ఖజానా ఖాళీ..!
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి సాయం కోసం ఎదురుచూస్తోంది. ఓ వైపు ఐటీ శాఖ ఒత్తిడి.. మరో వైపు ఖజానా ఖాళీ అవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన కమిషనర్ నీరభ్ కుమార్ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. త్వరలో తాను బదిలీ అవుతానన్న ఉద్దేశంతోనే కమిషనర్ అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారని, ఫలితంగా హెచ్‌ఎండీఏ ఆర్థిక సంక్షోభం అంచుకు చేరువైందన్న విమర్శలున్నాయి.
ఇక, సర్కారు సైతం ఇప్పటి వరకు హెచ్‌ఎండీఏ స్థితిగతులపై సమీక్షించింది లేదు. గతంలో సర్కారు భూములు అమ్మిపెట్టడం ద్వారా వచ్చిన ఆదాయాన్నంతా ప్రభుత్వ ఖజానాకే హెచ్‌ఎండీఏ జమ చేసింది. అయితే, తనదికాని సొమ్ముకు సైతం రూ.720 కోట్లు ఆదాయ పన్ను కింద చెల్లించాల్సి రావడం ఆ సంస్థ పతనానికి దారి తీసింది.
ఇప్పటికే ఆదాయ పన్ను కింద రూ.235 కోట్లు ఐటీ శాఖకు చెల్లించిన హెచ్‌ఎండీఏ ఆ తర్వాత చేతులెత్తేసింది. దీంతో కన్నెర్ర జేసిన ఐటీ శాఖ నేరుగా చర్యలకు దిగి సంస్థ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. విధిలేక హెచ్‌ఎండీఏ ఐటీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి స్టే తెచ్చుకుని మనుగడ సాగిస్తోంది.
డబ్బుల్లేని ఖాతాలు..
హెచ్‌ఎండీఏకు 34 బ్యాంకుల్లో ఖాతాలున్నా వాటిలో రూ.10 కోట్లు కూడా లేవని తెలుస్తోంది. ఆయా ఖాతాల్లో డబ్బు వేస్తే ఐటీ శాఖ బకాయి కింద జమ చేసుకుంటుందన్న భయం అధికారులను వెంటాడుతోంది.
లేజర్ షో, పార్కులు, వాణిజ్య సముదాయాల అద్దెలు, లీజులు, వివిధ అనుమతుల ఫీజు రూపంలో నెలవారీగా సుమారు రూ.18-20 కోట్ల ఆదాయం హెచ్‌ఎండీఏకు వస్తోంది. ఈ అత్తెసరు ఆదాయాన్ని బ్యాంకుల్లో వేయకుండా డీడీలు తీసిపెట్టుకుని అవసరార్థం వినియోగించుకుంటున్నట్టు సమాచారం. ఇవి కూడా లేకపోతే సిబ్బంది జీతాలు, పింఛన్లు, పార్కుల నిర్వహణ, బ్యాంకు రుణాల వడ్డీ వంటివి చెల్లించలేని దుర్భర పరిస్థితి ఎదురవుతుంది. బొటాబొటీ ఆదాయంతో నెగ్గుకొస్తున్న ఈ తరుణంలో ఐటీ బకాయి కింద రూ.485 కోట్లు చెల్లించడం హెచ్‌ఎండీఏకు తలకుమించిన భారంగా మారింది. ఈ పరిస్థితిలో సర్కారు నుంచి తక్షణం ఆర్థిక సాయం అందితే తప్ప గండం నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు.