న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఈ ఏడాది ఆఖరు నాటికల్లా నగదు చెల్లింపుల సేవలను దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ గ్లోబల్ హెడ్ విల్ కాథ్‌కార్ట్ వెల్లడించారు. మెసేజ్ పంపినంత సులువుగా నగదు బదిలీ ప్రక్రియను సులభతరం చేయాలన్నది తమ లక్ష్యమని ఆయన వివరించారు. ‘యూపీఐ ప్రాతిపదికన భారతీయ బ్యాంకులతో కలిసి పేమెంట్స్ వ్యవస్థను రూపొందించాం. దీన్ని సరిగ్గా అమలు చేయగలిగితే భారత్‌లో మరింత మందిని ఆర్థిక సేవల పరిధిలోకి తేవొచ్చు. అలాగే డిజిటల్ ఎకానమీలోకి భాగంగా చేయొచ్చు. ఈ ఏడాది ఆఖర్లోగా పేమెంట్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం‘ అని గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విల్ చెప్పారు.
అయితే, దీనికి నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు వచ్చాయా లేదా అన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్‌లో భాగమైన వాట్సాప్..చెల్లింపుల సేవల విషయంలో పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తదితర సంస్థలతో పోటీపడాల్సి ఉంటోంది. ప్రస్తుతం వాట్సాప్ ప్రయోగాత్మకంగా కొంత మంది యూజర్లకు మాత్రమే పేమెంట్ సేవలను ప్రయోగాత్మకంగా అందిస్తోంది. భారతీయ యూజర్ల చెల్లింపుల డేటాను భారత్‌లోనే భద్రపర్చాలన్న నిబంధనను పాటించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇటీవలే సంస్థ వెల్లడించింది. జూలైలో ట్రయల్ రన్ పూర్తవుతుందని, రిజర్వ్ బ్యాంక్ అనుమతులన్నీ వచ్చాకే పూర్తి స్థాయిలో సేవలను ప్రారంభిస్తామని ఈ ఏడాది మే లో సుప్రీం కోర్టుకు తెలియజేసింది. 2017 నాటి గణాంకాల ప్రకారం వాట్సాప్‌కు భారత్‌లో 20 కోట్ల మంది పైగా యూజర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment