
లక్ష్యాన్ని దాటేస్తాం!
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం పొడవునా ద్రవ్యలోటుతో సతమతమైన ప్రభుత్వం చివరి త్రైమాసికం(క్యూ4)లో ఒక్కసారిగా జోష్‌లోకి వచ్చింది. ఇందుకు ప్రధానంగా డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యంపై గురిపెట్టింది. ఇందుకు ప్రభుత్వ రంగ కంపెనీల నుంచి అందుకుంటున్న భారీ డివిడెండ్లకుతోడు, వాటా విక్రయ ఆఫర్ల వేగాన్ని పెంచింది. వెరసి బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.40,000 కోట్లను మించి నిధులను సమీకరించే బాటలో సాగుతోంది.
ఏడాది ముగిసేసరికి రూ. 60,000 కోట్ల వరకూ జమ చేసుకోనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఆర్థికపరంగా ఇది కొంతమేర ఉపశమనాన్ని కల్పించే అవకాశమున్నప్పటికీ... ప్రణాళికా వ్యయాలను ప్రభుత్వం భారీగా తగ్గించుకోవలసి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న తాత్కాలిక(ఓటాన్ అకౌంట్) బడ్జెట్‌ను ప్రభుత్వం వినియోగించుకుంటుందని అంచనా. ఫలితంగా ఈ ఏడాదికి ద్రవ్యలోటునుజీడీపీలో 4.8%కు పరిమితం చేసే అవకాశముంది. ఇది ప్రభుత్వం లక్ష్యంకాగా, గత ఆర్థిక సంవత్సరంలో లోటు 4.9%కు చేరిన విషయం విదితమే.
యాక్సిస్‌లో వాటా అమ్మకం
యాక్సిస్ బ్యాంక్‌లో ఎస్‌యూయూటీఐ ద్వారా కలిగి ఉన్న వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. యాక్సిస్‌లోగల 23.5% వాటా విలువ రూ. 13,000 కోట్లుగా అంచనా. ఇదే విధంగా హిందుస్తాన్ జింక్, ఐఓసీ, ఇంజినీర్స్ ఇండియాలలోనూ కొంత వాటాను అమ్మే సన్నాహాల్లో ఉంది. ఇందుకు వీలుకల్పిస్తూ ఒక కంపెనీలో మరో కంపెనీ.. వాటాలను కొనే(క్రాస్ హోల్డింగ్) అంశాన్ని తెరమీదకు తెచ్చింది. దీనిలో భాగంగా ఐవోసీలో ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా విడిగా 5% చొప్పున వాటాలను కొనుగోలు చేయనున్నాయి. తద్వారా ప్రభుత్వానికి రూ. 5,500 కోట్ల వరకూ లభించనున్నాయి. హిందుస్తాన్ జింక్, బాల్కోల్లో వాటా విక్రయం ద్వారా రూ. 22,000 కోట్ల వరకూ సమకూరే అవకాశముంది. ఇక కోల్ ఇండియా నుంచి ప్రభుత్వం రూ. 16,500 కోట్ల భారీ డివిడెండ్‌ను అందుకుంది. కోల్ ఇండియా షేరుకి రూ.29 డివిడెండ్‌ను చెల్లించింది. ఈ బాటలో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు తదితర సంస్థలు రానున్న రోజుల్లో మధ్యంతర డివిడెండ్లను చెల్లించనున్నాయి.