న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాలో వ్యూహాత్మక వాటా విక్రయానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. ఇప్పటికే ఎయిర్ ఇండియా డైరెక్టర్ల బోర్డ్ ఒక ప్రణాళికను రూపొందించిందని పేర్కొన్నారు.
ఎయిర్ ఇండియాలో తాము ఆఫర్ చేసిన 76 శాతం వాటా విక్రయానికి ఏ కంపెనీ కూడా స్పందించకపోవడంతో ఈ వాటా విక్రయాన్ని ప్రసుత్తం పక్కకు పెట్టామని పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చిన తరుణంలో భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం సరైనది కాదనే భావనతో ఎయిర్ ఇండియా వాటా విక్రయాన్ని తాత్కాలికంగా నిలిపేశామని మంగళవారమే ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.
విదేశీ రూట్లలో ’మహారాజా’ సీట్లు: మరింత మంది ప్రయాణికులను ఆకర్షించే దిశగా అంతర్జాతీయ రూట్లలో నడిపే ఎయిరిండియా ఫ్లయిట్స్‌లోని బిజినెస్ తరగతిలో ’మహారాజా’ సీట్లు, సిబ్బందికి కొత్త యూనిఫాం, కొంగొత్త వంటకాలు మొదలైన హంగులను ప్రవేశపెట్టనున్నట్లు జయంత్ సిన్హా తెలిపారు. సుదీర్ఘ, స్వల్ప దూరాల ప్రయాణాలకు ఉపయోగించే బోయింగ్ 777, 787 విమానాల్లో ప్రస్తుతమున్న ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ సీట్లను ఈ మేరకు మార్చనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment