
సాక్షి, ఢిల్లీ : వ్యవసాయ రంగంలో స్వావలంబన దిశగా కేంద్ర ప్రభుత్వం మరొక నూతన పథకాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రూ.లక్ష కోట్లతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీనిద్వారా దేశంలోని సుమారు 8.5 కోట్ల మంది రైతులకు 2వేల రూపాయల చొప్పున రూ.17 వేల కోట్లు పంపిణీ చేయనున్నారు. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖల మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తోపాటు ఇతర అధికారులు, రైతులు ఆన్‌లైన్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు.
వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద పంట దిగుబడులను కాపాడుకునేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించనున్నారు. ఈ రూ.లక్ష కోట్ల నిధిని రైతులకు చేర్చేందుకు ఇప్పటికే దేశంలోని 11 ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవసాయ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. పథకంలో భాగంగా అందించే రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీ, రెండు కోట్ల రూపాయల వరకూ క్రెడిట్ గ్యారంటీ లభించనుంది. 2018 డిసెంబర్ ఒకటవ తేదీన ప్రారంభమైన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు నేరుగా నగదు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఇప్పటివరకూ 9.9 కోట్ల మంది రైతులకు సుమారు రూ.75 వేల కోట్లు పంపిణీ చేశామని పేర్కొంది. కోవిడ్–19 కష్ట కాలంలోనూ రైతులను ఆదుకునేందుకు రూ.22 వేల కోట్లు విడుదల చేశామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment