ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య
ఈ కాలంలో అందరూ మాట్లాడుకునేది కేవలం ఆదాయపు పన్ను గురించే.. దీన్ని ఎలా చెల్లించాలి అంటే .. ఇప్పుడు నగదు చెల్లింపులు లేవు. అన్నీ బ్యాంకు ద్వారా చేయడమే. చలాన్ సరిగ్గా నింపి మీకు ఏ బ్యాంకులో అకౌంటు ఉందో అందులో ‘యువర్–సెల్ఫ్‘ అని మీ చెక్ రాసి ఇస్తే, బ్యాంకు వాళ్లు అప్పటికప్పుడో లేదా ఆ తర్వాతో మీకు చలాన్ ఇస్తారు. ఆన్‌లైన్ విధానంలోనూ చెల్లించవచ్చు. తగిన జాగ్రత్తలు వహించి చేయాలి. పేమెంట్ పూర్తయిన తర్వాత ఆటోమేటిక్‌గా చలాన్ జనరేట్ అవుతుంది. ఈ చలాన్లను జాగ్రత్తగా భద్రపర్చుకోండి. మీ పేరు, పాన్, అసెస్‌మెంట్ సంవత్సరం మొదలైనవన్నీ జాగ్రత్తగా రాయండి.
ప్రస్తుతం అందరూ రిటర్నులు వేస్తున్నారు. పన్ను భారాన్ని లెక్కించి, అందులోనుంచి అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్ మినహాయించగా ఇంకా భారం చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించాలి. ఇలాంటి మొత్తాన్ని చెల్లించడాన్ని ‘సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్‘ అంటారు. దీనితో సాధారణ పరిస్థితుల్లో ఎటువంటి తేడాలు, తప్పులు, తడకలు లేకపోతే పన్నుభారం ఏర్పడదు. టైప్ ఆఫ్ పేమెంట్ దగ్గర ’300’ నంబర్ దగ్గర టిక్ చేయాలి. రిటర్నులను ఫైల్ చేసిన తర్వాత అధికారులు వాటిని చెక్ చేస్తారు. దీనినే మదింపు లేదా అసెస్‌మెంట్ అని అంటారు. ఈ అసెస్‌మెంట్ వలన ఆదాయం మారవచ్చు. డిడక్షన్లు మారవచ్చు. మినహాయింపు మారవచ్చు. ఫలితంగా పన్నుభారం మారవచ్చు.
ఇంకా పన్ను చెల్లించాల్సి ఉంటే ’డిమాండ్’ అని చెప్తారు ఆర్డర్‌లో. ఆ మొత్తం చెల్లించేటప్పుడు ’400’ అనే కాలం దగ్గర టిక్ చేయాలి. దీనిని ’ట్యాక్స్ ఆన్ రెగ్యులర్ అసెస్‌మెంట్’ అని అంటారు. ఒకవేళ రిఫండ్ ఉంటే దాన్ని నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు. స్థిరాస్తి అమ్మకం మీద టీడీఎస్ చెల్లించేటప్పుడు కాలం ’800’ దగ్గర టిక్ చేయాలి. మరో ముఖ్యమైన పద్ధతి.. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం. ఈ మొత్తాన్ని చెల్లించేటప్పుడు కాలం ’100’ దగ్గర టిక్ చేయాలి. మీకు తెలిసే ఉంటుంది. మీరు చెల్లించాల్సిన పన్ను భారాన్ని ముందుగానే లెక్కించి, టీడీఎస్ మొత్తాన్ని తీసివేయగా.. మిగిలిన మొత్తం రూ. 10,000 (పది వేల రూపాయలు) దాటితే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి.
ఇలాంటి మొత్తాన్ని నాలుగు వాయిదాలలో చెల్లించాలి. మొదటి విడతలో 15 శాతం (జూన్ 15 లోగా), రెండో విడత 30 శాతం (సెప్టెంబర్ 15 లోగా), మూడో విడత 30 శాతం (డిసెంబర్ 15 లోగా), చివరి విడత 25 శాతం (మార్చి 15 లోగా) కట్టాలి. దీనికి సంబంధించి జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో గడువు తేదీలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఈ ప్రకారం చెల్లించినప్పుడు సరిగ్గా వివరాలు రాయండి.
ఈ విధంగా ఒక అసెసీ తన పన్ను భారాన్ని అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్, సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఏ అసెస్‌మెంట్ సంవత్సరం, ఏ టైప్ అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. తదనుగుణంగా పన్ను భారం చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment