుణంలో ముఖేష్ అంబానీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్, సిల్వర్‌లేక్, క్వాల్‌కాంతో సహా సుమారు 12 విదేశీ కంపెనీలకు 25.24 శాతం వాటా విక్రయం ద్వారా 13 విదేశీ సంస్థల నుంచి రూ.1.18 లక్షల కోట్ల మేర నిధులు సమీకరించింది. ఫలితంగా రిలయన్స్ షేరు మార్చి కనిష్టస్థాయి నుంచి రెట్టింపు లాభాల్ని ఆర్జించింది.
భారత్‌లో శరవేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ వ్యాపారాన్ని దృష్టి పెట్టుకుని ముకేశ్ ఈ-కామర్స్ రంగంలో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభ కలిగిన మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక విదేశీ కంపెనీలు... ముఖ్యంగా అమెరికా ఆధారిత కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అందులో భాగంగా నిన్నటి రోజులన వచ్చే 5–7 సంవత్సరాల్లో సుమారు రూ. 75 వేల కోట్లు (దాదాపు 10 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు గూగుల్ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment