మీ అకౌంట్లోకి ఆ డబ్బులు వేసుకోవద్దు!
సంక్షేమ పథకాలకు ఎసరు వచ్చే ప్రమాదం... హెచ్చరిస్తున్న అధికారులు
సాక్షి, అమరావతి: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కమీషన్లకు ఆశపడి తమ బ్యాంకు అకౌంట్లలో ఇతరులకు డబ్బులు వేసుకోవడానికి అవకాశం కల్పిస్తే సంక్షేమ పథకాల లబ్ధికి ఎసరువచ్చే ప్రమాదం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఇప్పుడు అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా, ప్రభుత్వాలు సంక్షేమ పథకాల భారం తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఈ తరహా ఇబ్బంది ఉందని చెబుతున్నారు.
2.5 లక్షల లోపు డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేయడం వల్ల ఆదాయ పన్ను శాఖ నుంచి ఇబ్బంది ఉండదంటూ కొందరు నల్లకుబేరులు తెలిసిన వారి అకౌంట్లలో డబ్బులు జమ చేసి ఆ డబ్బును తెల్లధనంగా మార్చుకోవడానికి చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ లబ్ధిదారులు అప్రమత్తతతో వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆధార్ నంబర్.. సంక్షేమ పథకాలకు, బ్యాంకు అకౌంట్లకు కూడా అనుసంధానం అయి ఉందని, దీనివల్ల ప్రతి విషయం తెలుస్తుందని చెబుతున్నారు.