న్యూఢిల్లీ: పీఎం కిసాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10.75 కోట్ల మంది రైతులకు వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లో రూ. 1.15 లక్షల కోట్ల రూపాయలను జమ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. అర్హులైన రైతులందరూ లబ్ధిదారుల జాబితాలో చేరేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. ఇప్పటికీ కొందరు రైతులు తమకు పీఎం కిసాన్ డబ్బులు అందడం లేదని ఫిర్యాదు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. 14.5 కోట్ల మంది రైతులను ఈ పథకంలో చేర్చాలని మొదట లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఈ పథకం రెండో వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో తోమర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాను అందజేస్తే పశ్చిమబెంగాల్‌లోనూ ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. సాగు చట్టాల అమలును నిలిపేసిన ఏడాదిన్నర సమయంలో సంయుక్తంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని వ్యవసాయ చట్టాల్లోని అభ్యంతరాలపై చర్చించి, పరిష్కారం సాధిద్దామని రైతు నేతలకు ప్రతిపాదించామన్నారు. సాగు చట్టాలను రద్దు చేయనట్లయితే.. 40 లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తామన్న రైతు నేత రాకేశ్ తికాయత్ హెచ్చరికపై స్పందిస్తూ.. రైతులతో చర్చించేందుకు తమ ప్రభుత్వం సదా సిద్ధంగానే ఉంటుందన్నారు. ఇప్పటికీ వారి నుంచి స్పందన వస్తే చర్చలు పునః ప్రారంభిస్తామని వెల్లడించారు.
రెట్టింపు ఆదాయమే లక్ష్యం
‘దేశానికి అన్నం పెడుతున్న రైతులు గౌరవప్రదంగా జీవించాలన్న ఉద్దేశంతో సరిగ్గా రెండేళ్ల క్రితం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించాం’ అని ‘పీఎం కిసాన్’ పథకం రెండో వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని, పంటల కనీస మద్దతు ధరను చరిత్రాత్మక స్థాయిలో పెంచామని ప్రధాని పేర్కొన్నారు. గత ఏడేళ్లుగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు. మెరుగైన సాగునీటి సదుపాయాలు, సులువైన రుణ సదుపాయం, పంట బీమా, దళారుల తొలగింపు.. తదితర చర్యలు తీసుకున్నామన్నారు. రైతుల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యలను నమో యాప్‌లో చూడవచ్చన్నారు. 2019 ఫిబ్రవరి 24న ‘పీఎం కిసాన్’ పథకాన్ని ప్రధానిమోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment