కార్డు చెల్లింపులపై ఎండీఆర్ చార్జీలు తగ్గించే యోచన!
డిజిటల్ పేమెంట్ల ప్రోత్సాహం లక్ష్యం
న్యూఢిల్లీ: డెబిట్ కార్డ్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)ను తగ్గించే విషయాన్ని కేంద్రం యోచిస్తోంది. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యమని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మంగళవారం ఇక్కడ తెలిపారు. లావాదేవీల పరిమాణం పెరిగితే ఎండీఆర్‌ను చార్జీలను తగ్గించే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉందని వివరించారు. ఎండీఆర్ చార్జీల తగ్గింపునకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఇటీవల విడుదల చేసిన ఒక ముసాయిదాను కేంద్రం పరిశీలిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
ఏప్రిల్ 1వ తేదీ నుంచీ డెబిట్ కార్డ్ పేమెంట్లపై ఎండీఆర్ చార్జీల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని ఇటీవలి తన ఒక నివేదికలో ఆర్‌బీఐ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రూ.2,000 వరకూ లావాదేవీపై ఎండీఆర్ పరిమితి 0.75 శాతంకాగా, ఆపైన 1 శాతంగా ఉంది. అయితే ఈ చార్జీల తగ్గింపు డిజిటల్ చెల్లింపుల బాటలో చిన్న వర్తకులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆర్‌బీఐ తన ముసాయిదా పత్రంలో పేర్కొంది.