
న్యూఢిల్లీ: నాలుగు నౌకాశ్రయాల కన్సార్షియంకు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐఎల్)లో ప్రభుత్వ వాటాల వ్యూహాత్మక విక్రయాలకు గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం డీసీఐఎల్‌లో ప్రభుత్వానికి 73.44 శాతం వాటా ఉంది. ‘‘డీసీఐఎల్‌లో పూర్తి 100 శాతం వాటాలను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, పారాదీప్ పోర్ట్ ట్రస్ట్, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, కాండ్లా పోర్ట్ ట్రస్ట్‌లకు విక్రయించడానికి ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) సూత్రప్రాయ ఆమోదముద్ర వేసింది’’ అని ఆర్థికశాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది.
రెండువైపులా లాభమే...!
పోర్టులతో డ్రెడ్జింగ్ కార్యకలపాలను మరింత అనుసంధానం చేయడానికి తాజా నిర్ణయం దోహదపడుతుందని, కంపెనీ కార్యకలాపాల విస్తరణకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని వివరించింది. డీసీఐఎల్‌లో భారీ పెట్టుబడులకు ఇది అవకాశమని వివరించింది. పోర్టులకూ ఈ నిర్ణయం ఆర్థిక ప్రయోజనాలను సృష్టిస్తుందని విశ్లేషించింది. ద్రవ్యలోటు లక్ష్యాలను ఎదుర్కొనడంలో భాగంగా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో (పీఎస్‌యూలు) పెట్టుబడుల ఉపసంహరణ (వాటాల విక్రయం) ద్వారా రూ.80,000 కోట్లను సమీకరించాలన్న లక్ష్యంతో ఉన్న కేంద్రం... మార్కెట్ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వరంగ సంస్థల మధ్యే విలీనాలు, కొనుగోళ్లు, షేర్ల బైబ్యాక్ మార్గాలను కేంద్ర ఆర్థిక శాఖ తెరపైకి తీసుకొస్తోంది. ఆయా మార్గాల ద్వారా ఇప్పటికి రూ.15,000 కోట్లను సమకూర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment