మొబైల్‌కు చెల్లు.. ఆధార్ చాలు!
నగదు చెల్లింపులు, స్వీకరణకు ఆధార్ పే
• త్వరలోనే ప్రారంభం: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడి
• ఆధార్‌తో రెండేళ్లలో రూ.36,144 కోట్లు ఆదా అయినట్టు వెల్లడి
న్యూఢిల్లీ: చేతిలో ఫోన్ లేకపోయినా... దగ్గర డెబిట్ కార్డు లేకున్నా... ఆధార్ నంబర్ ఒక్కటీ గుర్తుంచుకుంటే చాలు... ఎక్కడైనా సులభంగా నగదు చెల్లింపులు చేసేయవచ్చు. నగదు తీసుకోవొచ్చు. ఆధార్ నంబర్‌తో చెల్లింపులు, నగదు స్వీకరణలకు వీలు కల్పించే ‘ఆధార్ పే’ సేవను అతి త్వరలోనే ప్రభుత్వం పట్టాలెక్కించనుంది. ‘‘ఆధార్ పే సేవను ప్రారంభించబోతున్నాం. దీంతో నగదు చెల్లింపులకు ఫోన్‌ను తమ వెంట తీసుకుని వెళ్లనవసరం లేదు. ఏ దుకాణానికైనా వెళ్లి తమ ఆధార్ నంబర్ చెప్పి, వేలి ముద్రలు వేయడం ద్వారా నగదు చెల్లించవచ్చు, స్వీకరించవచ్చు’’ అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం ఢిల్లీలో మీడియాకు చెప్పారు. ఆధార్ పే సర్వీస్ పరిధిలోకి ఇప్పటి వరకు 14 బ్యాంకులు వచ్చి చేరాయని, మిగిలిన బ్యాంకులతోనూ చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు.
అతి త్వరలోనే ఈ సర్వీసును ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. కొన్ని బ్యాంకులు ఆధార్ పేకు సంబంధించి ఇప్పటికే సొంతంగా అప్లికేషన్‌ను అభివృద్ధి చేశాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీటి పనితీరును పరీక్షిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. యూపీఐ ప్లాట్‌ఫామ్ ఆధారితంగా పనిచేసే భీమ్ యాప్‌ను అన్ని చెల్లింపులకు వీలుగా ఇటీవల కేంద్ర సర్కారు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా, భీమ్ యాప్‌ని ఆధార్ చెల్లింపుల విధానంతో అనుసంధానించనున్నట్టు మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 111 కోట్ల మందికిపైగా ఆధార్ నంబర్ కలిగి ఉన్నారని పేర్కొన్నారు. సమాచార దుర్వియోగంపై ప్రజలు తరచుగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారని, కానీ ఆధార్ చట్టం ప్రజల సమాచార గోప్యతను పూర్తిగా గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
49 కోట్ల బ్యాంకు ఖాతాలతో అనుసంధానం
‘‘ఆధార్‌ను మునుపటి ప్రభుత్వం ప్రారంభించిందన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ, ఆ సమయంలో ఇది కేవలం ప్రజల డిజిటల్ గుర్తింపుగానే ఉంది. నరేంద్ర మోదీ సర్కారు మాత్రం చాలా చర్యలను చేపట్టింది. దీంతో ఆధార్ అనేది ఆర్థికపరంగా శక్తిమంతమైన ఉపకరణంగా, భవిష్యత్తును మార్చేదిగా మారిపోయింది’’ అని మంత్రి వివరించారు. ఇప్పటి వరకు 49 కోట్ల బ్యాంకు ఖాతాలు ఆధార్ నంబర్‌తో అనుసంధానమై ఉన్నాయని, ప్రతి నెలా రెండు కోట్ల ఖాతాలు ఆధార్ నంబర్‌తో అనుసంధానిస్తున్నట్టు చెప్పారు.
ఆధార్ నంబర్ ద్వారా చెల్లింపుల విధానం ఇప్పటికే అమల్లో ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో 33 కోట్ల లావాదేవీలు జరిగాయని మంత్రి వెల్లడించారు. లావాదేవీలకు ఆధార్‌ను ఉపయోగించడం వల్ల 2014–15, 2015–16లో రూ.36,144 కోట్లు ఆదా అయినట్టు చెప్పారు. 2014 మేలో ఎన్‌డీఏ సర్కారు ఏర్పాటయ్యే నాటికి 63.22 కోట్ల ఆధార్ నమోదు జరగ్గా... గతేడాది అక్టోబర్ వరకు రోజుకు 5–6 లక్షల చొప్పున ఆధార్ నమోదు జరుగుతూ వచ్చింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఆధార్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఆధార్ నమోదు, వివరాల అప్‌డేట్‌కు సంబంధించి వినతులు రోజుకు 7–8 లక్షలకు పెరిగిపోయాయి.