Cash payments
-
పండుగ వేళ .. తగ్గిన నోట్ల వినియోగం
ముంబై: దీపావళి పండుగ వారంలో చలామణీలో ఉన్న నగదు (సీఐసీ) పరిమాణం రూ. 7,600 కోట్ల మేర తగ్గింది. రెండు దశాబ్దాల్లో ఇంత భారీ స్థాయిలో తగ్గడం జరగడం ఇదే ప్రథమం. డిజిటల్ చెల్లింపులపై ప్రజలు ఎక్కువగా ఆధారపడుతుండటం ఇందుకు దోహదపడిందని ఒక నివేదికలో ఎస్బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 2009లో దీపావళి వారంలో కూడా సీఐసీ స్వల్పంగా రూ. 950 కోట్ల మేర తగ్గినప్పటికీ, అప్పట్లో తలెత్తిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ ప్రేరేపిత మందగమనం ఇందుకు కారణమని వారు తెలిపారు. టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు భారత పేమెంట్ వ్యవస్థ రూపురేఖలను మార్చేశాయని ఆర్థికవేత్తలు చెప్పారు. నగదు ఆధారిత ఎకానమీ నుంచి స్మార్ట్‌ఫోన్ ఆధారిత పేమెంట్ వ్యవస్థగా భారత్ రూపాంతరం చెందిందని వివరించారు. చెల్లింపు విధానాల్లో సీఐసీ వాటా 2016 ఆర్థిక సంవత్సరంలో 88 శాతంగా ఉండగా, 2022 ఆర్థిక సంవత్సరంలో 20 శాతానికి తగ్గింది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 11.15 శాతానికి తగ్గుతుందని అంచనా. అలాగే 2016 ఆర్థిక సంవత్సరంలో 11.26 శాతంగా ఉన్న డిజిటల్ లావాదేవీల వాటా 2022 ఆర్థిక సంవత్సరంలో 80.4 శాతానికి చేరగా, 2027 నాటికి 88 శాతానికి చేరవచ్చని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. -
డిజిటల్ వద్దు క్యాషే ముద్దు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావాలతో డిజిటల్ చెల్లింపుల విధానాలకు మారినా, ఇప్పటికీ దేశీయంగా ప్రజలు ఎక్కువగా నగదు చెల్లింపుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేందుకు పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007 (పీఎస్ఎస్)ను పునఃసమీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ (వీసీఎల్పీ) ఒక నివేదికలో ఈ అంశాలు పేర్కొంది. భారత్‌లో డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ ఇంకా ప్రాథమిక దశలో ఉన్నప్పుడు దాదాపు దశాబ్దకాలం క్రితం పేమెంట్స్ వ్యవస్థల నియంత్రణ కోసం పీఎస్ఎస్ చట్టం చేశారని నివేదిక తెలిపింది. మారుతున్న పరిస్థితులను బట్టి నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ మధ్యమధ్యలో పలు మార్గదర్శకాలు చేస్తున్నప్పటికీ, ఇవి సరిపోవని వివరించింది. రిటైల్ డిజిటల్ చెల్లింపుల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందేందుకు, దీనికి సంబంధించిన చట్టాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని వీసీఎల్పీ తెలిపింది. -
పన్ను కట్టే విధమెట్టిదనిన...
ఈ కాలంలో అందరూ మాట్లాడుకునేది కేవలం ఆదాయపు పన్ను గురించే.. దీన్ని ఎలా చెల్లించాలి అంటే .. ఇప్పుడు నగదు చెల్లింపులు లేవు. అన్నీ బ్యాంకు ద్వారా చేయడమే. చలాన్ సరిగ్గా నింపి మీకు ఏ బ్యాంకులో అకౌంటు ఉందో అందులో ‘యువర్–సెల్ఫ్‘ అని మీ చెక్ రాసి ఇస్తే, బ్యాంకు వాళ్లు అప్పటికప్పుడో లేదా ఆ తర్వాతో మీకు చలాన్ ఇస్తారు. ఆన్లైన్ విధానంలోనూ చెల్లించవచ్చు. తగిన జాగ్రత్తలు వహించి చేయాలి. పేమెంట్ పూర్తయిన తర్వాత ఆటోమేటిక్‌గా చలాన్ జనరేట్ అవుతుంది. ఈ చలాన్లను జాగ్రత్తగా భద్రపర్చుకోండి. మీ పేరు, పాన్, అసెస్మెంట్ సంవత్సరం మొదలైనవన్నీ జాగ్రత్తగా రాయండి. ప్రస్తుతం అందరూ రిటర్నులు వేస్తున్నారు. పన్ను భారాన్ని లెక్కించి, అందులోనుంచి అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్ మినహాయించగా ఇంకా భారం చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించాలి. ఇలాంటి మొత్తాన్ని చెల్లించడాన్ని ‘సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్‘ అంటారు. దీనితో సాధారణ పరిస్థితుల్లో ఎటువంటి తేడాలు, తప్పులు, తడకలు లేకపోతే పన్నుభారం ఏర్పడదు. టైప్ ఆఫ్ పేమెంట్ దగ్గర ’300’ నంబర్ దగ్గర టిక్ చేయాలి. రిటర్నులను ఫైల్ చేసిన తర్వాత అధికారులు వాటిని చెక్ చేస్తారు. దీనినే మదింపు లేదా అసెస్మెంట్ అని అంటారు. ఈ అసెస్మెంట్ వలన ఆదాయం మారవచ్చు. డిడక్షన్లు మారవచ్చు. మినహాయింపు మారవచ్చు. ఫలితంగా పన్నుభారం మారవచ్చు. ఇంకా పన్ను చెల్లించాల్సి ఉంటే ’డిమాండ్’ అని చెప్తారు ఆర్డర్లో. ఆ మొత్తం చెల్లించేటప్పుడు ’400’ అనే కాలం దగ్గర టిక్ చేయాలి. దీనిని ’ట్యాక్స్ ఆన్ రెగ్యులర్ అసెస్మెంట్’ అని అంటారు. ఒకవేళ రిఫండ్ ఉంటే దాన్ని నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు. స్థిరాస్తి అమ్మకం మీద టీడీఎస్ చెల్లించేటప్పుడు కాలం ’800’ దగ్గర టిక్ చేయాలి. మరో ముఖ్యమైన పద్ధతి.. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం. ఈ మొత్తాన్ని చెల్లించేటప్పుడు కాలం ’100’ దగ్గర టిక్ చేయాలి. మీకు తెలిసే ఉంటుంది. మీరు చెల్లించాల్సిన పన్ను భారాన్ని ముందుగానే లెక్కించి, టీడీఎస్ మొత్తాన్ని తీసివేయగా.. మిగిలిన మొత్తం రూ. 10,000 (పది వేల రూపాయలు) దాటితే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. ఇలాంటి మొత్తాన్ని నాలుగు వాయిదాలలో చెల్లించాలి. మొదటి విడతలో 15 శాతం (జూన్ 15 లోగా), రెండో విడత 30 శాతం (సెప్టెంబర్ 15 లోగా), మూడో విడత 30 శాతం (డిసెంబర్ 15 లోగా), చివరి విడత 25 శాతం (మార్చి 15 లోగా) కట్టాలి. దీనికి సంబంధించి జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో గడువు తేదీలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఈ ప్రకారం చెల్లించినప్పుడు సరిగ్గా వివరాలు రాయండి. ఈ విధంగా ఒక అసెసీ తన పన్ను భారాన్ని అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఏ అసెస్మెంట్ సంవత్సరం, ఏ టైప్ అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. తదనుగుణంగా పన్ను భారం చెల్లించాలి. -
10.75 కోట్ల మంది రైతులకు 1.15 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: పీఎం కిసాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10.75 కోట్ల మంది రైతులకు వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లో రూ. 1.15 లక్షల కోట్ల రూపాయలను జమ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. అర్హులైన రైతులందరూ లబ్ధిదారుల జాబితాలో చేరేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. ఇప్పటికీ కొందరు రైతులు తమకు పీఎం కిసాన్ డబ్బులు అందడం లేదని ఫిర్యాదు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. 14.5 కోట్ల మంది రైతులను ఈ పథకంలో చేర్చాలని మొదట లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ పథకం రెండో వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో తోమర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాను అందజేస్తే పశ్చిమబెంగాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. సాగు చట్టాల అమలును నిలిపేసిన ఏడాదిన్నర సమయంలో సంయుక్తంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని వ్యవసాయ చట్టాల్లోని అభ్యంతరాలపై చర్చించి, పరిష్కారం సాధిద్దామని రైతు నేతలకు ప్రతిపాదించామన్నారు. సాగు చట్టాలను రద్దు చేయనట్లయితే.. 40 లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తామన్న రైతు నేత రాకేశ్ తికాయత్ హెచ్చరికపై స్పందిస్తూ.. రైతులతో చర్చించేందుకు తమ ప్రభుత్వం సదా సిద్ధంగానే ఉంటుందన్నారు. ఇప్పటికీ వారి నుంచి స్పందన వస్తే చర్చలు పునః ప్రారంభిస్తామని వెల్లడించారు. రెట్టింపు ఆదాయమే లక్ష్యం ‘దేశానికి అన్నం పెడుతున్న రైతులు గౌరవప్రదంగా జీవించాలన్న ఉద్దేశంతో సరిగ్గా రెండేళ్ల క్రితం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించాం’ అని ‘పీఎం కిసాన్’ పథకం రెండో వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని, పంటల కనీస మద్దతు ధరను చరిత్రాత్మక స్థాయిలో పెంచామని ప్రధాని పేర్కొన్నారు. గత ఏడేళ్లుగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు. మెరుగైన సాగునీటి సదుపాయాలు, సులువైన రుణ సదుపాయం, పంట బీమా, దళారుల తొలగింపు.. తదితర చర్యలు తీసుకున్నామన్నారు. రైతుల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యలను నమో యాప్‌లో చూడవచ్చన్నారు. 2019 ఫిబ్రవరి 24న ‘పీఎం కిసాన్’ పథకాన్ని ప్రధానిమోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
భారత్‌కు రెమిటెన్సుల్లో మహిళలే టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశాల నుంచి భారత్‌లోని బంధువులకు, స్నేహితులకు నగదు చెల్లింపుల్లో (రెమిటెన్సులు) మహిళలూ ముందున్నారు. డిజిటల్ పేమెంట్స్ కంపెనీ వరల్డ్‌రెమిట్ వేదికగా 2015 సెప్టెంబరు నుంచి 2020 సెప్టెంబరు వరకు ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ఏ నుంచి భారత్‌కు వచ్చిన రెమిటెన్సుల ప్రకారం.. మొత్తం చెల్లింపుల్లో భారతీయ మహిళలు పంపినవి ఆస్ట్రేలియాలో 18 నుంచి 26 శాతానికి, యూకేలో 21 నుంచి 32 శాతానికి పెరిగాయి. యూఎస్ఏ విషయంలో ఇది 25 నుంచి 24 శాతానికి వచ్చింది. ఆస్ట్రేలియా, యూకేల్లో సేవల రంగం విస్తృతి ఈ పెరుగుదలకు కారణం కావొచ్చు. ఆస్ట్రేలియాలో మొత్తం ఉద్యోగుల్లో సేవల రంగం వాటా అత్యధికంగా 87 శాతం ఉంది. యూఎస్ఏ, యూకే నుంచి భారత్‌కు నగదు పంపుతున్న మహిళల్లో 35, ఆపైన వయసున్న వారు అధికంగా ఉన్నారు. ఆస్ట్రేలియా విషయంలో 25–30 ఏళ్ల వయసున్న వారు ఎక్కువ. పరిమాణం పరంగా యూఎస్ఏ నుంచి భారత్‌కు అత్యధికంగా హైదరాబాద్‌కు చెల్లింపులు జరుగుతున్నాయి. లుధియానా, అమృత్సర్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని వరల్డ్‌రెమిట్ దక్షిణాసియా డైరెక్టర్ రుజాన్ అహ్మద్ తెలిపారు. భారత్‌కు నగదు పంపుతున్న టాప్–10 దేశాల వాటా ఏటా రూ.5.81 లక్షల కోట్లు అని చెప్పారు. అత్యధికంగా నగదును స్వీకరిస్తున్న దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉందన్నారు. -
డిసెంబర్ నాటికి వాట్సాప్ పేమెంట్ సేవలు
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఈ ఏడాది ఆఖరు నాటికల్లా నగదు చెల్లింపుల సేవలను దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ గ్లోబల్ హెడ్ విల్ కాథ్‌కార్ట్ వెల్లడించారు. మెసేజ్ పంపినంత సులువుగా నగదు బదిలీ ప్రక్రియను సులభతరం చేయాలన్నది తమ లక్ష్యమని ఆయన వివరించారు. ‘యూపీఐ ప్రాతిపదికన భారతీయ బ్యాంకులతో కలిసి పేమెంట్స్ వ్యవస్థను రూపొందించాం. దీన్ని సరిగ్గా అమలు చేయగలిగితే భారత్‌లో మరింత మందిని ఆర్థిక సేవల పరిధిలోకి తేవొచ్చు. అలాగే డిజిటల్ ఎకానమీలోకి భాగంగా చేయొచ్చు. ఈ ఏడాది ఆఖర్లోగా పేమెంట్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం‘ అని గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విల్ చెప్పారు. అయితే, దీనికి నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు వచ్చాయా లేదా అన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్లో భాగమైన వాట్సాప్..చెల్లింపుల సేవల విషయంలో పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తదితర సంస్థలతో పోటీపడాల్సి ఉంటోంది. ప్రస్తుతం వాట్సాప్ ప్రయోగాత్మకంగా కొంత మంది యూజర్లకు మాత్రమే పేమెంట్ సేవలను ప్రయోగాత్మకంగా అందిస్తోంది. భారతీయ యూజర్ల చెల్లింపుల డేటాను భారత్‌లోనే భద్రపర్చాలన్న నిబంధనను పాటించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇటీవలే సంస్థ వెల్లడించింది. జూలైలో ట్రయల్ రన్ పూర్తవుతుందని, రిజర్వ్ బ్యాంక్ అనుమతులన్నీ వచ్చాకే పూర్తి స్థాయిలో సేవలను ప్రారంభిస్తామని ఈ ఏడాది మే లో సుప్రీం కోర్టుకు తెలియజేసింది. 2017 నాటి గణాంకాల ప్రకారం వాట్సాప్‌కు భారత్‌లో 20 కోట్ల మంది పైగా యూజర్లు ఉన్నారు. -
మొబైల్‌కు చెల్లు.. ఆధార్ చాలు!
నగదు చెల్లింపులు, స్వీకరణకు ఆధార్ పే • త్వరలోనే ప్రారంభం: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడి • ఆధార్‌తో రెండేళ్లలో రూ.36,144 కోట్లు ఆదా అయినట్టు వెల్లడి న్యూఢిల్లీ: చేతిలో ఫోన్ లేకపోయినా... దగ్గర డెబిట్ కార్డు లేకున్నా... ఆధార్ నంబర్ ఒక్కటీ గుర్తుంచుకుంటే చాలు... ఎక్కడైనా సులభంగా నగదు చెల్లింపులు చేసేయవచ్చు. నగదు తీసుకోవొచ్చు. ఆధార్ నంబర్‌తో చెల్లింపులు, నగదు స్వీకరణలకు వీలు కల్పించే ‘ఆధార్ పే’ సేవను అతి త్వరలోనే ప్రభుత్వం పట్టాలెక్కించనుంది. ‘‘ఆధార్ పే సేవను ప్రారంభించబోతున్నాం. దీంతో నగదు చెల్లింపులకు ఫోన్‌ను తమ వెంట తీసుకుని వెళ్లనవసరం లేదు. ఏ దుకాణానికైనా వెళ్లి తమ ఆధార్ నంబర్ చెప్పి, వేలి ముద్రలు వేయడం ద్వారా నగదు చెల్లించవచ్చు, స్వీకరించవచ్చు’’ అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం ఢిల్లీలో మీడియాకు చెప్పారు. ఆధార్ పే సర్వీస్ పరిధిలోకి ఇప్పటి వరకు 14 బ్యాంకులు వచ్చి చేరాయని, మిగిలిన బ్యాంకులతోనూ చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు. అతి త్వరలోనే ఈ సర్వీసును ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. కొన్ని బ్యాంకులు ఆధార్ పేకు సంబంధించి ఇప్పటికే సొంతంగా అప్లికేషన్‌ను అభివృద్ధి చేశాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీటి పనితీరును పరీక్షిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. యూపీఐ ప్లాట్‌ఫామ్ ఆధారితంగా పనిచేసే భీమ్ యాప్‌ను అన్ని చెల్లింపులకు వీలుగా ఇటీవల కేంద్ర సర్కారు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా, భీమ్ యాప్‌ని ఆధార్ చెల్లింపుల విధానంతో అనుసంధానించనున్నట్టు మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 111 కోట్ల మందికిపైగా ఆధార్ నంబర్ కలిగి ఉన్నారని పేర్కొన్నారు. సమాచార దుర్వియోగంపై ప్రజలు తరచుగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారని, కానీ ఆధార్ చట్టం ప్రజల సమాచార గోప్యతను పూర్తిగా గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. 49 కోట్ల బ్యాంకు ఖాతాలతో అనుసంధానం ‘‘ఆధార్‌ను మునుపటి ప్రభుత్వం ప్రారంభించిందన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ, ఆ సమయంలో ఇది కేవలం ప్రజల డిజిటల్ గుర్తింపుగానే ఉంది. నరేంద్ర మోదీ సర్కారు మాత్రం చాలా చర్యలను చేపట్టింది. దీంతో ఆధార్ అనేది ఆర్థికపరంగా శక్తిమంతమైన ఉపకరణంగా, భవిష్యత్తును మార్చేదిగా మారిపోయింది’’ అని మంత్రి వివరించారు. ఇప్పటి వరకు 49 కోట్ల బ్యాంకు ఖాతాలు ఆధార్ నంబర్‌తో అనుసంధానమై ఉన్నాయని, ప్రతి నెలా రెండు కోట్ల ఖాతాలు ఆధార్ నంబర్‌తో అనుసంధానిస్తున్నట్టు చెప్పారు. ఆధార్ నంబర్ ద్వారా చెల్లింపుల విధానం ఇప్పటికే అమల్లో ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో 33 కోట్ల లావాదేవీలు జరిగాయని మంత్రి వెల్లడించారు. లావాదేవీలకు ఆధార్‌ను ఉపయోగించడం వల్ల 2014–15, 2015–16లో రూ.36,144 కోట్లు ఆదా అయినట్టు చెప్పారు. 2014 మేలో ఎన్డీఏ సర్కారు ఏర్పాటయ్యే నాటికి 63.22 కోట్ల ఆధార్ నమోదు జరగ్గా... గతేడాది అక్టోబర్ వరకు రోజుకు 5–6 లక్షల చొప్పున ఆధార్ నమోదు జరుగుతూ వచ్చింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఆధార్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఆధార్ నమోదు, వివరాల అప్డేట్కు సంబంధించి వినతులు రోజుకు 7–8 లక్షలకు పెరిగిపోయాయి. -
ఐదువేలు దాటితే నో క్యాష్ పేమెంట్స్!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నగదు చెల్లింపులపై అన్ని ప్రభుత్వ శాఖలకు కీలక ఆదేశాలు జారీచేశారు. కాంట్రాక్టర్లు, వ్యాపారులకు ఐదువేలు దాటి నగదు చెల్లింపులు చేయవద్దని, ఐదువేలకు మించిన బిల్లులన్నింటికీ ఈ-పేమెంట్ సౌకర్యాన్ని వాడుకోవాలని ఆదేశించారు. గత ఆగస్టులో నగదు చెల్లింపులపై రూ. 10వేల వరకు పరిమితి విధించగా, ఇప్పుడు దానిని కేంద్రం రూ. 5వేలకు కుదించింది. ప్రభుత్వ చెల్లింపులన్నీ డిజిటలైజ్ చేసి.. ఈ-పేమెంట్స్‌ను ప్రోత్సహించాలన్న సంకల్పంతో అన్ని మంత్రిత్వశాఖలకు ఈ ఉత్తర్వులను జారీచేస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ తన ఉత్తర్వుల్లో తెలిపింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఈ-పేమెంట్స్‌ను మరింతగా ప్రోత్సహించాలని, దేశమంతటా నగదు రహిత చెల్లింపుల విధానం తీసుకురావాలని కేంద్రం సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి జైట్లీ ఆమోదంతో ఈ ఉత్తర్వులు జారీఅయ్యాయి.